ఆరోగ్య శ్రీ సేవలు యథాతథం
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:26 AM
నెట్‌వర్క్ ఆస్పత్రులు మళ్లీ వెనక్కి తగ్గాయి. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసే ప్రకటనను వాయిదా వేశాయి.
ప్రభుత్వంతో చర్చల్లో వెనక్కు తగ్గిన నెట్‌వర్క్ ఆస్పత్రులు
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నెట్‌వర్క్ ఆస్పత్రులు మళ్లీ వెనక్కి తగ్గాయి. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసే ప్రకటనను వాయిదా వేశాయి. గురువారం ఉదయం ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉన్నతాధికారులతో మూడు గంటలపాటు జరిగిన చర్చల్లో ఇరువర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. కానీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఒకడుగు వెనక్కి వేశాయి. 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఎప్పటిలానే శుక్రవారం కూడా ఆరోగ్యశ్రీ సేవలు తమ ఆస్పత్రుల్లో కొనసాగుతాయని ప్రతినిధులు చెప్పారు. ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య జరిగిన చర్చల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆస్పత్రుల యాజమాన్యానికి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము చెప్పింది చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు మాట్లాడడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఆస్పత్రుల డిమాండ్లపై స్పందించిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు... ‘‘ప్యాకేజీల పెంపు సాధ్యం కాదు. ఇప్పుడున్న ప్రొసీజర్లల్లో 50 లేదా 100 ప్రొసీజర్ల ప్యాకేజీలే పెంచేందుకు ప్రయత్నిస్తాం. ఆ లిస్ట్ కూడా నెట్‌వర్క్ ఆస్పత్రులే ఇవ్వాలి’’ అని తెలిపారు. వెయ్యి కోట్ల బకాయిల్లో ఇప్పటికే రూ.500 కోట్లు ఇచ్చేశామని, మరో రూ.500 కోట్లు 15 రోజుల్లో క్లియర్ చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. దీంతో ప్రతినిధులు చేసేది లేక చర్చలు వాయిదా వేసుకుని వెనక్కి వచ్చేశారు.