అధ్వాన రోడ్డు.. అదుపు తప్పిన ఆటో
ABN , First Publish Date - 2023-03-18T06:27:12+05:30 IST
బొలేరో వాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృత్యువాత
శ్రీసత్యసాయి జిల్లాలో బొలేరో-ఆటో ఢీ
ధర్మవరం, మార్చి 17: బొలేరో వాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల పరిధిలోని పోట్లమర్రి సమీపంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వివిధ పనుల నిమిత్తం బత్తలపల్లి, సమీప గ్రామాలకు వెళ్లినవారు రాత్రి బత్తలపల్లిలో ధర్మవరం వెళ్లే ఆటో ఎక్కారు. పోట్లమర్రి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ధర్మవరం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ నరసింహులు(25), గొట్లూరుకు చెందిన ఈశ్వరయ్య(35), ముదిగుబ్బ మండలం నల్లాయకుంటపల్లికి చెందిన గాలి నారాయణస్వామి(48), పోట్లమర్రికి చెందిన మల్లేశ్(35) అక్కడికక్కడే మృతి చెందారు. ధర్మవరం కొత్తపేటకు చెందిన హాజీపీరా(54), మరో గుర్తు తెలియని వ్యక్తి(51)ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. బొలేరో వాహనం డ్రైవర్ కుమార్ నరసింహులు, ఆటోలో ప్రయాణిస్తున్న రంగస్వామి, ఆరేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వీరు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ధర్మవరం రూరల్ సీఐ మన్సూరుద్దీన్ తన సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, శుక్రవారం రాత్రి 10 గంటల వరకూ మృతుల వివరాలు పూర్తిగా తెలియరాలేదు. మిగిలిన కుటుంబాలకు సమాచారం చేరవేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండడం వల్లే ఆటో అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.