ముందస్తు బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా!

ABN , First Publish Date - 2023-05-26T03:33:54+05:30 IST

వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

ముందస్తు బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా!

వాదనలకు రెండ్రోజులు కావాలన్న ఎంపీ తరఫు సీనియర్‌ న్యాయవాది

తమకు గంట చాలన్న సీబీఐ

కోర్టు సమయం ముగియడంతో నేడు వాదనలు వింటామన్న కోర్టు

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఆయన పిటిషన్‌ గురువారం జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ వెకేషన్‌ బెంచ్‌ ఎదుట 77వ కేసుగా లిస్ట్‌ అయింది. సాయంత్రం 6.30 గంటలకు విచారణకు వచ్చింది. ఎవరెవరు ఎన్ని గంటలు వాదనలు వినిపిస్తారో చెప్పాలని న్యాయమూర్తి కోరారు. తమకు గంట సరిపోతుందని సీబీఐ న్యాయవాదులు తెలిపారు. అయితే తమకు రెండ్రోజులు కావాలని.. కనీసం ఒక రోజంతా అవసరమని అవినాశ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇంతకు ముందు అవినాశ్‌రెడ్డి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి కూడా రెండ్రోజులు వాదనలు వినిపించారని.. ఈ ధర్మాసనం కొత్తగా కేసును విచారిస్తున్నందున దాదాపు అంతే సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇంకా వినాల్సిన లంచ్‌ మోషన్‌ పిటిషన్లు ఉండడంతో ఈ పిటిషన్‌పై వాదనలు వినడం సాధ్యం కాదని న్యాయమూర్తి తెలిపారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు. నిజానికి శుక్రవారం వెకేషన్‌ బెంచ్‌కు పనిదినం కాకపోయినప్పటికీ... ఈ కేసు కోసమే సమావేశం అవుతుండడం విశేషం. ఈ కేసుపై ఇదివరకు వాదనలు విన్న జస్టిస్‌ కె.సురేందర్‌ ధర్మాసనం.. విచారణను జూన్‌ 5కు వాయిదా వేసింది. దీనిపై అవినాశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో గురువారం హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఈ కేసు వినాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అవినాశ్‌ తల్లి ఆరోగ్యం మెరుగు.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

అవినాశ్‌ తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గత మూడురోజుల్లో ఆమె ఆరోగ్యం కుదుటపడిందని వెల్లడించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ‘‘వాంతులు తగ్గాయి. అలా్ట్రసౌండ్‌ అబ్‌డమిన్‌ పరీక్షల్లో ఎటువంటి ముఖ్యమైన పాథాలజీ కనిపించలేదు. ఆమెకు అయోనోట్రోప్స్‌ నిలిపివేశాం. అవి లేకపోయినా ఆమె ప్రాణాధారాలు స్థిరంగా ఉన్నాయి. ఐసీయూ నుంచి గదికి మార్చాలని యోచిస్తున్నాం’’ అని వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-05-26T03:33:54+05:30 IST