మహానాడుకు నడిచైనా వస్తాం!

ABN , First Publish Date - 2023-05-26T03:26:01+05:30 IST

జగన్‌ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ మహానాడుకు భారీగా తరలివచ్చేందుకు టీడీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు సమాయత్తమవుతున్నారు.

మహానాడుకు నడిచైనా వస్తాం!

టీడీపీ శ్రేణుల పంతం

ఆర్టీసీ, ప్రైవేటు, స్కూలు బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వ ఆంక్షలు

గోదావరి జిల్లాల్లో మొదలైన పసుపు పండుగ సందడి

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ మహానాడుకు భారీగా తరలివచ్చేందుకు టీడీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు టీడీపీ వాళ్లకు ఇవ్వకూడదని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు, స్కూలు స్కూల్‌ బస్సులు కూడా ఇవ్వడానికి వీల్లేదని ఆపరేటర్లు, యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. దీంతో నడిచైనా వచ్చేందుకు టీడీపీ శ్రేణులు పట్టుదలగా ఉన్నారు. ఆటోలు, మ్యాజిక్‌ క్యాబ్‌లు, మోటారు సైకిళ్లు, కార్ల మీదే ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆటోలు, మ్యాజిక్‌ క్యాబ్‌వంటివన్నీ బుక్‌ చేశారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులతో పాటు, పార్టీ పదవులు ఉన్నవారు, మండల, గ్రామ స్థాయి నాయకులంతా ఎవరికి వారు వాహనాల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంత నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల మందికి పైగా జనం తరలి రానుండగా.. ఇతర నియోజకవర్గాల నుంచి కనీసం 15 వేల మంది చొప్పున వస్తారని అంచనా వేస్తున్నారు.

పసుపు గోదారి..

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మహానాడు సందడి తెచ్చేసింది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో ప్రతినిధులు సభ, బహిరంగ సభ ఏర్పాట్లు చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. వేమగిరి నుంచి లాలాచెరువు వరకూ రాజమహేంద్రవరం హైవే అంతా పసుపుతోరణాలతో, ఫెక్సీలతోనూ పసుపుమయమైంది. కాగా.. నగరంలో బుధవారం అర్ధరాత్రి వైసీపీ కవ్వింపుచర్యకు దిగింది. నగరమంతా టీడీపీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు కడుతుంటే.. అర్ధరాత్రి పోటీగా స్థానిక ఎంపీ మార్గాని భరత్‌ చెప్పారంటూ కొందరు వైసీపీ ఫ్లెక్సీలు కట్టడం గమనార్హం. వారిని టీడీపీ నేతలు కాశినవీన్‌, కుడుపూడి సత్తిబాబు, మజ్జి రాంబాబు అడ్డుకున్నారు. వారు వెళ్లిపోయాక కోటిపల్లి బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో వైసీపీ ఫ్లెక్సీలు కట్టారు. ఇది తెలిసి టీడీపీ నేతలు వచ్చి వాటిని తీసివేయించారు.

ట్రాఫిక్‌ సమస్యపై ఎస్పీకి వినతి..

టీడీపీ సీనియర్‌ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఎస్‌ జవహర్‌, గన్నికృష్ణ, అంగర రామ్మోహన్‌ తదితరులు గురువారం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి.. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి మహానాడు ఏర్పాట్లకు సంబంధించిన బ్లూప్రింట్లు అందజేశారు. బహిరంగ సభ, ప్రతినిధుల సభ, వచ్చే జనం అంచనా, భోజన ఏర్పాట్లు, పార్కింగ్‌ తదితర ప్రాంతాల గురించి ఆయనకు వివరించి పోలీసు బందోబస్తు కల్పించి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలని వినతిపత్రం ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కు ప్రత్యేక భద్రత కల్పించాలని కూడా ఎస్పీని కోరారు.

నేడు రాజమండ్రికి బాబు

రాజమహేంద్రవరం, మహానాడులో పాలుపంచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారమే రాజమహేంద్రవరానికి వస్తున్నారు. శని, ఆదివారాల్లో ఇక్కడ జరిగే మహానాడుకోసం ఆయన ఒక రోజు ముందుగానే వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఏలూరు, భీమడోలు, నల్లజర్ల, కొవ్వూరు మీదుగా సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరంలోని మంజీరా సరోవర్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 7.30కు బయల్దేరి వేమగిరిలోని మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. శనివారం పార్టీ ప్రతినిధుల సమావేశం, 28వ తేదీన ఎన్టీఆర్‌ శతజయంతి, మహానాడు బహిరంగ సభల్లో పాల్గొంటారు. మూడు రోజులూ సభ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతి గృహంలో బస చేస్తారు.

మహానటుడు ఎన్టీఆర్‌

విజయవాడ : నటన నిలువెల్లా మూర్తీభవించిన మహానటుడు ఎన్టీఆర్‌ అని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం కొనియాడారు. ఆయన ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రను ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరన్న గొప్పగా నటించేవారన్నారు. ఎక్స్‌రే సంస్థ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందానికి ఎన్టీఆర్‌ శతజయంతి అవార్డు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ నవ్వించడంతో పాటు ఏడిపించడం గొప్ప ఆర్ట్‌ అని, రంగమార్తాండ సినిమాలో నటించి బ్రహ్మానందాన్ని పొందానని చెప్పారు. ఎన్టీఆర్‌ అవార్డు తీసుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు.

Updated Date - 2023-05-26T03:26:01+05:30 IST