CBI: అవినాష్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల పరంపర.. రేపటి విచారణపై సందిగ్ధత

ABN , First Publish Date - 2023-04-21T17:26:21+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి (YSR Congress MP Avinash Reddy) సీబీఐ (CBI) విచారణ ముగిసింది.

CBI: అవినాష్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల పరంపర..  రేపటి విచారణపై సందిగ్ధత

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి (YSR Congress MP Avinash Reddy) సీబీఐ (CBI) విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ (CBI) కార్యాలయంలో మూడవరోజు అవినాష్ రెడ్డిని సుమారు 6 గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రేపు సీబీఐ విచారణకు అవినాష్ హాజరుపై సాయంత్రం చెబుతామని సీబీఐ పేర్కొంది. రేపు రంజాన్ సందర్భంగా అవినాష్ సీబీఐ విచారణపై సందిగ్ధత నెలకొంది.

మరోవైపు మూడవ రోజు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ సీబీఐ కస్టడీ ముగిసింది. సుమారు 6 గంటల పాటు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ను సీబీఐ అధికారులు విచారించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌లను సీబీఐ కార్యాలయం నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌లను రేపు మరోసారి సీబీఐ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ రోజు నెల 24 వరకు సీబీఐ కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట్ స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం అన్ని విషయాలు పరిశీలిస్తామని కోర్ట్ వెల్లడించింది. హైకోర్ట్ తీర్పు చాలా దారుణమని, ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు.

‘‘దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవడం సరికాదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేసులోని మెరిట్స్ ప్రకారం లేవు. హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించింది. హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ సీబీఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా చూడాలి. కానీ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు దర్యాప్తునకు అవరోధం కల్గించేలా ఉన్నాయి’’ అని న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదించారు. ఈ సందర్భంగా అవినాష్ లాయర్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

Updated Date - 2023-04-21T17:28:36+05:30 IST