పవన్‌పై వ్యాఖ్యల సాకుతో విశ్వరూప్‌కు పొగ.. పక్కకు తప్పించే వ్యూహం.. ఎంపీని బరిలోకి దింపే యోచనలో వైసీపీ..!
ABN , First Publish Date - 2023-06-26T03:13:01+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలనేది అభిమానుల కోరికే కాదు.
జనసేనాని సీఎం కావాలని వ్యంగ్యంగా అన్న మంత్రి
ఆయన జనసేనలోకి వెళ్తున్నారని వైసీపీ అనుకూల చానల్లో ప్రసారం
ఆయన కుమారుడు సంప్రదింపులు జరిపారనీ కథనాలు
తిరుమలలో చేసిన వ్యాఖ్యల సాకుతో విశ్వరూప్‌ను పక్కకు తప్పించే వ్యూహం!
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలనేది అభిమానుల కోరికే కాదు. నా కోరిక కూడా. ఆయన 175 స్థానాల్లో పోటీ చేసినా.. 100 స్థానాల్లో పోటీచేసినా ముఖ్యమంత్రి కావాలి’ అని మంత్రి పినిపె విశ్వరూప్ శనివారం తిరుమలలో వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకత్వం తనకు అనుకూలంగా మలచుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని.. అమలాపురం లోక్‌సభ సభ్యురాలు చింతా అనూరాధను ఇక్కడినుంచి బరిలోకి దించాలని ఇప్పటికే ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని... అందుకే ఆయనకు పొగపెడుతోందని.. ఆయన వ్యాఖ్యల సాకుగా ఏకంగా పక్కనపెట్టేయాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అధికార పక్షం కూడా దమ్ముంటే పవన్ 175స్థానాల్లోనూ పోటీ చేయాలని సవాల్ విసరుతోంది. దాదాపు ఇదే తరహాలో పినిపె మాట్లాడినప్పటికీ.. వ్యక్తిగతంగా పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నాననడాన్ని వైసీపీ నాయకత్వం తప్పుబడుతోంది. ఉమ్మడిగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటిస్తున్న వేళ మంత్రి వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. పాలకపక్షానికి సన్నిహితంగా వ్యవహరించే ఒక చానల్లో విశ్వరూప్ జనసేనలోకి వెళ్లనున్నారని బ్రేకింగ్ న్యూస్ వేసింది. జనసేన నేతలతో ఆయన కుమారుడు సంప్రదింపులు జరిపారన్న కథనాలూ ప్రసారం చేసింది. దీంతో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన విశ్వరూప్‌కు పొమ్మనలేక పొగపెడుతున్నారా అని వైసీపీ నేతలు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు గతంలో చోటు చేసుకున్న సంఘటనలను ఉదాహరణలుగా చూపుతున్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరుపెట్టడాన్ని నిరసిస్తూ జరిగిన అల్లర్లలో విశ్వరూప్ ఇంటికి ఆకతాయిలు నిప్పుపెట్టారు. ఈ సమయంలో ఆయన, కుటుంబ సభ్యులు లేకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ సీఎం జగన్ ఆయన్ను కలిసి గానీ, ఫోన్లో గానీ కనీసం పరామర్శించకపోవడంపై పెద్ద దుమారమే రేగింది. తోటి మంత్రులు కూడా కొన్నిరోజుల తర్వాత మొక్కుబడిగా ఆయన ఇంటికి వెళ్లారు. మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన నిందితులకు బెయిల్ లభించింది. జనసేన తరఫున గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇంట జరిగిన వివాహానికి సీఎం జగన్ ప్రత్యేకంగా వెళ్లారు. మంత్రి మండలి సమావేశానంతరం హెలికాప్టర్లో విశ్వరూ్‌పతో కలసి నేరుగా రాజోలుకు వెళ్లారు. విశ్వరూ్‌పను వెంటబెట్టుకువెళ్లడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న గుసగుసలూ వినిపించాయి. ఇటీవల అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలాపురం ఎంపీ చింతా అనూరాధ జోక్యం బాగా పెరిగిందని.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆమెకేనంటూ వైసీపీలో ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలో తిరుమలలో విశ్వరూప్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలను వైసీపీ భూతద్దంలో చూడడం.. ఆయన పార్టీని వీడుతున్నారంటూ సన్నిహిత చానల్‌కు లీకులివ్వడం వెనుక ఆయన్ను పక్కనబెట్టేసే వ్యూహమే దాగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.