Ayesha's parents: స్టేట్‌మెంట్‌ ఇవ్వం!

ABN , First Publish Date - 2023-09-18T02:58:23+05:30 IST

‘అయేషా హత్య జరిగి పదహారేళ్లవుతోంది. సీబీ ఐ ఈ కేసు తీసుకుని ఐదేళ్లవుతోంది. అయినా కేసులో ఏమాత్రం పురోగతి లేదు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యల్లేవు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక్కరినైనా అరెస్ట్‌ చేసి మా దగ్గరకు రండి. అప్పుడు సహకరిస్తాం.

Ayesha's parents: స్టేట్‌మెంట్‌ ఇవ్వం!

తేల్చిచెప్పిన అయేషా తల్లిదండ్రులు

బతికుండగా న్యాయం చూడలేమేమో అంటూ కంటతడి

16 ఏళ్ల నాటి అయేషా హత్య కేసులో స్టేట్‌మెంట్‌ కోసం వచ్చి వెనుదిరిగిన సీబీఐ అధికారులు

తెనాలి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘అయేషా హత్య జరిగి పదహారేళ్లవుతోంది. సీబీ ఐ ఈ కేసు తీసుకుని ఐదేళ్లవుతోంది. అయినా కేసులో ఏమాత్రం పురోగతి లేదు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యల్లేవు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక్కరినైనా అరెస్ట్‌ చేసి మా దగ్గరకు రండి. అప్పుడు సహకరిస్తాం. ఇప్పుడు మాత్రం స్టేట్‌మెంట్‌ ఇవ్వం’ అంటూ అయేషా తల్లిదండ్రులు సంషాద్‌బేగం, ఇక్బాల్‌బాషా తెగేసి చెప్పేశారు. బతికుండగా న్యాయం చూడలేమేమో అంటూ కంటతడి పెట్టారు. దీంతో సీబీఐ అధికారులు వెనుదిరగక తప్పలేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అయేషా మీరా 2007 డిసెంబరు 27న ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌ గదిలో దారుణ హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు 16 సంవత్సరాల్లో అనేక మలుపులు తిరుగుతూ.. అనేక వ్యవస్థల చేతులు మారుతూ వచ్చింది. 2018లో సర్వోన్నత న్యాయస్థానం అప్పగించటంతో సీబీఐ ఈ కేసును తీసుకుంది. మొదట్లో హడావుడి చేసిన అఽధికారులు 2019లో మళ్లీ రీపోస్టుమార్డం చేశారు. ముస్లిం మతాచారానికి విరుద్ధంగా సమాధిని తవ్వేందుకు మత పెద్దలను ఒప్పించి మరీ రీ పోస్ట్‌మార్టంకు అయేషా తల్లిదండ్రులు సహకరించారు. అది జరిగిన ఐదేళ్లకు ఆదివారం సీబీఐ అడిషనల్‌ ఎస్పీ సి.ఆర్‌.దాస్‌, మరో ముగ్గురు అధికారులు తెనాలి పాండురంగపేటలోని అయేషా ఇంటికి వచ్చారు. ‘మీ పాప హత్య కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు వచ్చామ’ని చెప్పటంతోనే తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో వారిపై మండిపడ్డారు. కేసుతో సంబంధం ఉన్నదని మేము మొదటి నుంచి చెబుతున్న కవిత, సౌమ్య, ప్రీతి, అబ్బూరి గణేష్‌, చింతా పవన్‌, కోనేరు సతీష్‌, కోనేరు సురే్‌షలలో ఒక్కరినైనా అరెస్ట్‌ చేశామని చూపితే.. అప్పుడు స్టేట్‌మెంట్‌ ఇస్తామని చెప్పారు. ఏ వ్యవస్థపై మేము నమ్మకం పెట్టుకోవాలో మీరే చెప్పాలంటూ ప్రశ్నించటంతో చేసేదిలేక వారు తిరిగి వెళ్లిపోయారు. అయితే వీరితోపాటు మరో ఇద్దరిని కూడా ప్రశ్నించేందుకు వచ్చారని, వారు స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి ఇష్టపడితే మళ్లీ కబురుచేస్తామని అధికారులకు చెప్పినట్టు సంషాద్‌ బేగం చెప్పారు.

Updated Date - 2023-09-18T03:21:35+05:30 IST