Share News

రక్తం చిందిన దేవరగట్టు

ABN , First Publish Date - 2023-10-25T05:02:14+05:30 IST

కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో దేవుడి కోసం సాగిన జైత్రయాత్రలో రక్తం చిందింది. బన్ని ఉత్సవంలో భాగంగా పలువురు భక్తులు గాయపడ్డారు.

రక్తం చిందిన దేవరగట్టు

దేవుడి కోసం కర్రల సమరం..

బన్ని ఉత్సవంలో పలువురికి గాయాలు

కర్నూలు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి)/ఆలూరు: కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో దేవుడి కోసం సాగిన జైత్రయాత్రలో రక్తం చిందింది. బన్ని ఉత్సవంలో భాగంగా పలువురు భక్తులు గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి ఆలూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో హోళగుంద మండలం నెరిణికి గ్రామ సమీపంలో దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి క్షేత్రంలో విజయదశమి (దసరా) పర్వదినాన మాళమల్లేశ్వర స్వామి రాక్షసులపై సాధించిన విజయానికి గుర్తుగా విజయోత్సవ జైత్రయాత్రను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. శ్రీమాళ మల్లేశ్వరస్వామి కార్యార్థమై నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు డొళ్లబండ వద్దకు చేరుకున్నారు. డిర్ర్‌ర్ర్‌ర్ర్‌.. గోపరాక్‌ (బహుపరాక్‌) అంటూ కొండపైకి చేరుకొని మాళమల్లేశ్వరులకు కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం కొండ దిగువన ఉన్న సింహాసనం కట్ట వద్దకు ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి ఆశీనులను చేశారు. ఆలయ పూజారులు మహా మంగళ హారతి ఇవ్వగానే.. ఇష్టదైవం రక్షణార్థులైన నెరణికి, నెరణికి తండ, కొత్తపేట గ్రామాల భక్తులు పట్టుడు కర్రలు, కాగడాలతో పల్లకీ చుట్టూ చేరారు.

దేవుడిని తమ వశం చేసుకోవాలని ఎల్లార్తి, అరికేర, అరికేర తండా, సులువాయి, విరుపారం, బిలేహాలు తదితర గ్రామాలకు చెందిన భక్తులు సైతం కర్రలు, కాగడాలతో సై అన్నారు. క్షణాల్లో ఇనుప తీగలు చుట్టిన వేలాది పట్టుడు కర్రలు గాల్లో లేచాయి. కాళరాత్రిలో.. కాగడాల వెలుతురులో దేవుడి కోసం రెండు వర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ సందర్భంగా పలువురు భక్తుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామస్థులు బన్ని ఆడుతూ చీకట్లలోనే సింహాసనం కట్ట, ముళ్లబండ, రక్షపడ వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బన్ని కట్ట చేరుకొని జిమ్మి చెట్టుకు, బసవన్న గుడికి చేరుకొని ఉత్సవ మూర్తులను గుడిలో ఉంచి పూజలు చేశారు. ఉత్సవమూర్తులను సింహాసనం కట్ట వద్దకు చేర్చడంతో బన్ని జైత్రయాత్ర ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్నూలు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ నేతృత్వంలో వెయ్యి మంది పోలీస్‌ బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2023-10-25T05:02:14+05:30 IST