అమరావతే రాష్ట్ర రాజధాని
ABN , First Publish Date - 2023-06-26T03:02:21+05:30 IST
రాష్ట్ర రాజధాని అమరావతేనని 99శాతం మంది సమాధానాలిచ్చారని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తెలిపారు.
చంద్రబాబు సీఎం అయితేనే పోలవరం పూర్తి
జన జాగరణ సమితి ప్రశ్నలకు 99 శాతం మంది సమాధానాలు
విశాఖపట్నం, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతేనని 99శాతం మంది సమాధానాలిచ్చారని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన అంశాలపై ప్రజలకు జన జాగరణ సమితి ఆధ్వర్యంలో శనివారం ప్రశ్నలు సంధించారు. సరైన సమాధానాలు చెప్పిన వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పెద్దఎత్తున స్పందించిన ప్రజలు వాట్సాప్ నంబరుకు ఆదివారం సమాధానాలు పంపారన్నారు. వీటిలో ఏపీ రాజధాని ఏది అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానాల్లో 99 శాతం అమరావతి అని తెలిపారని వాసు వెల్లడించారు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 2025 జూన్ నాటికి పూర్తవుతుందని ఎక్కువమంది సమాధానాలు పంపించారన్నారు. విశాఖ ఉక్కును కాపాడేది ఎవరు.? అని అడిగిన ప్రశ్నకు.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఎక్కువమంది పంపించగా, చంద్రబాబు సీఎం అయితే ఉక్కును నిలబెడతారని మరికొంతమంది, పవన్ కల్యాణ్ సీఎం అయితే కాపాడే అవకాశముందని మరింతమంది తెలిపారన్నారు. కాగా, ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బిహార్‌గా మారుతుందంటూ ఇంకొందరు భిన్నమైన సమాధానాలు పంపించినట్టు వాసు వెల్లడించారు. కాగా, తాము సంధించిన ప్రశ్నలకు 8వేల మందికిపైగా స్పందించారని ఆయన వివరించారు.