CBN Bail : బాబు బెయిల్ పిటిషన్లపై విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి
ABN , First Publish Date - 2023-10-28T03:44:03+05:30 IST
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ గురువారం వేసిన అనుబంధ పిటిషన్‌లపై విచారణ నుంచి హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తప్పుకొన్నారు.
30న విచారణకు వచ్చేలా చర్యలకు ఆదేశం
అత్యవసర విచారణ కోరేందుకు ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టీకరణ
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ గురువారం వేసిన అనుబంధ పిటిషన్‌లపై విచారణ నుంచి హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తప్పుకొన్నారు. వ్యాజ్యంలో ఇటీవల వకాలత్ వేసిన న్యాయవాది ఓ న్యాయాధికారి భర్త అని, సంబంధిత న్యాయవాదికి చెందిన పిటిషన్లను తాను విచారించలేనని పేర్కొన్నారు. ఇంతకు మించి చెప్పేందుకు మనఃసాక్షి అంగీకరించడం లేదన్నారు. చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్లు శుక్రవారం వెకేషన్ బెంచ్ (దసరా సెలవుల ప్రత్యేక బెంచ్) ముందుకు వచ్చాయి. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి చెబుతూ... చంద్రబాబుకు అనారోగ్యం నేపథ్యంలో అత్యవసరంగా విచారణ జరపాల్సి ఉందని అభ్యర్థిస్తున్నందున... ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుంచి తదుపరి పనిదినం నాడు(ఈనెల 30) విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ఈ దశలో చంద్రబాబు తరఫుసీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ... వ్యాజ్యంపై వెకేషన్ బెంచ్‌లో విచారణ జరపాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 30న విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించడం పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరేందుకు తమకు అడ్డంకిగా మారుతుందన్నారు. ఉత్తర్వులలో తేదీని ఎత్తివేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ... పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించేందుకు, నిబంధనల ప్రకారం వ్యాజ్యాన్ని తగిన బెంచ్ ముందు విచారణకు ఉంచేందుకు తన ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదులు రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను కలిసి వ్యాజ్యం అత్యవసరంగా తగిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అత్యవసర విచారణకు తిరస్కరణ...
చంద్రబాబు అరెస్టు, జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవని, ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచినట్లు భావించి, హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని న్యాయవాది సుంకర కృష్ణమూర్తి హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు శుక్రవారం ప్రస్తావించారు. లంచ్ మోషన్‌గా అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ దశలో తాము విచారణ జరపలేమని పేర్కొంది.
