Assigned Lands: పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టి!

ABN , First Publish Date - 2023-02-07T03:18:50+05:30 IST

భూమి బంగారంలాంటిది! అది పరిమితమైనది! ప్రభుత్వ భూములు మరీ తక్కువ! భావి అవసరాల కోసం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

Assigned Lands: పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టి!

నిషేధిత భూముల చుట్టూ స్కెచ్‌

షరతుగల, అనాధీన భూములపైనా కన్ను.. పేదల పేరిట పెద్దల దరఖాస్తులు

వాటికి మాత్రమే విముక్తి!.. కలెక్టర్లు కోరారంటూ ‘సవరణ’ జీవోలు

60 ఏళ్లలో ఎన్నడూలేని నిర్ణయాలు.. రెవెన్యూ నిపుణుల్లో విస్మయం

భూములు పలు రకాలు! ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అసైన్డ్‌ భూములు, చుక్కల భూములు, షరతుగల పట్టా భూములు, అనాధీన భూములు ఇలా... ఎన్నెన్నో! అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పించే పేరుతో.. పేదల నుంచి వాటిని బొక్కేందుకు ఇప్పటికే ‘కమిటీ కసరత్తు’ మొదలైందని ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించింది. ఇక... చుక్కల భూముల చుట్టూ జరుగుతున్న తతంగం అంతా ఇంతా కాదు. నిషేధిత జాబితాలో ఉండే షరతుగల పట్టా భూములు, అనాధీన భూములనూ సొంతం చేసుకునేలా అధికార పార్టీ నేతలు వ్యూహం రచిస్తున్నారు. దీనికి సంబంధించిన జీవోలూ జారీ అయ్యాయి. రైతుల పేరిట పిటిషన్లు పెట్టించడం... ఆ భూములను తమ ఖాతాలో వేసుకోవడం చకచకా జరుగుతోంది.

360 ఎకరాలు

కృష్ణా జిల్లాలో ఇద్దరు ప్రజాప్రతినిధులు రెండు మండలాల పరిధిలో 360 ఎకరాల షరతుగల పట్టా భూమిపై కన్నేశారు. ఇప్పటికే రైతుల పేరిట 123 ఎకరాలకు పట్టాలు తీసుకున్నారు. మిగిలిన పని పూర్తిచేసేందుకు రైతుల పేరుతో పిటిషన్లు పెట్టించారు.

270 ఎకరాలు

ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత 270 ఎకరాల అనాధీన భూములపై కన్నేశారు. ఆ భూములకు సంబంధించి ఎప్పుడో 1910 నాటి రికార్డులు చూపిస్తూ రైతుల పేరిట హక్కులు పొందేందుకు ఇప్పటికే పిటిషన్లు పెట్టించారు. అవి వచ్చిందే ఆలస్యం.. సత్వర నిర్ణయాలు తీసుకున్నారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

భూమి బంగారంలాంటిది! అది పరిమితమైనది! ప్రభుత్వ భూములు మరీ తక్కువ! భావి అవసరాల కోసం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పేదలకు ఇచ్చిన భూములకు ప్రభుత్వమే రక్షగా నిలవాలి. కానీ... ఇప్పుడు జరుగుతున్నది దీనికి పూర్తి రివర్స్‌! అసైన్డ్‌ భూములను పరాధీనం చేయాలి. ‘చుక్కల’ భూములకు స్పాట్‌ పెట్టాలి! లంక భూముల్లో పాగా వేయాలి! ఇదంతా ఒక యజ్ఞంలా సాగుతోంది. భూములకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ... గత 60 ఏళ్లలో ఎప్పుడూ తీసుకోని నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటున్నారు. అదికూడా ప్రభుత్వానికి, పేదలకు నష్టం చేసి.. ఆక్రమణదారులు, భూములను కబ్జా చేయాలనుకునే వారికి ఇవన్నీ మేలు చేసేవే! రాష్ట్రవ్యాప్తంగా నేతలు ఊరూవాడాజల్లెడ పట్టి ఖరీదైన, ఖాళీగా ఉన్న భూముల జాబితాలను సిద్ధం చేసుకున్నారు. పేదలనే లబ్ధిదారులుగా చూపించి వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా పేదలకే ఇస్తామనే పేరుతో షరతుగల పట్టా భూములు, అనాధీనం భూములు, లంక భూముల జాబితాలు సిద్ధం చేస్తోంది. రికార్డుల్లో పేదల పేర్లే ఉంటాయి. కానీ... అవి చివరికి దక్కేది నేతలకే! ఈ పరిణామాలపై మాజీ అధికారులు, రెవెన్యూ నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

చుక్కల భూములకు చెక్‌!

భూములను భోంచేసే ప్రక్రియ వ్యూహాత్మకంగా, ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. ఇందుకు కలెక్టర్లను, ఇతర అధికారులను వాడుకుంటున్నారు. తొలుత... పేదలు, సామాన్యుల పేరుతో పెద్దలే ఒక దరఖాస్తు పెట్టిస్తారు. నిజమైన పేదల దరఖాస్తులను ఏమాత్రం పట్టించుకోని కలెక్టర్లు... ఈ దొంగ దరఖాస్తులను మాత్రం ఆగమేఘాల మీద పరిష్కరిస్తున్నారు. చుక్కల భూముల పేరుతో రాష్ట్రంలో భారీ భూదందా నడుస్తోంది. లబ్ధిదారులు సామాన్యులు కాదు! బడాబాబులే!

రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎ్‌సఆర్‌)లో పేర్కొన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించేందుకు 2017లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేసింది. ఇప్పుడు ఈ చట్టం చట్టుబండలుగా మారింది. కేవలం పలుకుబడి ఉన్న వారి కేసులనే పరిష్కరిస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 15వ తేదీ రెవెన్యూ శాఖ రూపొందించిన నివేదిక ప్రకారం చూస్తే... చుక్కల భూముల సమస్య పరిష్కారానికి 93,154 దరఖాస్తులు వచ్చాయి. అందులో... 7077 మాత్రమే ఆమోదించారు. పట్టాలు దక్కింది 2156 మందికే. ఇక మిగిలిన వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తుదారుల్లో 90 శాతం మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే. అర ఎకరం, ఎకరం, రెండు ఎకరాలపై హక్కులు కోరుతున్న వారే అధికులు. కానీ... వీరు బడుగు జీవులు! ఎలాంటి పలుకుబడీ, పరపతీ ఉండదు! అందుకే ఈ దరఖాస్తులను పట్టించుకోరు. అదే సమయంలో... వైసీపీ నేతలు చుక్కల భూములను వ్యూహాత్మకంగా సొంతం చేసుకుంటున్నారు. ముందుగానే వాటి అసలు లబ్ధిదారుల (భూములను అనుభవిస్తున్న వారు)తో మాట్లాడుకుంటారు. ‘మీరు ఎప్పటికీ ఈ భూములను 22ఏ నుంచి తొలగించుకోలేరు. మాకు అప్పగించండి. మేం చూసుకుంటాం’ అంటూ ఎక్కడికక్కడ ఒప్పందాలు చేసుకుని... ఆ తర్వాత వారితోనే దరఖాస్తు చేయిస్తున్నారు. ఆ తర్వాత తమకున్న అధికార బలం తో అధికారుల ద్వారా మొత్తం చక్కబెట్టేస్తున్నారు. ఉదాహరణకు... కడప నగరంలో ముఖ్యనేత మేనమా మ తన బినామీల పేరిట 8 దరఖాస్తులు పెట్టించారు. అవన్నీ పరిష్కారమయ్యాయి. అలా సెటిల్‌ అయిన భూముల్లో 27 ఎకరాలను రియల్‌ వెంచర్‌గా మార్చారు. ఆ భూముల విలువ 200 కోట్ల పైమాటే. ఇందుకు సంబంధించిన జీఓలను రహస్యంగా ఉంచేశారు. ఆ భూముల పక్కనే ఉన్న ఇతర పేద రైతుల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం గమనా ర్హం. విశాఖ, గుంటూరు, కాకినాడల్లో నేతలు చెప్పిన 230 కేసులను సెటిల్‌ చేశారని ఆరోపణలున్నాయి.

కలెక్టర్లు చెబితే... చేసేస్తారా?

ఆర్‌ఎ్‌సఆర్‌లో పేర్కొన్న షరతుగల పట్టా భూములను నిషేధిత జాబితా 22(ఏ) నుంచి తొలగింపునకు ప్రభుత్వమే విధాన నిర్ణయం తీసుకోవాలి. కానీ... ‘కలెక్టర్లు కోరారు. వాళ్లే అడిగారు’ అంటూ ప్రభుత్వం జీవోలు జారీ చేస్తోంది. ‘‘షరతుగల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి వాటిని నిషేఽధిత జాబితా నుంచి తొలగించండి’’ అని కృష్ణా జిల్లా కలెక్టర్‌ కోరారంటూ ప్రభుత్వం జీఓ 667లో పేర్కొంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 18,285 ఎకరాల షరతుగల పట్టా భూములున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి భూములు 38వేల ఎకరాలున్నాయి. వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందనుకుంటే పొరపడినట్లే! కేవలం పెద్దలకు ప్రత్యేక ‘ఆసక్తి’ ఉన్న భూములకే విముక్తి కలుగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు 3 మండలాల పరిధిలో 270 ఎకరాల ను తమ ఖాతాలో వేసుకున్నారని అధికారపార్టీలోనే చర్చ జరుగుతోంది. అలాగే... అనాధీనం భూముల విషయంలో అనకాపల్లి కలెక్టర్‌ ఓ లేఖ రాశారని, నిషేధిత జాబితా నుంచి ఆ భూములను బయట పడేయటానికి ఓ నిర్దిష్టమైన విధానం ప్రకటించాలని కోరారని గత ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వం జీవో 340 జారీ చేసింది. ఈ మేరకు చుక్కల భూముల చట్టం-2017ను సవరిస్తూ గత ఏడాది డిసెంబరు 29న ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

షరతుగల పట్టా అంటే...

బ్రిటీషు పాలనలో, 1932కు ముందు రైతులకు కొన్ని రకాల షరతులకు లోబడి భూములు ఇచ్చారు. శిస్తు చెల్లించి రె ండేళ్లకోసారి భూమి అసె్‌సమెంట్‌ చేయించుకోవాలి, ప్రత్యేక అనుమతితో సాగుచేసుకోవాలన్న 2 రకాల షరతులపై రైతులకు భూములు ఇచ్చారు. వీటినే షరతుగల పట్టా భూములుగా పిలుస్తారు. ఆర్‌ఎ్‌సఆర్‌లో వాటిని డి-పట్టా భూములుగా, రిమార్క్స్‌ కాలమ్‌లో షరతుగల పట్టా భూమిగా పేర్కొన్నారు. ఈ భూములను పరిరక్షిస్తూ ప్రభుత్వం నిషేధిత జాబితా 22(ఏ)లో చేర్చింది. 1954కు ముందు అసైన్‌ చేసిన భూములపై లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పిస్తూ 2018లోనే ప్రభుత్వం 575 జీఓ ఇచ్చింది. షరతుగల పట్టా భూములపై మాత్రం ఇలాంటి హక్కులు కల్పించలేదు. కానీ... ఈ భూములపై నేతలు కన్నేశారు. వాటిని ‘నిషేధిత జాబితా’ నుంచి తప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. ఫలితంగానే... జీవో నంబర్‌ 575 ఆధారంగా షరతుగల పట్టా భూములనూ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఇటీవల జీఓ 667 జారీ అయింది.

అనాధీనం భూములు...

బ్రిటీష్‌ కాలంలో ఆర్‌ఎ్‌సఆర్‌ తయారుకోసం గ్రామాలకు సర్వేయర్లు వెళ్లినప్పుడు కొన్ని రకాల భూములపై డేటా సేకరించలేదు. రైతులు సర్వేయర్ల ముందుకొచ్చి తమ భూముల వివరాలను సమగ్రంగా అందించలేకపోయారు. దీంతో 1932-1934 వరకు రూపొందించిన ఆర్‌ఎ్‌సఆర్‌ లో అసె్‌సమెంట్‌ చేయని భూములను ప్రభుత్వ పోరంబోకుగా పేర్కొన్నారు. రిమార్క్స్‌ కాలమ్‌లో వీటిని అనాధీనంగా రికార్డు చేశారు. 1920 నుంచి ఎవరూ క్లెయిమ్‌ చేయని భూములను ప్రభుత్వ భూములుగా పరిగణించి వాటిని రికార్డుల్లో పొందుపరిచారు. కాలక్రమంలో కొందరు అధికారులు మాత్రం వాటిని ప్రైవేటుగా డిక్లేర్‌చేసి పట్టాలు ఇచ్చారు. ఈ గందరగోళం నేపథ్యంలో ప్రభుత్వం భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. 2017లో ఈ భూములను చుక్కల భూముల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదన వచ్చినా అది సరికాదని నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడీ భూములను చుక్కల భూముల చట్టం కిందే సెటిల్‌చేయాలని, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-02-07T07:34:21+05:30 IST