యువత రాజకీయాల్లోకి రావాలి
ABN , First Publish Date - 2023-06-26T03:38:22+05:30 IST
రాజకీయాల్లో నానాటికీ విలువలు పడిపోతున్నాయి. వీటిని గాడిలో పెట్టి సమాజాన్ని బాగు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
అరాచక నేతలకు, బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే జనం బుద్ధి చెప్పాలి: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య
అనకాపల్లి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘‘రాజకీయాల్లో నానాటికీ విలువలు పడిపోతున్నాయి. వీటిని గాడిలో పెట్టి సమాజాన్ని బాగు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందువల్ల యువత రాజకీయాల్లోకి రావాలి’’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీవీ రమణ శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వెంకయ్య మాట్లాడుతూ, వీవీ రమణ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, రైతుల కోసం ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని కొనియాడారు. రాజకీయాల గురించి మాట్లాడను అంటూనే ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీలకు అతీతంగా, రాజకీయాలంటే గౌరవభావం కలిగేలా మార్పునకు కృషి చేయాలి. రాజకీయ నాయకుల అరాచకాలపై మాట్లాడితే సంక్షేమ పథకాలు తీసేస్తారేమోనని పలువురు భయపడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఇటువంటి వారు మాటల్లో కాకుండా ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు కూడా ఇదే తరహాలో బుద్ధి చెప్పాలి. కొంతమంది నాయకులు కులాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దురదృష్టకరం. రాజకీయాల పట్ల గౌరవం పెరగాలంటే కులాలకు అతీతంగా నీతి, నిజాయతీతో, అంకిత భావంతంతో అరాచకాలకు చోటివ్వకుండా రాజకీయాలు చేయాలి. చట్టసభలు దేవాలయాలతో సమానంగా భావించాల్సింది పోయి, వాటి స్థాయి తగ్గించే విధంగా కొంతమంది ప్రవర్తించడం దురదృష్టకరం. రాజకీయాల్లో శత్రువులు ఉండకూదని, ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి. రాజకీయాల్లో గుణం, శీలం, శక్తి సామర్థ్యాలకు బదులు క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలటీ పెరిగిపోయాయి’’ అని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.