100కు ఫోన్‌ చేశాకే క్షవరం

ABN , First Publish Date - 2023-07-10T03:44:43+05:30 IST

క్షురకుడు ఎవరైనా అరగుండు చేసిగానీ, కటింగ్‌ మధ్యలోగానీ వదిలేసి వెళ్లిపోతే... అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.

100కు ఫోన్‌ చేశాకే క్షవరం

కటింగ్‌ సగంలో క్షురకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు

100కి ఫోన్‌ చేసిన ‘కస్టమర్‌’.. స్పందించిన పోలీస్‌ అధికారులు

సెలూన్‌ యజమానిని తిరిగి పంపిన వైనం

అనంతపురం క్రైం, జూలై 9: క్షురకుడు ఎవరైనా అరగుండు చేసిగానీ, కటింగ్‌ మధ్యలోగానీ వదిలేసి వెళ్లిపోతే... అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. బయటకు వెళ్లలేడు. మరొకరు ఆ పని పూర్తి చేయరు. అలాంటి పరిస్థితే అనంతపురం నగర శివారులోని రుద్రంపేటలో ఓ వ్యక్తికి ఎదురైంది. రుద్రంపేటలోని సెలూన్‌కి ఓ ప్రైవేటు ఉద్యోగి ఆదివారం కటింగ్‌, షేవింగ్‌ చేయించుకోవడానికి వెళ్లాడు. కటింగ్‌ చేయించుకుంటుండగా... నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పయంబర్‌ వలి అక్కడికి వచ్చారు. భార్యాభర్తల గొడవ విషయంలో పోలీస్‌ స్టేసన్‌కు రావాలని సెలూన్‌ షాపు నిర్వాహకుడికి చెప్పారు. కటింగ్‌ మధ్యలో ఉన్నాననీ, పూర్తి చేసి వస్తానని క్షురకుడు చెప్పాడు. ‘‘సార్‌ (పోలీసు అధికారి) పిలుస్తున్నారు. కటింగ్‌ ఎవరైౖనా చేస్తారు. అర్జెంట్‌గా వచ్చేయ్‌’’ అంటూ పోలీస్‌ పద్ధతిలో చెప్పారు. దీంతో అతడు ఉన్నపళంగా హెచ్‌సీ వెంట వెళ్లిపోయాడు. కటింగ్‌ చేయించుకుంటున్న వ్యక్తికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అక్కడ మిగిలిన కటింగ్‌ పూర్తి చేయడానికి మరో వ్యక్తి లేడు. దీంతో డయల్‌-100కి ఫోన్‌ చేశాడు. వారు సంబంధిత స్టేషన్‌కు సమాచారం పంపారు. స్టేసన్‌లోని ఓ పోలీస్‌ అధికారి... ‘ఎవరితోనైనా చేయించుకో’ అని చెప్పారు. బాధితుడు... ‘ఎక్కడికి వెళ్లాలి? సంగం కటింగ్‌ ఎవరు చేస్తారు?’ అని ప్రశ్నించాడు. దీంతో తలలు పట్టుకున్న అధికారులు మళ్లీ అదే హెడ్‌ కానిస్టేబుల్‌తో క్షురకుడిని సెలూన్‌కు పంపారు. డయల్‌ 100కి ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తికి కటింగ్‌ పూర్తి చేయించి పంపారు.

Updated Date - 2023-07-10T03:44:55+05:30 IST