బాబోయ్‌.. ఇదేం సభ!

ABN , First Publish Date - 2023-05-27T04:26:45+05:30 IST

‘బాబోయ్‌.. ఇదేం సభ! తెల్లవారు జామున నాలుగింటికి బస్సెక్కించారు.

బాబోయ్‌.. ఇదేం సభ!

గుంటూరు/విజయవాడ, మే 26(ఆంధ్రజ్యోతి): ‘బాబోయ్‌.. ఇదేం సభ! తెల్లవారు జామున నాలుగింటికి బస్సెక్కించారు. ఇక్కడికి తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. మాకు పట్టాలిచ్చే సంగతేమో గానీ కనీసం పచ్చి మంచినీళ్లు, పట్టెడన్నం పెట్టే దిక్కు కూడా లేదు’.... సెంటు పట్టాల పంపిణీ సందర్భంగా వెంకటపాలెంలో శుక్రవారం జరిగిన సీఎం సభకు వచ్చిన ప్రజల ఆవేదన ఇది. ఇలా పదులు, వందలు కాదు... వేల మంది మండుటెండలో నిలువ నీడ లేక నానా అగచాట్లు పడ్డారు. రాజధాని ప్రాంతంలో తొలిసారి ఏర్పాటు చేస్తున్న సీఎం సభకావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికారపార్టీ భారీగా జనాన్ని తరలించేందుకు సిద్ధమైంది. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఆశించిన స్పందన లేకపోవడం, లబ్ధిదారులు కూడా సుముఖంగా లేకపోవడంతో ఎన్టీఆర్‌, పల్నాడు, ఏలూరు జిల్లాల నుంచి భారీగా తరలించారు. సభకు వచ్చిన వారిలో సగానికి మించి ఎన్టీఆర్‌ జిల్లాకు చెందినవారు, అందునా లబ్ధిదారులు కానివారే. నిద్రమొఖాన ఏమీ తినకుండా బయలుదేరిన ప్రజలు సభా స్థలానికి వచ్చేసరికి దాదాపు 10గంటలు అయింది. ప్రాంగణానికి చేరుకోకముందే పోలీసులు రోడ్డుమీదే ఆపేయడంతో వారికి అల్పాహారం దక్కలేదు. కాగా, సీఎం సభ వద్దకు చేరుకోకుండానే, సభ మొదలవకుండానే ప్రజలు తిరుగుముఖం పట్టారు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినా ‘మావల్ల కాదు... పట్టాలిస్తే ఇచ్చారు.. లేకుంటే లేదు... మేం ఉండలేం’ అని తేల్చిచెప్పారు. కాగా, సీఎం మెప్పు పొందడమే లక్ష్యంగా జనాన్ని భారీగా తరలించిన అధికారులు... వారికి కావాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. టిఫిన్‌, భోజనం, కనీసం నీటి సదుపాయం కూడా కల్పించలేదు.

దినం చేయటానికి వచ్చాం..!: పేదల అసహనం

పట్టాల పంపిణీ పేరుతో బలవంతంగా తరలించడం పట్ల లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.రోజువారీ పనులకు ఆటంకం కలిగించేలా బలవ ంతపు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి సభకు వచ్చిన పలువురు లబ్ధిదారులు అయితే ‘‘దినం చేయటానికి వచ్చాం’’ అంటూ ఆవేశంగా స్పందించారు.

జగన్‌ నోటి వెంట ‘అమరావతి’!

రాజధాని అమరావతిలో సీఎం జగన్‌ సభ జరగడం ఇదే మొదటిసారి.... అమరావతి పేరును ఆయన ఉచ్ఛరించడమూ మొదటిసారే. నాలుగేళ్లుగా ఆ పేరు పలకడానికే ఇష్టపడని సీఎం జగన్‌ ఎట్టకేలకు అమరావతి పేరును ప్రస్తావించారు. ‘‘ఇకపై అమరావతి మనందరిద’’ంటూ ప్రేమ ఒలకబోశారు.

పట్టాపై సుప్రీం ఉత్తర్వులతో స్టాంప్‌

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొందుపరచాల్సిన సమాచారాన్ని సర్కారు స్టాంపు రూపంలో పట్టాలపై ముద్రించింది. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు....1.హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లలో ఇవ్వాల్సిన ఆదేశాలు, నిర్ణయానికి కట్టుబడి పట్టా జారీ చేయబడుతోంది. 2. తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినట్టయితే మంజూరుదారు ప్రత్యేక హక్కు కలిగి ఉండటానికి, వాదించటానికి అర్హత కలిగి ఉండరు’ అని తహశీల్దార్‌ సంతకంతో కూడిన ముద్ర వేశారు.

Updated Date - 2023-05-27T04:26:45+05:30 IST