దళితుల ఓట్లపైనే జగన్‌ ప్రేమ

ABN , First Publish Date - 2023-05-26T03:30:23+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌కు దళితుల ఓట్లపైనే తప్ప వారిపై ప్రేమ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు.

దళితుల ఓట్లపైనే జగన్‌ ప్రేమ

వారి అభివృద్ధి పట్టదు

రూ.28,147 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లింపు

టీడీపీ అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు: లోకేశ్‌

నేటి నుంచి 4 రోజులు యువగళం పాదయాత్రకు విరామం

కడప, మే 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌కు దళితుల ఓట్లపైనే తప్ప వారిపై ప్రేమ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆయన అధికారంలోకి వచ్చాక దళితుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన రూ.28,147 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించారని విమర్శించారు. టీడీపీ హయాంలో దళితుల కోసం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలు రద్దుచేశారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం 110వ రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామం ఎన్‌.కొత్తపల్లెలో విడిది కేంద్రం నుంచి ఆయన నడక ప్రారంభించారు. పెద్దపసుపుల గ్రామంలో జనం లోకేశ్‌కు హారతులు పట్టి పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. ఆయన దళిత కాలనీలోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. లోకేశ్‌ స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు రూ.లక్ష కోట్లకు పైగా బిల్లులు పెండింగులో పెట్టారు. బిల్లులు రాకపోవడంతో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు అప్పులబాధ తట్టుకోలేక పక్క రాష్ట్రం వెళ్లారు. నీ చేతకాని దివాలాకోరు పాలనతో ఇంకెంతమందిని బలితీసుకుంటావు జగన్‌రెడ్డీ! సమస్యలపై ప్రశ్నించిన డాక్టర్‌ సుధాకర్‌ను వేధింపులకు గురిచేయడంతో ఆయన చనిపోయారు. కడప జిల్లాలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టరు అచ్చెన్నను దారుణంగా హత్య చేసిన దుర్మార్గ ప్రభుత్వమిది. దళిత సోదరులు ఇప్పటికైనా వాస్తవం గుర్తించి చంద్రబాబును ముఖ్యమంత్రిచేసేందుకు సహకారం అందించాలి’ అని కోరారు. కొత్తపల్లె నుంచి జమ్మలమడుగు శివారు వరకు లోకేశ్‌ 12.3 కి.మీ. నడిచారు.

వినతుల వెల్లువ

జమ్మలమడుగు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో లోకేశ్‌కు జనం నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సొంత జిల్లాలో వినతిపత్రాలు అందించడం చూసి టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ శ్రేణులూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. వారి సమస్యలను పరిష్కరించడానికి టీడీపీ అధికారంలో లేదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిష్కరించాలని వారు కోరుతుండడం గమనార్హం. పెద్దపసుపులలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గీయులు పలువురు లోకేశ్‌ను కలిశారు. ఆయన్ను చూసేందుకు గ్రామంలో పెద్ద ఎత్తున మేడల పైకి, రోడ్లపైకి వచ్చారు. ఆయన వీధులన్నీ కలియదిరిగి అందరికీ అభివాదం చేశారు. చిన్నపిల్లలను దగ్గరకు తీసుకుని ఎత్తుకున్నారు. సమస్యలు సావఽధానంగా వింటూ ప్రజలతో మమేకమై సెల్ఫీలు తీసుకుంటూ ముందుకు నడిచారు. జమ్మలమడుగు శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రం వద్ద ఆగారు. అక్కడ పలువురు తమ సమస్యలను లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 11.30 గంటలకు ముగిసింది.

30 నుంచి మళ్లీ పాదయాత్ర

మహానాడు నేపఽథ్యంలో లోకేశ్‌ పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారు. ఈ నెల 30న జమ్మలమడుగు నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు.

Updated Date - 2023-05-26T03:30:23+05:30 IST