‘మధ్యాహ్న భోజనం’ నిధులేవీ?
ABN , First Publish Date - 2023-06-07T04:10:26+05:30 IST
మధ్యాహ్న భోజన పథకం ఖాతాలో మొదటి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బదిలీ చేయలేదని కేం ద్ర ప్రభుత్వం గుర్తించింది. నిబంధనల ప్రకారం కేంద్రం వాటా కింద ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన మొత్తాన్ని కలిపి 30 రోజుల్లో పథకం ఖాతాలో జమ చేయాల్సి ఉంది.
మొదటి విడత నిధుల బదిలీలో జాప్యంపై కేంద్రం కొర్రీలు
యూసీ సమర్పిస్తేనే మిగిలిన నిధులు విడుదల చేస్తాం
ఏపీలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు రూ.524కోట్లు
పీఎం పోషణ్ పథకం కింద ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, జూన 6(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకం ఖాతాలో మొదటి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బదిలీ చేయలేదని కేం ద్ర ప్రభుత్వం గుర్తించింది. నిబంధనల ప్రకారం కేంద్రం వాటా కింద ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన మొత్తాన్ని కలిపి 30 రోజుల్లో పథకం ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం అలా చేయలేద ని కేంద్రం ఆక్షేపించింది. రాష్ట్రంలో మరో 6,173 వంట గదుల నిర్మాణానికి రూ.195.23 కోట్లు సరిపోతాయని, కాబట్టి రాష్ట్రం వద్ద మిలిగి ఉన్న కేంద్రం వాటా రూ.117.13 కోట్లు, దానికి రాష్ట్ర వాటా రూ.78.09కోట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని గుర్తుచేసింది. రాష్ట్రం వద్ద అందుబాటులో ఉన్న కేంద్రం వాటా నిధులకు సంబంధించి యుటిలైజేషన సర్టిఫికెట్(యూసీ) అందిస్తే మరో రూ.173.25 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, 2023-24 సంవత్సరానికి గాను ‘పీఎం పోషణ్’ కింద రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి రూ. 524.71 కోట్లకు కేంద్ర విద్యాశాఖలోని ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు(పీఏబీ) వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. అందులో కేంద్రం తన వాటాగా రూ.331.37కోట్లు అందిస్తుంది. మిగితా రూ.193.42 కోట్లను రాష్ట్ర సర్కారు భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రాథమిక స్థాయిలో 18,41,057 మంది విద్యార్థులకు, అప్పర్ ప్రైమరీ స్థాయిలో 11,62,854 మంది విద్యార్థులకు, జాతీయ బాలకార్మిక పాఠశాలల్లో 902 మంది విద్యార్థులకు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.