Avinash: సీబీఐ ముందుకు అవినాశ్
ABN , First Publish Date - 2023-06-11T03:13:20+05:30 IST
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
కీలక అంశాలపై ప్రశ్నలు
మరో అనుచరుడి విచారణ
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా వరుసగా రెండోవారం ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరించడం, రూ.4 కోట్ల నగదు లావాదేవీలతోపాటు సాక్ష్యాల తారుమారు, వాట్సాప్ కాల్స్ తదితర అంశాలపై అవినాశ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా... అవినాశ్‌ను ఈ కేసులో 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ అధికారులు, గత శనివారం విచారణకు హాజరైన సమయంలోనే ఆయనను అరెస్టు చేసి... వెంటనే పూచీకత్తు తీసుకుని బెయిల్‌పై విడుదల చేసిన విషయం తెలిసిందే.
అవినాశ్ అనుచరుడి విచారణ...
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అనుచరుడు రుషికేశవ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ‘జమ్మలమడుగుకు వెళ్తుండగా వివేకా హత్య గురించి ఫోన్ రావడంతో వెనక్కి వచ్చాం’ అని గతంలో ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అవినాశ్ కాల్ డేటా ఆధారంగా ఆయనను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. రుషి కేశవ రెడ్డిది జమ్మలమడుగు పంచాయతీ పరిధిలోని కన్నెలూరు. ఎంపీ ఎక్కడుంటే ఆయనా అక్కడే ఉంటారని తెలుస్తోంది.