JAGAN GOVT DEBT: అడ్డదారిలో అప్పు

ABN , First Publish Date - 2023-01-25T02:53:45+05:30 IST

జగన్‌ సర్కారు అడ్డదారిలో మరో భారీ అప్పు తెచ్చింది. తెచ్చిన అప్పును బిల్లుల బకాయిల కోసం కోర్టు మెట్లెక్కుతున్న బాధితుల కోసమో, గవర్నర్‌ తలుపు తట్టిన ఉద్యోగుల కోసమో ఉపయోగించలేదు.

JAGAN GOVT DEBT: అడ్డదారిలో అప్పు

అస్మదీయులకు చెల్లింపు!

కావాల్సిన కాంట్రాక్టర్లకు రూ.10 వేల కోట్లు

ఒక్క వారంలోనేచెల్లించిన జగన్‌ సర్కారు

ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ నుంచి 5 వేల కోట్ల రుణం

వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా రూ.2,200 కోట్లు

పన్నుల వాటాగా వచ్చిన రూ.2,800 కోట్లు

మొత్తం 10 వేల కోట్లు ‘సొంత’ కాంట్రాక్టర్లకే!

ఉద్యోగుల సమస్యలు గాలికొదిలేశారు..

చిన్న బకాయిల చెల్లింపులూ లేవు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు అడ్డదారిలో మరో భారీ అప్పు తెచ్చింది. తెచ్చిన అప్పును బిల్లుల బకాయిల కోసం కోర్టు మెట్లెక్కుతున్న బాధితుల కోసమో, గవర్నర్‌ తలుపు తట్టిన ఉద్యోగుల కోసమో ఉపయోగించలేదు. అచ్చంగా... తన అస్మదీయ కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు చేసేసింది. కేవలం వారం రోజుల్లో తమకు నచ్చిన, కొందరు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు రూ.10వేల కోట్లు చెల్లించింది. ఇందులో... రూ.5వేల కోట్లు కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని తప్పుడు మార్గాల్లో అప్పుగా తెచ్చినవే. ఇవి కాకుండా ఆర్‌బీఐ నుంచి వేస్‌ అండ్‌ మీన్స్‌ రూపంలో రూ.2,200 కోట్ల అప్పు తీసుకున్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల్లో వాటా కింద వచ్చిన రూ.2,800 కోట్లు ఖజానాకు చేరాయి. ఇలా మూడు మా ర్గాల్లో వచ్చిన రూ.10వేల కోట్లను ఈ నెల 17 నుంచి 23వ తేదీ మధ్యకాలంలో అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించేశారు.

దొంగ అప్పులపై భారీ వడ్డీ

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రానికి తెలియకుండా వేల కోట్ల అప్పులు తెస్తూనే ఉంది. ఈ దొంగ అప్పులపై కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా, రాజ్యాంగ విరుద్ధ అప్పులు చేయొద్దంటూ లేఖలు రాసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు కేంద్రం కూడా లేఖలతో సరిపెట్టి ఊరుకుంటోంది. దీంతో మూడు రోజుల క్రితం ఆర్‌ఈసీ (గ్రామీణ విద్యుదీకరణ సంస్థ), పీఎ్‌ఫసీ (పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) సంస్థల నుంచి రాష్ట్రంలోని కొన్ని కార్పొరేషన్లకు రూ.4,000 కోట్ల అప్పు లభించింది. మరో కార్పొరేషన్‌ ద్వారా రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఓపెన్‌ మార్కెట్లో అప్పులపై వడ్డీ 7.5 శాతం నుంచి 8 శాతం లోపే ఉంది. కానీ... ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ నుంచి తెస్తున్న అప్పులపై 11 నుంచి 11.5 శాతం వరకు వడ్డీ పడుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.85 లక్షల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో లక్ష లోపు బిల్లులూ అనేకం ఉన్నాయి. ఈ పెండింగ్‌ బిల్లులపై కోర్టులో దాదాపు 2 లక్షల కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సకాలంలో వేతనాలు ఇవ్వాలని, జీపీఎఫ్‌, డీఏ, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు చెల్లించాలని ఎప్పట్నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. కానీ, జగన్‌ ప్రభుత్వానికి ఇవేవీ కనపడలేదు. భారీ వడ్డీకి అప్పు తెచ్చి మరీ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఆగమేఘాల మీద బిల్లులు చెల్లించేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి దాకా (ఏప్రిల్‌-జనవరి) పది నెలల్లో కేంద్రం కళ్లుకప్పి కార్పొరేషన్ల ద్వారా రూ.28,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఇందులో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వాటాయే రూ.8300 కోట్లు, ఇంకా ఇతర కార్పొరేషన్ల నుంచి రూ.12,000 కోట్లు, మారిటైమ్‌ బోర్డు ద్వారా రూ.2,700 కోట్లు తెచ్చారు. తాజాగా తెచ్చిన రూ.5,000 కోట్లు కలిపి మొత్తం అడ్డదారుల్లో తెచ్చిన అప్పు రూ.28,000 కోట్లకు చేరింది.

10 నెలల్లో రూ.80,300 కోట్ల అప్పు

వైసీపీ సర్కార్‌ 10 నెలల్లో రూ.80,300 కోట్ల అప్పులు చేసింది. ఇవి కాకుండా చెల్లించాల్సిన బిల్లులు రూ.35,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 2 నెలలుంది. అప్పటికి ఈ ఏడాదిలో చేసిన అప్పు రూ.96,300కోట్లకు చేరే అవకాశం ఉంది. పెండింగ్‌ బిల్లులతో కలిపితే అప్పులు రూ.9,14,136 కోట్లకు చేరతాయి.

మరో 1,000 కోట్ల అప్పు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు కొత్తగా ఇంకో రూ.1000 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం తరపున సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తెచ్చారు. దీనితో కలుపుకొంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - జనవరి వరకు 10 నెలల్లో తెచ్చిన అప్పు రూ.80,300 కోట్లకు చేరింది. పెండింగ్‌ బిల్లులు రూ.35,000 కోట్లున్నాయి. ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ నుంచి మూడు రోజుల క్రితం తెచ్చిన రూ. 5వేల కోట్లు; మారిటైమ్‌ బోర్డు ద్వారా తెచ్చిన రూ.2,700 కోట్ల అప్పు, నేరుగా తెచ్చిన అప్పు రూ.72,600 కోట్లలో రూ.48,300 కోట్లు ఆర్‌బీఐలో సెక్యూరిటీలు వేలం ద్వారా; రూ.8,300కోట్లు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా; రూ.12,000కోట్లు ఇతర కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి; రూ.4,000 కోట్లు ఈఏపీ అప్పు లు ఉన్నాయి.

Updated Date - 2023-01-25T08:21:29+05:30 IST