మిర్చిపై అకాల పిడుగు
ABN , First Publish Date - 2023-03-19T03:19:17+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది.

ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు
వాన నీటిలో నానుతున్న మిర్చి పంట
వందలాది హెక్టార్లలో పంట నష్టం
నాణ్యత తగ్గి, రంగు మారుతుందని ఆందోళన
‘పల్నాడు’లో పెనుగాలులకు విరిగిన చెట్లు
నేలకొరిగిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు
నకరికల్లు-కారంపూడి రోడ్డుపై ఆగిన ట్రాఫిక్
మొక్కజొన్న, మామిడి పంటలకూ తీవ్ర నష్టం
ఏలూరు జిల్లాలో పలుచోట్ల వడగళ్ల వాన
ఇంటిపై భారీ వృక్షం పడి మహిళ మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలకు మిర్చి రైతుకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే నల్లితామర పురుగు ఆశించడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గగా, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిసి ముద్దవుతోంది. వర్షం విడవకుండా పడుతుండటంతో తడిసిన మిర్చి పంటను ఆరబెట్టేందుకు సాధ్యం కావడం లేదు. టార్పాలిన్లు, బరకాలు కప్పుతున్నా పంట తడుస్తూనే ఉంది. దీంతో పంట నాణ్యత తగ్గి, రంగుమారి డిమాండ్ పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నకరికల్లు, రొంపిచర్ల మండలాల పరిధితో సాయంత్రం దాదాపు గంట పాటు వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీచాయి. పెద్దఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. నకరికల్లు నుంచి కారంపూడి వెళ్లే ప్రధాన రహదారిలో చెట్లు కూలిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లో మిరప తడిసి ముద్దయింది. మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడి, ముసునూరు, టి.నరసాపురం మండలాల్లో వడగళ్ల వాన పడింది. ఇక్కడ మామిడి, పొగాకు, మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. జంగారెడ్డిగూడెం సమీపంలోని తాడువాయి గ్రామంలో ఇంటిపై భారీ వృక్షం పడటంతో ఒక మహిళ మృతి చెందింది. ఇక శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో సాయంత్రం సుమారు 40 నిమిషాల పాటు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కాగా, నెల్లూరు జిల్లాలో కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షాలకు తడిసిపోకుండా కాపాడుకునేందుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో కల్లాల్లో మిర్చి కొట్టుకుపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిరప పంట భారీగా దెబ్బతింది. కల్లాల్లో ఆరబెట్టుకున్న పంట వర్షానికి తడిసిపోయింది. మరోపక్క కోత దశలో ఉన్న పండు మిరప పూర్తిగా నేలరాలింది. నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ, గడివేముల, రుద్రవరం తదితర మండలాల్లో సుమారు 1,702 హెక్టార్లలో మిరప పంట దెబ్బతింది. మొత్తం రూ.37.57కోట్ల నష్టం సంభవించిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలోని హాలహర్వి, కోసిగి, గోనెగండ్ల, కౌతాళం మండలాల్లో సుమారు 500 హెక్టార్లలో మిరప పంట దెబ్బతింది.