Bhogapuram Greenfield Airport: మాటిచ్చి మరిచారు
ABN , First Publish Date - 2023-02-12T03:13:05+05:30 IST
ప్రతిపక్ష నేత హోదాలో జగన్ వివిధ వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పలు హామీలను మరచిపోయారు. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూ నిర్వాసితులకు జగన్ ఇచ్చిన మాటా బుట్టదాఖలైంది.
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసితుల ఆక్రందన
అండగా ఉంటానని విపక్షనేతగా జగన్ హామీ
పూర్తిగా న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు
నేడు బలవంతంగా గ్రామాలు ఖాళీ చేయిస్తున్న వైనం
పునరావాస కాలనీల్లో ఇంకా పూర్తికాని ఇళ్ల నిర్మాణం
సమయం కోరినా వినడం లేదని నిర్వాసితుల ఆవేదన
రెండోసారి శంకుస్థాపనకు సర్కారు సన్నాహకాలు
2019లోనే ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన
(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేత హోదాలో జగన్ వివిధ వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పలు హామీలను మరచిపోయారు. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూ నిర్వాసితులకు జగన్ ఇచ్చిన మాటా బుట్టదాఖలైంది. టీడీపీ హయాంలో విపక్ష నేతగా ఆ ప్రాంతంలో పర్యటించినపుడు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ పోరాడుతానని హామీ ఇచ్చారు. అవసరమైతే టీడీపీ ప్రభుత్వం సేకరించిన భూములను వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక యథావిధిగా భూములు సేకరించారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు. అటు పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేదు. ఇంకా అక్కడ ఇళ్ల నిర్మాణం జరగక ముందే ఉన్న గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. ‘సర్వం త్యాగం చేశాం. అటు పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కొద్దిరోజులు సమయం ఇవ్వండి. స్వచ్ఛందంగా ఖాళీ చేస్తాం’ అని నిర్వాసితులు కాళ్లావేల్లా పడినా అధికారులు కనికరించడం లేదు. యంత్రాలు, వా హనాలను మోహరించి ఇళ్లను కూ ల్చివేస్తున్నారు. నిర్వాసితుల ఆక్రందనలు పట్టించుకోకుండా కొద్దిరోజులుగా ఇళ్లు ఖాళీ చేసే ప్రక్రియ సాగుతోంది.

గతంలో ఏం జరిగిందంటే...
2015లో అప్పటి కేంద్ర మంత్రి పి.అశోక్‌గజపతిరాజు విజయనగరం జిల్లాకు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును మంజూరు చేయించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం బొల్లింకలపాలెం, రెల్లిపేట, ముడసర్లపేట, మరాడపాలెంలో 2,700 ఎకరాల భూసేకర ణ చేపట్టాలని నిర్ణయించారు. ఆ గ్రామాల ప్రజలకు లింగాలవలస, గూడెపువలసలో పునరావాస కాలనీ లు ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో చాలా వర కు భూసేకరణ చేశారు. 2016లో నిర్వాసిత గ్రామా ల్లో జగన్ పర్యటించారు. నిర్వాసితులకు అన్నివిధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు రెండోసారి శంకుస్థాపన!
జగన్ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయినా కనీసం ఇటువైపు చూడలేదు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మిగిలిన భూసేకరణ పూర్తి చేశారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో ఆలోచించి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేయడానికి వైసీపీ సర్కారు సన్నాహకాలు చేస్తోంది. దీంతో నిర్వాసితులను బలవంతంగా పునరావాస కాలనీలకు తరలించే పనిలో పడ్డారు. అయితే 2019లోనే చంద్రబాబు ఎయిర్‌పో ర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయినా ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేయాలని జగన్ సర్కార్ సమాయత్తమవుతోంది.
వసతులు కల్పించకుండానే..
పునరావాస కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పించిన తరువాతే.. సొంత గ్రామాలను ఖాళీ చేయిస్తామని అధికారులు చెప్పారు. కానీ, పునరావాస కాలనీల్లో వసతులు లేవు. పాఠశాలలు, ప్రభు త్వ భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కాలనీల్లో కనీసం 50ు ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇంతలో ఉన్నట్టుండి గ్రామాలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడా ‘అధికార’ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. ముందుగా గ్రామ వలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. కానీ, వైసీపీ కి చెందిన మరాడపాలెం సర్పంచ్ ఎల్లయ్యమ్మ ఇంటి జోలికి వెళ్లలేదు. టీడీపీ, జనసేన నేతలు ఈ విషయాన్ని ఆర్డీవో సూర్యకళ దృష్టికి తీసుకెళ్లడంతో.. తక్షణం ఇల్లు ఖాళీ చేయించాలని ఆదేశించారు.
పూర్తి కాని ఇళ్ల నిర్మాణం
నిర్వాసిత కుటుంబాల్లో చాలామందికి అర్హత ఉన్నా యూత్ ప్యాకేజీ అందలేదని చెబుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణనలోకి తీసుకోలేదంటున్నారు. మరాడపాలెంలో 223 కుటుంబాలు. ముడసర్లపేటలో 33 కుటుంబాలకు లింగాలవలసలో పునరావాస కాలనీ కేటాయించారు. ప్రస్తుతం అక్కడ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొండవాలు ప్రాంతం కావడంతో నిర్మాణానికి వ్యయప్రయాసలకు గురవుతున్నారు. బొల్లింకలపాలెంలో 55 కుటుంబాలు, రెల్లిపేటలో 85 కుటుంబాలకు గూడెపువలస రెవెన్యూలో పునరావాస కాలనీ కేటాయించారు. ఇంటి నిర్మాణానికి రూ.2.84 లక్షలు, జీవన భృతికి రూ.5 లక్షలు, రవాణా ఖర్చులు రూ.50 వేలు, తక్షణ జీవన భృతి కింద రూ.36 వేలు.. ఇలా మొత్తం రూ.9.20 లక్షల పరిహారం ఇచ్చారు. నిర్మాణ వ్య యం పెరగడంతో ఇంటి నిర్మాణానికి ఇచ్చిన పరిహారం సరిపోవడం లేదని, అప్పులు చేయాల్సి వస్తోందని నిర్వాసితులు వాపోతున్నారు.
పాకలో నివాసం
పునరావాస కాలనీలో ఇంకా ఇంటి నిర్మాణం పూర్తికాలేదు. మరికొద్ది రోజులు సమయం పడుతుంది. ఆ విషయం చెప్పినా వినలేదు. ఇంటిని యంత్రాలతో కూలగొట్టారు. దీంతో గూడెపువలసలోని పునరావాస కాలనీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాకలో తలదాచుకుంటున్నాం. కొద్ది రోజులు సమయం ఇచ్చి ఉంటే స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేసేవాళ్లం.
-ఎస్ పార్వతి, నిర్వాసితురాలు, బొల్లింకలపాలెం
పరిహారం చాలడం లేదు
ఇంటి నిర్మాణానికి కేవలం రూ.2.20 లక్షలే అందించారు. ఇవి ఏ మూలకూ చాలడం లేదు. వివిధ రూపాల్లో ఇచ్చిన పరిహారం మొత్తం రూ.9.20 లక్షలను ఇంటి నిర్మాణానికే పెడుతున్నాం. అయినా చాలడం లేదు. పైగా కొండవాలు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించడంతో నిర్మాణానికి అదనంగా ఖర్చవుతోంది.
- ఎర్రంశెట్టి అప్పలరాజు, నిర్వాసితుడు, రెల్లిపేట
అండగా నిలిస్తే భయపెడుతున్నారు
పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాకనే గ్రామాలను ఖాళీ చేయించాలి. అప్పటి వరకు నిర్వాసితులకు సమయం ఇవ్వాలి. నిర్వాసితుల తరఫున మాట్లాడుతున్నందున అధికారులు బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. మాకు చెందిన మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ భూముల్లో డీ పట్టాలున్నాయని భయపెడుతున్నారు. డీ పట్టా భూములుంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఎన్నిరకాలుగా భయపెట్టినా జనసేన తరపున నిర్వాసితులకు అండగా ఉంటాం.
-లోకం మాధవి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి, నెల్లిమర్ల
పరిహారంలో అవకతవకలు
నిర్వాసితులకు పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయి. పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. చాలామంది అర్హులకు పరిహారం అందలేదు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. ఎటువంటి మౌలిక వసతులూ లేవు. అయినా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తుండడం దారుణం. వారికి కొంత సమయం ఇవ్వాలి.
- కర్రోతు బంగార్రాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి,నెల్లిమర్ల
చాలాసార్లు గడువు ఇచ్చాం
పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడం లేదు. ఇప్పటికే మూడు, నాలుగుసార్లు గడువు ఇచ్చాం. సేకరించిన భూములను ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వారికి అప్పగించాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్వాసితులను ఒప్పించి వారే ఇళ్లను ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి అందించాల్సిన అన్నిరకాల సాయం చేస్తున్నాం.
- సూర్యకళ, ఆర్డీవో, విజయనగరం