Share News

Ayyanna : గాదిరాజు ప్యాలెస్‌పై భారతి రెడ్డి కన్ను

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:21 AM

విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని అప్పూఘర్‌ సమీపంలో.. ఎన్నో ప్రత్యేకతలు.. అత్యంత విలాసవంతమైన.. కోట్ల విలువచేసే గాదిరాజు ప్యాలెస్‌ (కల్యాణ మండపం)ను తనకు ఇచ్చేయాలని,

Ayyanna : గాదిరాజు ప్యాలెస్‌పై భారతి రెడ్డి కన్ను

ఇచ్చేందుకు యజమాని నిరాకరణ

భవనం 22-ఎలో ఉందని విశాఖ కలెక్టర్‌ నోటీస్‌

టీడీపీ నేత అయ్యన్న సంచలన ఆరోపణ

విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని అప్పూఘర్‌ సమీపంలో.. ఎన్నో ప్రత్యేకతలు.. అత్యంత విలాసవంతమైన.. కోట్ల విలువచేసే గాదిరాజు ప్యాలెస్‌ (కల్యాణ మండపం)ను తనకు ఇచ్చేయాలని, ప్యాలెస్‌ యజమానిపై ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖకు చెందిన వ్యాపారి ఒకరు (రాజు) ఎంతో ముచ్చటపడి మైసూరు ప్యాలెస్‌ తరహాలో అన్ని వసతులతో పదేళ్ల క్రితం గాదిరాజు ప్యాలెస్‌ కట్టుకున్నారన్నారు. మూడు వారాల క్రితం సీఎం సతీమణి భారతిరెడ్డి నగరానికి వచ్చినప్పుడు సాయంత్రం బీచ్‌రోడ్డులో వెళుతున్నప్పుడు ఆ ప్యాలె్‌సచూసి.. వెంటనే కారు ఆపించి, ఆ ప్యాలెస్‌ తనకు కావాలని యజమానితో మాట్లాడాలని వెంట ఉన్న వ్యక్తులకు సూచించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. దీంతో భారతిరెడ్డి మనుషులు వెంటనే ప్యాలెస్‌ యజమాని వద్దకు వెళ్లి భారతిరెడ్డి మనసులో మాటను వెల్లడించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారన్నారు. దీంతో వారం తిరగకముందే గాదిరాజు ప్యాలెస్‌ ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదిగా.. అంటే 22-ఎ జాబితాలో ఉందని పేర్కొంటూ కలెక్టర్‌తో నోటీస్‌ ఇప్పించారని ఆరోపించారు. దీనిపై ఆందోళన చెందిన ప్యాలెస్‌ యజమాని.. వెంటనే కలెక్టర్‌ను కలిసి ప్రశ్నించగా అది 22-ఏలో ఉందని బదులిచ్చారని తెలిపారు. పదేళ్ల క్రితం కట్టుకుంటే ఇప్పుడు 22-ఏలో ఉందని చెప్పడమేమిటని ఆయన ఆవేదన చెందగా, పెద్దవాళ్లతో మాట్లాడుకోవాలని ఉన్నతాధికారులు సలహా ఇచ్చారన్నారు. బాధిత వ్యక్తికి అండగా ఉండాల్సిన ఓ ఐఏఎస్‌ అధికారి మధ్యవర్తిగా ఉండడం ఏమిటని అయ్యన్న ఆరోపించారు. ఐఏఎస్‌ స్థాయి అధికారి ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. విశాఖలో దురాగతలపై మేధావులు, రిటైర్డు ఉన్నతాధికారులు గళం విప్పాలని కోరారు.

Updated Date - Dec 22 , 2023 | 03:21 AM