CPS : సీపీఎస్‌పై మరో డ్రామా!

ABN , First Publish Date - 2023-06-02T03:56:08+05:30 IST

సీపీఎస్‌ రద్దు హామీపై ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ అంశంలో ఉద్యోగులు గత రెండేళ్లుగా ప్రభుత్వంపై వ్యతిరేకతను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ పలు రకాల పోరాటాలు చేశారు. ప్రజాప్రతినిధులను కలిశారు.

CPS : సీపీఎస్‌పై మరో డ్రామా!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డితో చర్చల్లో ఉద్యోగ సంఘాల నేతలు

రద్దంటూ సర్కారు కొత్త నాటకం

ఉద్యమాన్ని నీరుగార్చే ఎత్తుగడ అంటున్నఉద్యోగులు

(అమరావతి–ఆంధ్రజ్యోతి)

సీపీఎస్‌ రద్దు హామీపై ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ అంశంలో ఉద్యోగులు గత రెండేళ్లుగా ప్రభుత్వంపై వ్యతిరేకతను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ పలు రకాల పోరాటాలు చేశారు. ప్రజాప్రతినిధులను కలిశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు నిరసనను కొంత ఉధృతం చేశారు. ఇప్పుడు ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ సీపీఎస్‌ రద్దు తమ ప్రధాన డిమాండ్‌గా ప్రస్తావిస్తున్నాయి. దీంతో జగన్‌ సర్కార్‌ ఉలికిపాటుకు గురవుతోంది. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చింది. అయితే, సీపీఎస్‌ ఉద్యోగులు నాలుగేళ్లు పోరాటాలు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సీపీఎస్‌ రద్దు అన్న ప్రచారాన్ని అంతర్గతంగా ప్రభుత్వం వ్యాప్తి చేస్తోంది. నాలుగేళ్లు పోరాటం చేసినా, పట్టించుకోని సర్కార్‌ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం కొత్త డ్రామా ప్రారంభించిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించి, అమలయ్యే వరకు ఈ ప్రచారాలు నమ్మే పరిస్థితే లేదని సీపీఎస్‌ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సీపీఎస్‌ను రద్దు చేయబోమనే హామీతో కేంద్రం నుంచి రూ.4,200 కోట్లు అప్పు తెచ్చి జగన్‌ సర్కార్‌ వాడేసింది. అంటే ఇక రద్దు చేసే ప్రసక్తేలేదు. అయినా, ఉద్యమాన్ని నీరుగార్చడానికి సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ ఇలాంటి లీకులకు ప్రభుత్వం తెరతీసిందని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

2004 సెప్టెంబరు ఒకటికి ముందు పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఫలితాలు వెల్లడించి, సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగంలో చేరడం ఆలస్యమైన ఉద్యోగులకు కేంద్రం పాత పింఛన్‌ అమలు చేయాలని రాష్ట్రాలకు సర్క్యులర్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌ అమలు చేసింది. రాష్ట్రంలో ఈ విధంగా నియామకాలు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు 10వేల మంది వరకు ఉన్నారు. వీరికి ఓపీఎస్‌ అమలుపై కేబినెట్‌లో పెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇటీవల విలేకరుల సమావేశంలో చెప్పారు. అయితే, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం అమలు చేయమంది, వెసులుబాటు ఉంది, కాబట్టి ఓపీఎస్‌ అమలు చేశాం. మిగిలిన వారికి సాధ్యం కాలేదు కాబట్టి చేయలేకపోయాం అంటూ 10వేల మందికి సీపీఎస్‌ రద్దుచేసి చేతులు దులుపుకోనుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో కూడా ప్రభుత్వానికి లాభం ఉంది. సీపీఎస్‌ ఉద్యోగుల సొమ్ము ఎన్‌ఎస్‌డీఎల్‌లో రూ.18,000 వేల కోట్లు ఉంది. కేంద్రం అమలు చేయమంది చేస్తే 10 వేల మందికి రాష్ట్రంలో ఓపీఎస్‌ అమలవుతుంది. దీంతో ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఉన్న రూ.4వేల కోట్ల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తిరిగి ఇస్తుంది. అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందా? అనే అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకూ ప్రభుత్వ గ్రాఫ్‌ పడిపోతుండడంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీపీఎస్‌ రద్దు అంటూ ప్రభుత్వం లీకులు ఇస్తోందా? ఏదో విధంగా సీపీఎస్‌ ఉద్యోగులను మభ్యపెట్టి మళ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తోందా? అనే అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తవుతున్నాయి. సీపీఎస్‌ రద్దు చేసే ఆలోచనే ఉంటే రద్దు చేయబోమనే హామీతో కేంద్రం నుంచి అప్పు ఎలా తెచ్చారు? ఎన్నికల కోసం రద్దు చేసినట్లు మభ్యపెడతారా? అని ఉద్యోగుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-06-02T03:56:08+05:30 IST