సచివాలయ ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్లు

ABN , First Publish Date - 2023-06-26T03:24:53+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు.

సచివాలయ ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్లు

సర్వీసు రూల్స్‌ను వెంటనే రూపొందించాలి

ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

రెండోసారి రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ

ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షునిగా జానీ పాషా

విజయవాడ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని ఏపీఎన్జీఓ హోమ్‌లో ఆదివారం సచివాలయ ఉద్యోగుల సంఘాల నేతలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభు త్వం వెంటనే పరిష్కరించాలన్నారు. శానిటేషన్‌ విభాగంలో పనిచేసే కార్యదర్శులకు సాధారణ ఉద్యోగుల పనివేళలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు రూల్స్‌ను వెంటనే రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పదోన్నతులు, జాబ్‌ చార్టులతో పాటు ఇతర అన్ని సమస్యల విషయంలో సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు .చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రొబేషన్‌ పూర్తయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమేనని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వర్తిస్తాయని తెలిపారు. కాగా, ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా ఎండీ జానీ పాషా మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఎపీఎన్జీవో భవన్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన వర్గానికి చెందిన 21 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా పుట్టి రత్నం, ఉపాధ్యక్షులుగా ఎస్‌.హరి, కె.రామకృష్ణారెడ్డి, ఈ. హరీంద్ర, గణేశ్‌కుమార్‌, కోశాధికారిగా బి.పుల్లారావు ఎన్నికయ్యారు.

Updated Date - 2023-06-26T03:24:53+05:30 IST