బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , First Publish Date - 2023-06-26T03:26:10+05:30 IST

ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ...

బంగాళాఖాతంలో అల్పపీడనం

మరిన్ని రాష్ట్రాలకు విస్తరించిన రుతుపవనాలు

విశాఖపట్నం, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం మొత్తం విస్తరించిన తరువాత ఈ సీజన్‌లో ఏర్పడిన తొలి అల్పపీడనం ఇదే. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌ మీదుగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచలప్రదేశ్‌లలో పూర్తిగా, గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణాలో అనేక ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు 62ఏళ్ల తర్వాత ముంబై, ఢిల్లీ నగరాలను ఒకేరోజు తాకాయి. ఆదివారం ఈ రెండు నగరాలకు రుతపవనాలు విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది. ఢిల్లీకి షెడ్యూల్‌ కంటే రెండు రోజుల ముందు, ముంబైకి రెండు వారాలు ఆలస్యంగా రుతుపవనాలు వచ్చాయని పేర్కొంది. చివరిసారిగా 1961 జూన్‌ 21న ఈ రెండు నగరాలలోకి ఒకే రోజున రుతుపవనాలు వచ్చాయని వివరించింది. మరోవైపు అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలకు 9జిల్లాల్లో 4లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారని, ముగ్గురు చనిపోయారని అసోం విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. 1,118 గ్రామాలు నీటమునిగాయని, 8,469 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. కాగా, రుతుపవనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఆదివారం ఉరుములు, ఈదరుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2023-06-26T03:26:10+05:30 IST