19వేల కోట్లతో ‘ఆసరా’

ABN , First Publish Date - 2023-03-26T03:46:22+05:30 IST

‘‘ఆసరా పథకం అమల్లో ఎక్కడా ఎవరూ లంచాలు అడగరు. ఎవరూ వివక్ష చూపరు.

19వేల కోట్లతో ‘ఆసరా’

మూడేళ్లలో అందించిన మొత్తమిది

దెందులూరు సభలో జగన్‌...నిధుల విడుదల

ఏలూరు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆసరా పథకం అమల్లో ఎక్కడా ఎవరూ లంచాలు అడగరు. ఎవరూ వివక్ష చూపరు. మీ అన్న బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి’’ అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైఎ్‌సఆర్‌ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శనివారం బటన్‌ నొక్కి ప్రారంభించారు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో కలిపి ‘ఆసరా’ పథకం ద్వారానే రూ.19,178 కోట్లు అందించామన్నారు. మహిళలకు ఉపాధి, వ్యాపార మార్గాలు చూపించేలా ఎల్‌అండ్‌టీ, పీఅండ్‌జీ, రిలయన్స్‌, ఐటీసీ, అమూల్‌, అల్లానా, మహేంద్రా గ్రూప్‌ తదితర సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాలకు సగటున రూ.14వేల రుణం అందగా... ఇప్పుడు 30వేలు అందుతున్నాయని చెప్పారు. 99.55 శాతం రికవరీతో ఏపీ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారని జగన్‌ పేర్కొన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం పోస్టులు మహిళలకే ఇవ్వాలని చట్టం చేశామని గుర్తు చేశారు. దిశ యాప్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ఇప్పటికి 26 వేల మంది మహిళలకు మంచి జరిగిందన్నారు. ఇన్ని చేసిన తమ ప్రభుత్వంపై ప్రజల చల్లని చూపులు ఉండాలని ఆశిస్తూ ప్రసంగం ముగించారు.

Updated Date - 2023-03-26T03:46:29+05:30 IST