ఘంటసాల మ్యూజియంలో ‘భారతీయానం’

ABN , First Publish Date - 2023-09-07T03:18:37+05:30 IST

ఇండియా పేరును భారత్‌గా మార్చే విషయమై చర్చ జరుగుతున్న నేపథ్యంలో..

ఘంటసాల మ్యూజియంలో  ‘భారతీయానం’

ఒకటో శతాబ్దంలోనే వాడుకలో ఉన్న పదం

ప్రాకృత భాషలో రాతి గొడుగుపై చెక్కిన వైనం

మచిలీపట్నం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఇండియా పేరును భారత్‌గా మార్చే విషయమై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కృష్ణా జిల్లా ఘంటసాలలోని బౌద్ధ మ్యూజియంలో భారతీయానం అనే పదం రాతి గొడుగుపై చెక్కబడి ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. దీనిని బట్టి క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలోనే భారతీయానం అనే పదం వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘంటసాలలోని బౌద్ధ మ్యూజియంలో ఉన్న రాతి గొడుగుపై భారతీయానం అనే పదాన్ని ప్రాకృత భాషలో బ్రాహ్మీ అక్షరాలతో రాశారు. సముద్ర తీరం వెంబడి ఉన్న ఘంటసాల, హంసలదీవి ప్రాంతాలు పూర్వకాలంలో ప్రముఖ వర్తక, వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి. భరత కులస్థులు లేదా తెగవారు సముద్రంలో నుంచి విలువైన పగడాలను వెలికి తీసుకురావడంలో, సముద్ర రవాణాలో, సముద్రంలో రాకపోకలు సాగించే ఓడల సంరక్షణలో అత్యంత నిష్ణాతులుగా ఉండేవారు. భారతీయ వర్తక సంఘానికి చెందిన నాగోఖడ కుమారుడు నాగిలా మనుమడైన భరతుడు క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో రాతి గొడుగు తయారు చేయించి, దానిపై భారతీయానం అని అక్షరాలు చెక్కించి వ్యాపారులకు బహుమతిగా ఇచ్చినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంచాలకులు (మైసూర్‌) కె.మునిరత్నంరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. భారతీయానం అనే పదం శాసనాల్లో ఉన్నట్లు ఆధారాలు కృష్ణా జిల్లాలోనే లభ్యమయ్యాయని ఆయన చెప్పారు. విదేశీ వర్తకులు ఘంటసాల, హంసలదీవి ప్రాంతాలకు వచ్చి ఇక్కడ వర్తక వాణిజ్యాలు నడిపిన సమయంలో భారతీయానం అనే పదం వాడారని, భారత్‌ అనే పేరుకు, భారతీయానం అనే పేరుకు ఎక్కడో సంబంధం ఉందని, దీనిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 2018లో ఈ గొడుగు బయటపడిందని, దీనిని ఘంటసాల మ్యూజియంలో భద్రపరిచారని ఆయన చెప్పారు.

Updated Date - 2023-09-07T03:19:38+05:30 IST