ఫొటో దిగలేదని పేదోడిపై పగ!
ABN , First Publish Date - 2023-05-26T03:52:04+05:30 IST
తనతో ఫొటో దిగేందుకు నిరాకరించిన ఓ పేదోడిపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు.

పథకాలు ఆపేయాలి.. హోటల్ తొలగించాలి
‘గడప గడప’లో ప్రభుత్వ విప్ కాపు ఆదేశాలు
బొమ్మనహాళ్, మే 25: తనతో ఫొటో దిగేందుకు నిరాకరించిన ఓ పేదోడిపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు. ‘ఆ కుటుంబానికి అందే సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపేయండి. వాళ్లు హోటల్‌ను రోడ్డు వరకూ నిర్మించారు. వెంటనే దాన్ని తొలగించండి’ అని అధికారులను ఆదేశించారు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండల పరిధిలోని దర్గాహోన్నూరులో గురువారం నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఒకటో సచివాలయం పరిధిలో టీడీపీ కార్యకర్త రఫీ ఇంటికి వెళ్లిన ఆయన.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల బుక్‌లెట్ తీసుకుని ఫొటో దిగాలని కోరారు. దీనికి నిరాకరించిన రఫీ... ‘మీ ప్రభుత్వంలో మాకు కొత్తగా వచ్చిందేమీ లేదు సార్’ అనడంతో కాపు ఆగ్రహానికి లోనయ్యారు. అప్పటికప్పుడు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ఆదేశించారు. ‘హోటల్ రోడ్డు వరకు కట్టుకున్నాడు. దీన్ని తొలగించండి’ అని అధికారులకు హుకుం జారీచేశారు. దీంతో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘మీ కుటుంబానికి, ఇంటికి సంబంధించిన ఆధారాలు తీసుకురండి. హోటల్‌లో ఏ పామాయిల్ వాడుతున్నావు..?’ అంటూ హంగామా చేశారు. వంద గ్రాముల పామాయిల్‌ను శాంపిల్‌గా సేకరించి తీసుకెళ్లారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, ఫొటో దిగలేనని అన్నందుకు ఎమ్మెల్యే అనరాని మాటలు అన్నారని రఫీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రభుత్వంలో తమకు ఇల్లు కట్టించి ఇవ్వలేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఎన్‌టీఆర్ గృహం మంజూరైందని చెప్పాడు. తమకు ఈ హోటలే జీవనాధారమని, దాన్ని తొలగిస్తామనడం దురదృష్టకరమని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.