Share News

అంగన్వాడీల పోరు హోరు

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:36 AM

‘ప్రభువా... ముఖ్యమంత్రి జగన్‌ మనసు మార్చు. మా సమస్యలను నీవైనా ఆలకించి పరిష్కరించేలా చూడు’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఏసుక్రీస్తును ప్రార్థించారు.

అంగన్వాడీల పోరు హోరు

14వ రోజు సమ్మెలో ప్రార్థనలు.. దీక్షా శిబిరాల వద్దే క్రిస్మస్‌ వేడుకలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

‘ప్రభువా... ముఖ్యమంత్రి జగన్‌ మనసు మార్చు. మా సమస్యలను నీవైనా ఆలకించి పరిష్కరించేలా చూడు’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఏసుక్రీస్తును ప్రార్థించారు. తమ డిమాండ్ల సాధన కోసం 14 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు క్రిస్మస్‌ పండుగ సందర్భంగా సోమవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానం నుంచి వైఎంసీఏ మైదానం వరకు ప్రదర్శన నిర్వహించి, అక్కడున్న ఏసుక్రీస్తు విగ్రహం వద్ద ప్రార్థనలు చేశారు. మాజీ మేయర్‌ నందిమండలం భానుశ్రీ అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల కష్టాలను ఆలకించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లాలో రిలే నిరాహార దీక్షా శిబిరాల వద్దే అంగన్వాడీలు క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు. అక్కడే కేక్‌ కట్‌చేసి అందరికీ పంచారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపైనే పిండి వంటలు చేసి అందరికీ పంచి నిరసన తెలిపారు. జిల్లాలోని కొన్నిచోట్ల ఒంటి కాలిపై నిల్చొని నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ అంగన్వాడీ కార్యకర్త శిలువ ఆకారంలో నిలబడగా.. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ మిగిలిన వారు ప్రార్థన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు బాల ఏసు, మేరీమాత ప్రతిమలు పెట్టి ప్రార్థనలు చేశారు. వారి పోరాటానికి మద్దతుగా యూటీఎఫ్‌ నాయకులు రూ.10 వేలు అందజేశారు. ఇదే జిల్లా సాలూరులో అంగన్వాడీలు ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలిపారు. పాలకొండలో క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేసి కన్నీటి ప్రార్థన చేశారు. సీఎం జగన్‌కు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఏసు ప్రభువును వేడుకున్నారు. భామిని శిబిరంలో మినీ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త జి.పవిత్ర కళ్లు తిరిగి స్పృహ కోల్పోవడంతో తోటి కార్యకర్తలు సపర్యలు చేసి స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ఆమె కోలుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలో ఏసుక్రీస్తు చిత్రపటం పెట్టి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులో షూ పాలిష్‌, నాయుడుపేటలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. గూడూరు, కోటలలో ఒంటి కాలిపై నిలుచుని నిరసన, వెంకటగిరి, చంద్రగిరిలలో రిలే నిరాహార దీక్షలు, తిరుపతిలో సహపంక్తి భోజనాలు, సత్యవేడు, పిచ్చాటూరు, గూడూరుల్లో శిబిరాల్లోనే కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ వేడుకలు జరుపుకొన్నారు.

నే టి నుంచి సమ్మె ఉధృతం

సమ్మెను మరింత ఉధృతం చేయాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం నేతలు నిర్ణయించారు. సోమవారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, అధ్యక్షురాలు జి.బేబీరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(ఐఎ్‌ఫటీయూ) రాష్ట్ర నాయకురాలు ఒ.పద్మ మీడియాతో మాట్లాడారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్ల మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Updated Date - Dec 26 , 2023 | 02:38 AM