Share News

ఎస్‌ఆర్‌ఎం ఉపకులపతి మనోజ్‌కు భాస్కర్‌ అవార్డు

ABN , First Publish Date - 2023-11-29T04:26:26+05:30 IST

మంగళగిరిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మనోజ్‌కుమార్‌ అరోరాకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అత్యున్నతమైన భాస్కర్‌ అవార్డు లభించింది.

ఎస్‌ఆర్‌ఎం ఉపకులపతి మనోజ్‌కు భాస్కర్‌ అవార్డు

రిమోట్‌ సెన్సింగ్‌ రంగంలో సేవలకు గుర్తింపు

మంగళగిరి, నవంబరు 28: మంగళగిరిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మనోజ్‌కుమార్‌ అరోరాకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అత్యున్నతమైన భాస్కర్‌ అవార్డు లభించింది. అంతరిక్ష పరిశోధనల్లో పేరున్న ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఐఎ్‌సఆర్‌ఎస్‌) ఈ అవార్డును ప్రకటించింది. పూణెలో జరిగిన సొసైటీ వార్షిక సమావేశం సందర్భంగా మనోజ్‌కు మంగళవారం ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్‌ శైలేష్‌ నాయక్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రకాశ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రిమోట్‌ సెన్సింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, ల్యాండ్‌ కవర్‌ మ్యాపింగ్‌, ఎర్త్‌ సైన్సెస్‌ రంగాల్లో మనోజ్‌ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసినట్టు సొసైటీ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ అవార్డును ప్రస్తుత ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌, మాజీ చైర్మన్లు డాక్టర్‌ రాధాకృష్ణన్‌, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ శివన్‌ వంటి ప్రముఖులు మాత్రమే అందుకున్నారు. మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌లను ఉపయోగించి వివిధ రకాల రిమోట్‌ సెన్సింగ్‌ డేటాల ద్వారా కచ్చితమైన ల్యాండ్‌ కవర్‌ సమాచారాన్ని గుర్తించడంలో మనోజ్‌కు మంచి అనుభవం ఉంది. భాస్కర్‌ అవార్డును అందుకున్న వీసీ మనోజ్‌కుమార్‌ను ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్‌ సత్యనారాయణన్‌, సిబ్బంది అభినందించారు.

Updated Date - 2023-11-29T04:26:27+05:30 IST