మండిన ఎండలు
ABN , First Publish Date - 2023-05-11T05:23:55+05:30 IST
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. భూ ఉపరితలం నుంచి
రాష్ట్రంలో రేపటి నుంచి వడగాడ్పులు
విశాఖపట్నం, అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. భూ ఉపరితలం నుంచి తీవ్ర వాయుగుండం దిశగా గాలులు వీయడం, ఇంకా రాష్ట్రంలో గడచిన పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎండలు పెరిగి, ఉక్కపోత అధికమైంది. జంగమహేశ్వరపురంలో 40.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటున్నందున ఎండలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే 12వ తేదీ నుంచి వడగాడ్పులు ప్రారంభమవుతాయని, ప్రధానంగా మధ్య, దక్షిణ కోస్తా, తూర్పు రాయలసీమలో 17వ తేదీ వరకు వడగాడ్పులు కొనసాగుతాయని ఇస్రో వాతావరణ నిపుణుడు హెచ్చరించారు. రానున్న రెండు రోజులు కోస్తా జిల్లాల్లో వడగాలులు పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తుఫాన్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఈ క్రమంలో గంటకు 17 కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ సాయంత్రానికి పోర్టుబ్లెయిర్‌కు 510 కి.మీ.ల పశ్చిమ నైరుతిగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ గురువారం ఉదయానికల్లా తుఫాన్‌గా బలపడనుంది. తర్వాత అదే దిశలో పయనిస్తూ గురువారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా, 12వ తేదీకి అతితీవ్ర తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ క్రమంలో ఉత్తర ఈశాన్యంగా దిశమార్చుకుని 13వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడుతుందని పేర్కొంది. 14వ తేదీ ఉదయం ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. ఇదిలావుండగా బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న తీవ్ర వాయుగుండం 12వ తేదీకల్లా పెనుతుఫాన్‌గా మారే అవకాశం ఉందని, తర్వాత తీరం దాటే సమయానికి కొంత బలహీనపడి అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్నందున ఏపీ తీరంలో విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపురం ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచికను ఎగురవేశారు.