Share News

Registrations : బాబోయ్‌ రిజిస్ట్రేషన్లు!

ABN , First Publish Date - 2023-12-11T02:56:15+05:30 IST

ఏదైనా కొత్త విధానం తీసుకొస్తే పాత విధానం కంటే మెరుగ్గా ఉండాలి. ప్రజలకు సేవలు సులభతరంగా, మరింత ప్రయోజనం కలిగించేలా ఉండాలి. అయితే జగన్‌ సర్కారు అంతా ‘రివర్స్‌’ కదా! గత నాలుగున్నరేళ్లలో ఎన్నో ‘రివర్స్‌’ విధానాలతో వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది.

 Registrations : బాబోయ్‌  రిజిస్ట్రేషన్లు!

కొత్త విధానంతో జనానికి ప్రత్యక్ష నరకం

పనికోసం గంటల కొద్దీ నిరీక్షణ

చాలా చోట్ల మొరాయిస్తున్న సర్వర్లు

ఒక రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ఆగిపోతే

ఆ తర్వాత చేయాల్సినవన్నీ బంద్‌

గందరగోళంగా ఆధార్‌ వెరిఫికేషన్‌

కార్యాలయాల్లో జనం పడిగాపులు

పనిభారంతో సిబ్బందీ సతమతం

47(ఏ), ప్రైవేటు ‘అటెండెన్స్‌’కు పాతర

ఈసీలో తెలుగు అక్షరాలు మాయం

రుణాలకు, విక్రయాలకు ఇబ్బందులు

ఓ ఐటీ సలహాదారు నిర్వాకంతో

ప్రజలపై బలవంతంగా రుద్దుడు

రిజిస్ట్రేషన్లు అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. జగన్‌ సర్కారు తెచ్చిన కొత్త విధానంతో గందరగోళం నెలకొంది. సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఈకేవైసీ ప్రక్రియతో మొదటి వ్యక్తికి రిజిస్ర్టేషన్‌ ఆగిపోతే ఆ తర్వాత వారికి చేయడానికి వీల్లేదు. సర్వర్లలో కానీ, ఈకేవైసీ ప్రాసె్‌సలో కానీ ఏదైనా సమస్య వస్తే అంతే సంగతులు. రిజిస్ట్రేషన్‌ పూర్తి కావడానికి గంటలు, రోజులు కూడా పడుతుంది. ఇటు జనానికి తిప్పలు, అటు సిబ్బందికి పనిభారం.

గతంలో సాఫీగా సాగిపోతున్న రిజిస్ర్టేషన్ల విధానం స్థానంలో జగన్‌ సర్కారు ‘జిరాక్స్‌’ విధానం తీసుకొచ్చింది. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సొంతవాళ్లకు మేళ్లు చేయడం కోసం జనానికి నరకం చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఐటీ సలహాదారు నిర్వాకంతో ప్రజలపై బలవంతంగా రుద్దారు. వ్యవస్థనే భ్రష్టు పట్టించారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏదైనా కొత్త విధానం తీసుకొస్తే పాత విధానం కంటే మెరుగ్గా ఉండాలి. ప్రజలకు సేవలు సులభతరంగా, మరింత ప్రయోజనం కలిగించేలా ఉండాలి. అయితే జగన్‌ సర్కారు అంతా ‘రివర్స్‌’ కదా! గత నాలుగున్నరేళ్లలో ఎన్నో ‘రివర్స్‌’ విధానాలతో వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది. సాఫీగా సాగిపోతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని అదే కోవలోకి చేర్చింది. కొత్త జిరాక్సు రిజిస్ర్టేషన్ల విధానంతో అయోమయం సృష్టించింది. ప్రజలతో పాటు అధికారులకు పాత విధానంలో లేని కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. పోనీ ప్రభుత్వ ఖజానా ఏమైనా నిండుతుందా అంటే అదీ లేదు. రిజిస్ర్టేషన్లు నెమ్మదించడంతో ఆదా యం పడిపోతోంది. మరి ఎవరి లబ్ధి కోసం ఈ జిరాక్సు రిజిస్ర్టేషన్లను ప్రభుత్వం అర్జెంటుగా తీసుకొచ్చింది? కనీసం ప్రజలకు ఒరిజినల్‌ డాక్యుమెంట్లు కూడా అందించలేని ఈ విధానాన్ని ఎందుకు రుద్దుతోంది? అంతా అయోమయం. ప్రస్తుతం ఇది కొన్నిచోట్లే అమలవుతోంది.

ఐటీ సలహాదారు హస్తం

కేంద్రం పరిఽధిలోని ఎన్‌ఐసీ 25ఏళ్ల నుంచి దశలవారీగా రిజిస్ర్టేషన్ల సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. మరింత అభివృద్ధి చేయడం కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్టును రూ.13కోట్లకు మొదట ఎన్‌ఐసీకే అప్పజెప్పింది. ఆ దిశగా ఎన్‌ఐసీ రూ.5 కోట్లు ఖర్చు పెట్టింది. సాఫీగా జరుగుతున్న ప్రక్రియను ఆపి, ఎన్‌ఐసీకి ఇచ్చిన కాంట్రాక్టును పక్కన పెట్టి, క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ అనే కంపెనీకి రూ.34కోట్లకు కట్టబెట్టారు. ఆ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సమస్యల సుడిగుండంలా ఉంది. సీఎంవోలో ఐటీ సలహాదారుగా పనిచేస్తున్న వ్యక్తి దీనికి కారణమని తెలిసింది. ఆయన రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ కార్యాలయంలో కూర్చుని కొత్త విధానాన్ని జనాలపై రుద్దుతున్నారని,రోజురోజుకూ సులభతరం కావాల్సిన ప్రక్రియ మరింత సంక్లిష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. జిరాక్సు రిజిస్ర్టేషన్ల విధానంలో ఈసీ తీసుకుంటున్నవారు పలు ఇబ్బందులు పడుతున్నారు. సబ్‌డివిజన్‌ అయిన భూమికి సంబంధించిన సర్వే నంబర్లలో తెలుగు అక్షరాలు కనపడటం లేదు. అలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను డిజైన్‌ చేశారు. విజయవాడ, వైసీపీ ప్రభుత్వం పరిపాలన రాజధానిగా చెబుతున్న విశాఖ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి పరిశీలనతో తెలుసుకున్న సమాచారం ప్రకారం... ఉదాహరణకు 350/ఏ1, 350/ఏ2ఏ, 350/ఏ2 అనే 3 వేర్వేరు సర్వే నంబర్లకు ఈసీ తీస్తే, ఆ నంబర్ల స్థానంలో 350/1, 350/2, 350/2 అని వస్తున్నాయి. చివరి రెండు సర్వే నంబర్లు వేర్వేరు అయినా ఈసీలో ఒకే సర్వే నంబర్‌ వస్తోంది. దీంతో ఆ ఈసీ ఎక్కడా చెల్లుబాటు కాదు. బ్యాంకు రుణాలు తీసుకోవడానికి, క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తనఖా పెట్టిన భూమిని విడిపించుకున్న వారికీ ఇవే సమస్యలు వస్తున్నాయి.

గంటల కొద్దీ నిరీక్షణ

జిరాక్సు రిజిస్ర్టేషన్ల పద్ధతిలో ముందుగా పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానంలో రిజిస్ర్టేషన్‌ ఫారంలో వివరాలు రాసుకుని, ఆ తర్వాత రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలోకి వెళ్తారు. పాత విధానంలో లాగా ముందుగా డాక్యుమెంట్లపై పార్టీలు సంతకాలు పెట్టరు. డబ్బులు ఇవ్వనిదే ఆస్తి అమ్ముతున్న వ్యక్తి రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలోకి రాడు. రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలోకి వెళ్లి సంతకం పెట్టాక డబ్బులివ్వకపోతే ఎలా అనే భయం ఆ వ్యక్తిది. డబ్బులిచ్చాక రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలోకి వస్తాడో రాడోనన్న ఆందోళన కొనుగోలు చేసే వ్యక్తిది. పీడీఈ పూర్తిచేసుకుని కార్యాలయంలోకి వచ్చిన తర్వాత సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం ఈకేవైసీ పూర్తి చేసి ఆ రిజిస్ర్టేషన్‌కు డాక్యుమెంట్‌ నంబర్‌ కేటాయిస్తారు. తర్వాత పార్టీలు, సాక్షుల ఆధార్‌ వెరిఫికేషన్‌ చేసి, ఈ-సైన్‌ తీసుకుంటారు. ఆధార్‌ వెరిఫికేషన్‌, ఈ-సైన్‌ అనేవి చాలా సుదీర్ఘమైన పనులు. గంటల గంటల సమయం పడుతోంది. అప్పటి వరకు ఆ వ్యక్తి ఉంటాడో లేదోనన్న భయం సబ్‌రిజిస్ర్టార్లను వెంటాడుతోంది. ఎందుకంటే, ఒక పార్టీకి డాక్యుమెంట్‌ నంబర్‌ 3100 ఇచ్చారనుకుందాం. దాని తర్వాత మరో మూడు పార్టీలకు వరుసగా డాక్యుమెంట్‌ నంబర్లు 3101, 3102, 3103 కేటాయిస్తారు. 3100 డాక్యుమెంట్‌ నంబర్‌ ఇచ్చిన పార్టీ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో ఆధార్‌ వెరిఫికేషన్‌లో కానీ, ఈ-సైన్‌లో కానీ సమస్య తలెత్తితే రిజిస్ర్టేషన్‌ నిలిచిపోతుంది. ఆ తర్వాతి డాక్యుమెంట్లు 3101, 3102, 3103కు ఆధార్‌ వెరిఫికేషన్‌, ఈ-సైన్‌ అన్ని సాఫీగా పూర్తయినా ఆ డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్లు చేయడానికి వీల్లేదు. ఎంత ఆలస్యమైనా, ఎన్ని రోజులైనా ముందు డాక్యుమెంట్‌ నంబర్‌ 3100 రిజిస్ర్టేషన్‌ పూర్తవ్వాలి. ఆ తర్వాతే ఇతర డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్లు చేయాలి. అప్పటి వరకు రిజిస్ర్టేషన్‌ కార్యాలయ సిబ్బందితో సహా వచ్చిన పార్టీలు, సాక్షులు అందరూ ఆగాల్సిందే. ఇది పెద్ద సమస్యగా మారింది.

రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలోకి వెళ్లడమే గాని రిజిస్ర్టేషన్లు ఎప్పుడవుతాయనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. పెద్ద పెద్ద రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు రాత్రి ఒంటిగంట వరకు రిజిస్ర్టేషన్లు చేస్తూనే ఉన్నాయి. ఉదయం పదింటికి కార్యాలయం ప్రారంభమైతే ఎప్పటికి ఇంటికి చేరుతారో తెలియదు. అవసరమైతే అధికారులు, సిబ్బంది ఒకటి రెండు రోజులు అర్ధరాత్రి వరకు కూర్చుని పనిచేస్తారు. ఈ విధానం వచ్చాక తమ ఉద్యోగం డే షిఫ్టా, నైట్‌ షిఫ్టా అర్థం కావడం లేదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. సెలవులు పెట్టుకొని దూరప్రాంతాల నుంచి రిజిస్ర్టేషన్ల కోసం వచ్చిన జనాల పరిస్థితి ఇంకా దయనీయం. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కార్యాలయాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఎంత ఆలస్యమైనా ఆ రోజే పూర్తి చేసుకోవాలి. లేదంటే మరో రోజు పార్టీలను, సాక్షులను అందరినీ తీసుకురావాలి. ఎవరు రాకపోయినా రిజిస్ర్టేషన్‌ ఆగిపోతుంది.

తనఖాలో ఉంటే రిజిస్ట్రేషన్‌ కాదు

తనఖాలో ఉన్న వ్యవసాయ భూములను రిజిస్ర్టేషన్‌ చేయకూడదంటూ స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ 3 నెలల క్రితం ఒక సర్క్యులర్‌ ఇచ్చారు. దీంతో సబ్‌రిజిస్ర్టార్లు ప్రతి రిజిస్ర్టేషన్‌కు ముందు ఈసీలు పరిశీలించి బ్యాంకుల్లోనో, సొసైటీల్లోనో తనఖా ఉందని తేలితే రిజిస్ర్టేషన్లు చేయడం లేదు. కానీ, ఆ భూమి యజమాని డబ్బులు కట్టినా, బ్యాంకు వాళ్లు చెల్లు రసీదు ఇచ్చినా సరే రిజిస్ర్టేషన్లు జరగడం లేదు.

ఆ సదుపాయాలు లేవు

పాత విధానంలో అనారోగ్య కారణాల వల్ల సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు రాలేని వారు ప్రైవేటు అటెండెన్స్‌ ఆప్షన్‌ ఉపయోగించుకుని రూ.1000 ఫీజు కడితే సబ్‌రిజిస్ర్టారే వారి ఇంటికెళ్లి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని వచ్చేవారు. కొత్త విధానంలో ప్రైవేటు అటెండెన్స్‌ ఆప్షన్‌ పూర్తిగా ఎత్తేశారు. అలాగే రిజిస్ర్టేషన్ల చట్టంలోని సెక్షన్‌ 47(ఏ)కింద ప్రజలకు ఉన్న హక్కును కొత్త విధానంలో ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. దీని ప్రకారం, ఒక భూమికి ప్రభుత్వం వేసిన విలువపై అభ్యంతరాలుంటే ప్రజలు అభ్యంతరం లేవనెత్తొచ్చు. ఇది తేలేవరకు ఆ రిజిస్ర్టేషన్‌ను పెండింగ్‌లో ఉంచొచ్చు. స్వయంగా అధికారులే వచ్చి చూసి ఆ భూమి విలువ నిర్ణయించాలని కోరవచ్చు. ఇలాంటి సందర్బాల్లో ఆ భూమి విలువను 20 శాతం వరకు తగ్గించే అధికారం డీఆర్‌కు ఉంటుంది. 20 శాతం తగ్గుదలతో కూడా పార్టీ ఏకీభవించకపోతే డీఐజీకి అప్పీల్‌ పెట్టుకోవచ్చు. కొత్త విధానంలో ఈ వెసులుబాటు తీసేశారు.

తప్పుల తిప్పలు!

పాతవిధానంలో డాక్యుమెంట్‌ రైటర్లు ఉండేవారు. ఫిజికల్‌ కాపీలుండేవి. కొత్త విధానంలో పీడీఈలో డాక్యుమెంట్‌ చేసుకొని రావాలి. నెట్‌ సెంటర్లు, డీటీపీ ఆపరేటర్లు వీటిని చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్క పేరు లేదా అక్షరం తప్పుపడినా, ఎగిరిపోయినా ఆ డాక్యుమెంట్‌ చెల్లడం లేదు. ఒకే అక్షరం కదా అని సరిచేసి రిజిస్ర్టేషన్‌ చేసేద్దామన్న ఆప్షన్‌ సబ్‌రిజిస్ర్టార్లకు లేదు. ఒక్క అక్షరమైనా సరే ఆ డాక్యుమెంట్‌ను వెనక్కి పంపించి, ఆ డీటీపీ ఆపరేటర్‌తో సరిచేయించుకుని రావాలి. డీటీపీ ఆపరేటర్లకు డిపార్ట్‌మెంట్‌ నాలెడ్జ్‌ ఉండకపోవడంతో టైపింగ్‌ తప్పులు అనేకం వస్తున్నాయి. అన్ని తప్పులు సరిచేసుకుని వచ్చేసరికి సమయం అయిపోతుంది.

Updated Date - 2023-12-11T02:56:16+05:30 IST