అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయమే!
ABN , First Publish Date - 2023-03-18T06:47:06+05:30 IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం ఖాయమని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే చాన్స్
అయితే ప్రభుత్వం తరఫున వెళతారా.. వ్యక్తిగతంగా వెళతారా అన్నది తేలాలి
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు
న్యూఢిల్లీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం ఖాయమని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ అందగానే అవినాశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంను ఆశ్రయిస్తారా..?, లేకపోతే వ్యక్తిగతంగా వెళతారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి చెత్త కేసులను సుప్రీంకోర్టు హడావుడిగా స్వీకరించదని చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలుచేస్తే, జగన్ కేసులను వాదించిన న్యాయవాదులే, పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్నారని చెప్పారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తిచేయమని సుప్రీంకోర్టు చెప్పిందని, ఇప్పుడు ఈ కేసు విచారణనే నిలుపుదల చేయమని సుప్రీంను కోరతారా..? అని రఘురామ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర విఫలమే
ఒక్క సమావేశంతో రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, ప్రత్యేక హోదా కల్పిస్తే రూ.26లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం జగన్ ప్రధాని మోదీకి చెప్పినట్లుగా తెలిసిందని రఘురామ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే పోలవరం బిల్లులు ఆలస్యమయ్యాయని సీఎం ఢిల్లీకి వచ్చారంటే నమ్మడానికి ప్రజలేమీ చెవిలో పువ్వులు పెట్టుకోలేదన్నారు. కోడికత్తి కేసులో జగన్ ఏప్రిల్ 10న విచారణకు హాజరు కావలసిందిగా కోర్టు ఆదేశించిందని, కానీ ఆయన హాజరవుతారని తాను అనుకోవడం లేదని రఘురామ అన్నారు. ఈ కేసులో శ్రీనును ముఖ్యమంత్రి జగన్ క్షమించి ఉద్యోగావకాశం కల్పించాలని సూచించారు.
రాజధాని వద్దని తేల్చిచెప్పిన విశాఖ ప్రజలు
ప్రశాంత వాతావరణం కోరుకునే విశాఖ ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పినట్లయిందని రఘురామ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి మంచి మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు బీజీపీని, విద్యావంతుడైన మాధవ్‌ను వద్దనుకొని టీడీపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ కట్టబెట్టడం వెనుక అధికార పార్టీని తుక్కుతుక్కుగా ఓడించాలనే లక్ష్యమే కనిపిస్తోందన్నారు. తూర్పు రాయలసీమ పరిధిలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం దిశగా ముందుకు సాగుతున్నారని రఘురామ తెలిపారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎదురీదడాన్ని గమనిస్తే ‘వై నాట్ 175’ ఎటు పోయిందని ప్రశ్నించారు.