వైసీపీ పాలన నుంచి.. రాష్ట్రాన్ని విముక్తి చేస్తా!

ABN , First Publish Date - 2023-06-26T03:09:48+05:30 IST

పులివెందుల నుంచి వచ్చి పచ్చటి గోదావరి జిల్లాల్లో దౌర్జన్యం చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

వైసీపీ పాలన నుంచి.. రాష్ట్రాన్ని విముక్తి చేస్తా!

గోదావరిలో ఆ పార్టీ ఒక్క సీటైనా గెలవకూడదు: పవన్‌

పచ్చటి జిల్లాల్లో ‘పులివెందుల’ దౌర్జన్యాలు

వేల కోట్లు దోచుకుంటున్న ప్రజాప్రతినిధులపై కేసులేవీ!

నేతల దోపిడీపై ఏసీబీ ఏం చేస్తోంది?

జనసేన అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్‌ వైవీ అక్రమాలపై విచారణ

మలికిపురం బహిరంగ సభలో జనసేనాని

మేం అధికారంలోకి వచ్చిన రోజున ఇళ్లల్లో ఉన్న వైసీపీ క్రిమినల్స్‌ను లాక్కొచ్చి తంతాం. నేను బతికి ఉన్నంత వరకు జనాన్ని క్రిమినల్స్‌ శాసిస్తుంటే చూడలేను. వారి దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు ధర్మ యుద్ధం చేస్తా.

- పవన్‌ కల్యాణ్‌

మలికిపురం/అమలాపురం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పులివెందుల నుంచి వచ్చి పచ్చటి గోదావరి జిల్లాల్లో దౌర్జన్యం చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. రాష్ట్రాన్ని వైసీపీ పాలన నుంచి విముక్తి చేస్తానన్నారు. దానికంటే ముందు ఉభ య గోదావరి జిల్లాలను వైసీపీ నుంచి విముక్తి చేయాలన్నది తన కోరికగా పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న 34 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదని స్పష్టం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరుగుతున్న వారాహి విజయ యాత్రలో భాగంగా ఐదో రోజైన ఆదివారం రాత్రి మలికిపురం సెంటర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మధ్యాహ్నం దిండి రిసార్ట్స్‌లో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో నిర్వహించిన సమావేశంలోనూ మాట్లాడారు. నిరుద్యోగులు వందో రెండొందలో లంచం తీసుకుని పట్టుబడితే కఠిన శిక్ష వేస్తున్నారని.. కానీ ఈ ప్రభుత్వంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు రూ.వేల కోట్లు దోపిడీ చేస్తూ ఆస్తులు సంపాదిస్తుంటే వారిపై ఏసీబీ కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. భూగర్భ గనులు, ఇసుకలో గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని, గోదావరి నదులన్నీ గుల్ల చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ముగ్గు రు వ్యక్తులు మాత్రమే రాష్ట్ర ఖనిజ సంపదను దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీవాణి ట్రస్టు నిధుల విషయంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై తనకు నమ్మకం లేదన్నారు. 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, శ్రీవాణి ట్రస్టు వ్యవహారాలపై విచారణ జరిపి కేసులు నమోదు చేయిస్తామని.. ఆయనకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..

తరతరాలుగా గుప్పెట్లో!

ఒక సీఎం కొడుకు తరతరాలుగా ఒక ప్రాంతాన్ని, ఒక నియోజకవర్గాన్ని, ఒక జిల్లాను గుప్పెట్లో పెట్టుకున్నాడు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. అది లక్ష కోట్లకు పైగా చేరింది. రూ.200 లంచం తీసుకుంటే చిన్నపాటి అధికారుల మీద, ట్రాఫిక్‌ చలానా వేస్తే ట్రాఫిక్‌ పోలీసుల మీద.. ఇలా అనేక శాఖల అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసి వారి ఉద్యోగాలను సైతం ఊడపీకుతున్నారు. వేల కోట్లు దోపిడీ చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఏసీబీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏ ఏసీబీ ఈ అక్రమాలను ఆపుతుంది? తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులను ఇక్కడ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణానికి ఖర్చు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. హిందూ ధార్మిక సంస్థల నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో వినియోగించడం వెనుక ఆంతర్యమేంటి? రాష్ట్రంలో దేవాలయాల్లో పనిచేసే 2 లక్షల మంది అర్చకులున్నారు. వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

జగన్‌ అనకొండ

సీఎం జగన్‌ అనకొండలాంటివాడు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని కూడా మింగేశాడు. వైసీపీ క్రిమినల్స్‌ను హెచ్చరిస్తున్నా. మా మీద ఒక్క రాయి పడినా, ఒక్క చేయి పడినా, మా ఆడపడుచులను ఒక్క మాట అన్నా మిమ్మల్ని తన్ని తగలేస్తాం. క్రిమినల్స్‌, చైన్‌గ్యాంగ్స్‌, రౌడీలను మీరు పులివెందులలోని ఇడుపులపాయలో పెట్టుకోండి. ఇక్కడకు తీసుకురావద్దు. ఎక్కడో కూర్చొని బటన్‌ నొక్కడం కాదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. నలభై ఏళ్ల కాలంలో సఖినేటిపల్లి-నరసాపురం మధ్య వంతెన నిర్మించలేకపోయారు.

జగన్‌.. హెలికాప్టర్లో తిరగడం కాదు. ప్రజల్లోకి వచ్చి వారు పడుతున్న కష్టాలు చూడు. నువ్వు వస్తుంటే చెట్లు కూడా నరికేసి పచ్చదనం లేకుండా చేస్తున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లిలోని నీ ఇంటికి వెళ్లాలంటే హెలికాప్టర్‌ కావాలి! ఇక రోడ్లెలా ఉన్నాయో నీకెలా తెలుస్తుంది? గాలిలో తిరిగే నిన్ను నేలపైకి దించుతా. గర్భిణులు, వృద్ధులు రోడ్లపై పడుతున్న నరకయాతనలను నీకు తెలియజేస్తా. జగన్‌ దళితులకు మేనమామనంటూ వారి సంక్షేమానికి ఉపయోగపడే 23 పథకాలను రద్దు చేశారు. అతడికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రక్షణగా ఉన్నాడు. జగన్‌ సహకరించారు. క్రిమినల్స్‌ను, రౌడీలను, అక్రమాలకు పాల్పడేవారిని సీఎం వెనకేసుకొస్తుంటే రాష్ట్రం ఏమవుతుంది? నేను ఫ్యాక్షనిస్టులకు భయపడే వ్యక్తిని కాదు. దాడి చేస్తే చూస్తూ ఊరుకునే వ్యక్తిని కాదు. వైసీపీ అంతాన్ని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని గోదావరి జిల్లాల నుంచే మొదలు పెట్టాలి.

రాపాక వంటి వారిని రీకాల్‌ చేయాలి

హత్యలు చేసి ఊరేగింపులు చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ వేధిస్తున్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలి. మీ ఓట్లను బోట్లుగా చేసుకుని గోదావరి దాటి అసెంబ్లీకి వెళ్లిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వంటి వారిని రీకాల్‌ చేసే హక్కు ప్రజలకు ఉండేలా చట్టాలు తీసుకురావాలి.

నేడు నరసాపురంలో పవన్‌ సభ

నరసాపురం, జూన్‌ 25: పవన్‌ కల్యాణ్‌ ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చేరుకున్నారు. సాయంత్రం అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారు.

Updated Date - 2023-06-26T03:09:48+05:30 IST