Avinash Reddy: సీబీఐ విచారణకు రావలసిందే!

ABN , First Publish Date - 2023-03-14T03:05:43+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కాకుండా కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

Avinash Reddy: సీబీఐ విచారణకు రావలసిందే!

హాజరు మినహాయింపు కుదరదు.. ఎంపీ అవినాశ్‌రెడ్డికి తేల్చిచెప్పిన టీ-హైకోర్టు

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కాకుండా కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. తన తీర్పును రిజర్వు చేశారు. వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయరాదని.. తనను విచారించకుండా అడ్డుకోవాలని.. తన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలని.. విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున స్పెషల్‌ పీపీలు నాగేంద్రన్‌, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. అవినాశ్‌రెడ్డి పాత్రకు సంబంధించిన వివరాలతో భారీ సీల్డ్‌ కవర్‌ను కోర్టుకు అందజేశారు. అందులో 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, హార్డ్‌డిస్క్‌, ఎవిడెన్స్‌ చార్ట్‌, ఆధారాలు చెరపకముందు, చెరిపిన తర్వాత తీసిన ఫొటోలు, వివేకా రాసిన లేఖ, ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌, కేసు డైరీ, అవినాశ్‌రెడ్డి వాంగ్మూలాల ఆడియో, వీడియోలు, ఇతర వాంగ్మూలాలు, దర్యాప్తు స్థాయీ నివేదిక, కీలక పత్రాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ హత్యలో అవినాశ్‌రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందన్నారు. హత్య జరిగిన తర్వాత అది గుండెపోటు అని నమ్మించడానికి అక్కడ ఉన్న ఆధారాలు మొత్తం అవినాశ్‌రెడ్డి చెరిపేశారని..

దీనికి సంబంధించిన అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ‘దర్యాప్తు కీలక దశకు చేరింది. ఆయన్ను మూడు సార్లు మాత్రమే విచారణకు పిలిచాం. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుంటే దర్యాప్తునకు ఆటంకాలు ఎదురవుతాయి. పిటిషనర్‌ అడిగిన విధంగా ఆయన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేశాం. ఆయన న్యాయవాదిని కూడా అనుమతించాం. అయితే విచారణ జరిగే గదిలోకి న్యాయవాదిని రానివ్వడం సాధ్యం కాదు. రానిస్తే భవిష్యత్‌లో అన్ని కేసులకు ఇది సంప్రదాయంగా మారుతుంది. హత్యలో ఆయనే కీలక పాత్ర పోషించారు. హత్య గురించి కబురు అందిన రెండు నిమిషాలకే వచ్చారు. ఉదయం 5 గంటలకు వచ్చి 7 గంటల వరకు మొత్తం ఆధారాలు చెరిపే కార్యక్రమం చేపట్టారు. అరెస్టు అడ్డుకోవడానికి పిటిషనర్‌ కుయుక్తులు పన్నుతున్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికే దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. తదుపరి విచారణను అడ్డుకోవడానికే అదనపు అఫిడవిట్‌ వేశారు. దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవద్దని నీహారికా వర్సెస్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పిటిషనర్‌ అడిగిన విధంగా ఆయన రెండు విజ్ఞప్తులను పరిష్కరించాం. ఈ కేసును కొట్టేయండి’ అని కోరారు. ఈ నెల 10న హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో సీబీఐ విచారణ ముగిశాక అవినాశ్‌రెడ్డి ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టారని న్యాయమూర్తి ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయం తనకు తెలియదని.. మరోసారి అలా చేయకూడదని సలహా ఇస్తానని ఆయన బదులిచ్చారు. సంచలన కేసులో కీలక దర్యాప్తు చేస్తున్న సీబీఐ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ ఎలా పెడతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోసారి అలా జరగదంటూ నిరంజన్‌రెడ్డి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. దీంతో ధర్మాసనం శాంతించింది. వివేకా హత్య కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసిన తర్వాత.. పిటిషనర్‌ తండ్రి భాస్కర్‌రెడ్డిని కడపకు విచారణకు రావాలని ఎలా పిలిచారని సీబీఐని ప్రశ్నించింది. భాస్కర్‌రెడ్డిని తామసలు పిలవనేలేదని.. ఆయనే వచ్చి వెళ్లిపోయారని సీబీఐ తరఫు న్యాయవాదులు బదులిచ్చారు. అన్ని పక్షాల వాదనలూ నమోదు చేసుకున్న ధర్మాసనం.. అవినాశ్‌రెడ్డి పిటిషన్‌లో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. 14న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొనడంతో ఆ విషయం సీబీఐకే చెప్పి మినహాయింపు కోరాలని సూచించింది. తీర్పు వచ్చేవరకు తదుపరి ఎగ్జామినేషన్‌ నిలిపేయాలన్న విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. ఏమో చెప్పలేం.. ఒక్కరోజులోనే తీర్పు రావొచ్చని సరదాగా వ్యాఖ్యానించింది.

సునీత, సీబీఐ కుమ్మక్కు: అవినాశ్‌రెడ్డి

తండ్రి హత్యతో బాధితురాలిగా మారానని పేర్కొంటున్న సునీతారెడ్డితో సీబీఐ కుమ్మక్కైందని.. ఆమె దాఖలు చేసే పిటిషన్లలో దర్యాప్తు సంస్థ హస్తముందని అవినాశ్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తాము లంచ్‌ మోషన్‌ దాఖలు చేసిన గంట వ్యవధిలోనే సునీతారెడ్డికి తెలియడమే దీనికి నిదర్శనమన్నారు. రెండో భార్య షేక్‌ షమీమ్‌కు వివేకా ద్వారా జన్మించిన కుమారుడికి వారసత్వం పోతుందనే భయంతో ఆమెను బెదిరించారని.. కోర్టు హాల్లో చదవడానికి వీల్లేని భాషలో వాట్సాప్‌ మెసేజ్‌లు పంపారంటూ ధర్మాసనానికి వాటిని అందజేశారు. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని. ఆయన్ను దర్యాప్తు నుంచి తప్పించాలని, కొత్త అధికారి నియమితులయ్యేవరకు పిటిషనర్‌ను విచారించకుండా ఆదేశాలివ్వాలని కోరారు.

ఎంపీ టికెట్‌ కోసమే హత్య: సునీతారెడ్డి

ఇంప్లీడ్‌ పిటిషనర్‌ సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కడప ఎంపీ టికెట్‌కు వివేకా అడ్డుగా ఉన్నారనే హత్య చేయించారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కావాలనే ఓడించారని తెలిపారు. పిటిషనర్‌ తప్పుడు ఆరోపణలతో దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

నేడు నాలుగోసారి అవినాశ్‌ విచారణ?

కడప, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): అవినాశ్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ విచారణకు నాలుగోసారి హాజరవ్వాల్సి ఉంది. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దర్యాప్తు సంస్థకు లేఖ రాసినట్లు తెలిసింది. సీబీఐ నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం విచారణకు హాజరవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Updated Date - 2023-03-14T04:01:16+05:30 IST