Share News

అయ్యారే.. అవుకు!

ABN , First Publish Date - 2023-11-29T04:13:51+05:30 IST

కృష్ణా జలాలను కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తరలించేందుకు గత ప్రభుత్వాలు జీఎన్‌ఎ్‌సఎ్‌స(గాలేరు-నగరి సుజల స్రవంతి) ప్రాజెక్టును చేపట్టాయి.

అయ్యారే.. అవుకు!

కీలక పనులన్నీ బాబు హయాంలోనే

సొరంగాల్లో ఫాల్ట్‌జోన్‌లపై అధ్యయనం

350 మీటర్ల ఫాల్ట్‌ జోన్‌ పనులు పూర్తి

జగన్‌ హయాంలో 160 మీటర్ల పనులకు నాలుగున్నరేళ్లుగా సాగదీత.. బిల్లులు నిల్‌

ముందుకు సాగని లైనింగ్‌, ఆర్చి పనులు

ఎన్నికల ముంగిట క్రెడిట్‌ కోసం.. రేపు ప్రారంభం

(అవుకు/నంద్యాల-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అవుకు టన్నెల్‌ పనులు పూర్తి కాకుండానే సీఎం జగన్‌ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి సొరంగాల పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. అయినా.. క్రెడిట్‌ కోసం కుస్తీ పడుతున్న వైసీపీ ప్రభుత్వం రిబ్బన్‌ కటింగులకే ప్రాధాన్యం ఇస్తోంది.

ఏంటీ అవుకు?

కృష్ణా జలాలను కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తరలించేందుకు గత ప్రభుత్వాలు జీఎన్‌ఎ్‌సఎ్‌స(గాలేరు-నగరి సుజల స్రవంతి) ప్రాజెక్టును చేపట్టాయి. ముందుగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 39 టీఎంసీల వరద జలాలను గోరుకల్లు రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి అవుకు రిజర్వాయర్‌కు తరలించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కడప, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లోని 2.6 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రా మాల్లోని 5 లక్షల మందికి తాగునీరు అందిచాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ క్రమంలో గోరుకల్లు రిజర్వాయ ర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు 57.7 కిలో మీటర్ల మేర కాలువను నిర్మించాలని భావించారు. అయితే, గోరుకల్లు నుంచి నీరు అవుకు రిజర్వాయర్‌లోకి వెళ్లేందుకు మధ్య లో భారీ కొండ అడ్డుగా మారింది. దీంతో కొండను తొలచి సొరంగ మార్గం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీనికి గత ప్రభుత్వాలు ప్యాకేజీ 30 కింద పనులు చేపట్టాయి. అయితే, పనులు కొలిక్కి రాలేదు. ఆ తర్వాత 2014లో విభజిత ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు అవుకు టన్నెల్‌ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఈ సొరంగ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేట్టారు. సొరంగ మార్గంలో ఫాల్ట్‌ జోన్‌లు ఏర్పడ్డాయి(మట్టి పొరలు బలహీనంగా ఉండి పైనుంచి మట్టి పెళ్లలు ఊడి పడుతున్న ప్రాంతం). కుడి సొరంగంలో 350 మీటర్లు, ఎడమ సొరంగంలో 160 మీటర్ల ఫాల్ట్‌జోన్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించా రు. ఫాల్ట్‌ జోన్‌ కారణంగా టన్నెల్‌ పనులు ముందుకు సాగలేదు. దీంతో అప్పటి సీఎం చంద్రబాబు నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించారు. ఆ నివేదిక ప్రకా రం కుడి సొరంగంలోని ఫాల్ట్‌జోన్‌ ప్రాంతం నుంచి రెండు బైపాస్‌ సొరంగాలు(డీ-1, డీ-2) తవ్వి, మట్టిపెళ్లలు ఊడిపోకుండా గడ్డర్లను ఏర్పాటు చేశారు. చంద్రబాబు చొరవతో కేవలం రెండేళ్లలోనే బైపాస్‌ సొరంగాల నిర్మాణాలు పూర్తయ్యాయి.

160 మీటర్ల పనులకే నాలుగున్నరేళ్లు!

అవుకు టన్నెల్‌ పనుల్లో కేవలం ఎడమ సొరంగం ఫాల్ట్‌జోన్‌ పనులు, లైనింగ్‌ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జగన్‌ సీఎంగా పగ్గాలు చేపట్టాక సంవత్సరంలోపు ఈ టన్నెల్‌ పనులు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారు. అయితే, రివర్స్‌ టెండరింగ్‌ పేరిట అప్పటికే పనులు చేస్తున్న కంపెనీని తప్పించి తమకు అనుకూలమైన కంపెనీకి కట్టబెట్టారు. రూ.108 కోట్లతో పనులు చేజిక్కించుకున్న సంస్థ పనులు చేట్టింది. అయితే, ప్రభుత్వం బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో పను లు నెమ్మదించాయి. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన టన్నెల్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కుడి సొరంగంలోని నాన్‌ఫాల్ట్‌జోన్‌లో ఉన్న 200 మీటర్ల లైనింగ్‌ పనులు, ఆర్చి పనులు పెండింగ్‌లో ఉండగా, ఎడమ సొరంగంలోని నాన్‌ఫాల్ట్‌ జోన్‌లోనూ 800 మీటర్లు లైనింగ్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

చంద్రబాబు దూరదృష్టి!

+నిపుణుల కమిటీతో అవుకు సొరంగంలోని

ఫాల్ట్‌జోన్‌పై అధ్యయనం.

+ఫాల్ట్‌జోన్‌ నుంచి 2 బైపాస్‌ సొరంగాలు(డీ-1, డీ-2) తవ్వి,

మట్టిపెళ్లలు ఊడిపోకుండా గడ్డర్ల ఏర్పాటు.

+కేవలం రెండేళ్లలోనే బైపాస్‌ సొరంగాల నిర్మాణాలు పూర్తి.

+కుడి సొరంగం ఫాల్ట్‌ జోన్‌ 350 మీటర్ల పనులు కూడా.

+ఎడమ సొరంగం ఫాల్ట్‌జోన్‌ పనులు, లైనింగ్‌ పనులు చేపట్టే సరికి ఎన్నికలు.

జగన్‌ రివర్స్‌!

+ రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పనులు చేస్తున్న కంపెనీ తొలగింపు.

+ అనుకూల కంపెనీకి రూ.108 కోట్లతో పనులు.

+ బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో నెమ్మదించిన పనులు.

+ ఎడమ సొరంగం ఫాల్ట్‌ జోన్‌ 160 మీటర్ల పనులకు నాలుగేళ్లు.

+ కుడి సొరంగం నాన్‌ఫాల్ట్‌జోన్‌లో 200 మీటర్ల లైనింగ్‌, ఆర్చి పనులు పెండింగ్‌

+ ఎడమ సొరంగం నాన్‌ఫాల్ట్‌ జోన్‌లో 800 మీటర్ల లైనింగ్‌ పనులు పెండింగ్‌.

+ అయినప్పటికీ ఈ నెల 30న నీటిని విడుదలకు సిద్ధం.

తరలింపుతో తిప్పలు

ఈ ఏడు వర్షాలు సరిగా పడకపోవడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు సరిగా లేదు. ముఖ్యంగా ఎస్సార్బీసీ కింద లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండటంతో గోరుకల్లు రిజర్వాయర్‌ మీదే రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రస్తుతం అవుకు టన్నెల్‌ను సీఎం జగన్‌ ప్రారంభిస్తున్న సందర్భంగా దాదాపు రెండు టీఎంసీల నీటిని గోరుకల్లు నుంచి అవుకుకు తరలించేందుకు సిద్ధమయ్యారు. 12.4 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరుకల్లులో ప్రస్తుతం 8 టీఎంసీలే ఉన్నాయి. ఉన్న నీటిలో 2 టీఎంసీలు తరలించేస్తే ఎస్సార్బీసీ ఆయకట్టుకు అన్యాయం చేసినట్లే నని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారుల అనాలోచిత నిర్ణయంతో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

Updated Date - 2023-11-29T04:14:08+05:30 IST