సాక్షి కేలండర్ తప్ప.. జాబ్ కేలండర్ లేదు
ABN , First Publish Date - 2023-05-26T03:50:08+05:30 IST
సాక్షి కేలండర్ తప్ప.. జాబ్ కేలండర్ లేదు

ప్రభుత్వవిప్ కరణం ధర్మశ్రీని నిలదీసిన యువత
డబ్బుల్లేవని సమాధానమిచ్చిన ఎమ్మెల్యే..
‘గడప గడప’లో రహదారుల దుస్థితిపైనా నిలదీత
రోలుగుంట, మే 25: ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఏ గడపకు వెళ్లినా వైసీపీ నేతలకు నిలదీతలే స్వాగతం పలుకుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా ధర్మశ్రీ ఈ నెల 22న కొండపాలెంలో పర్యటించారు. అనంతరం స్థానికులతో సమావేశమయ్యారు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని కోరగా... గాలి వినయ్ మణికిరణ్, జోగాడ దేవగణేశ్, కిల్లా సాయి, మరికొందరు యువకులు జాబ్ కేలండర్‌పై ధర్మశ్రీని ప్రశ్నించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని, కోచింగ్ తీసుకున్నామని ప్రభుత్వం జాబ్ కేలండర్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ కేలండర్ అన్నారు కానీ, సాక్షి కేలండర్ తప్ప జాబ్ కేలండర్ రావడం లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వస్తున్నాయని, మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ధర్మశ్రీ స్పందిస్తూ.. ‘తెలంగాణకు మనకూ పోలికేమిటి.. డబ్బుల్లేకే ఈ పరిస్థితి...’ అని సమాధానమిచ్చారు. అనంతరం ఈ నాలుగేళ్లలో రోడ్లు పరిస్థితి చూశారా ఎలా ఉన్నాయో?, మీరొచ్చిన రోడ్డు ఎంత దారుణంగా ఉందో గమనించారా...? అని యువకులు ప్రశ్నించారు. రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని, పనులు అవుతాయని ఎమ్మెల్యే బదులిచ్చారు. ఈ క్రమంలో స్థానిక యువతకు, ధర్మశ్రీకి వాగ్వాదం మొదలు కావడంతో ఎస్‌ఐ నాగకార్తీక్ యువకులను అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.