Share News

వేదనతో సీఎం జగన్‌కు లేఖ

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:25 AM

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్‌వాడీలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఉత్తరం ద్వారా మొరపెట్టుకున్నారు.

వేదనతో సీఎం జగన్‌కు లేఖ

జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల పోస్టుకార్డు ఉద్యమంఫ 16వ రోజుకు చేరిన దీక్షలు

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్‌వాడీలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఉత్తరం ద్వారా మొరపెట్టుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు గురువారం నాటికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టి తమ ఆవేదనను ఉత్తరాల ద్వారా ముఖ్యమంత్రి జగన్‌కు పంపారు.

ఆయా మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి అంగన్‌వాడీ వర్కర్లు పోస్టాఫీసు వరకు ప్రదర్శన నిర్వహించి తమ బాధలను తెలియజేస్తూ సీఎంకు ఉత్తరాలు రాసి పోస్టు చేశారు. యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 16రోజులుగా నివరధిక సమ్మె చేస్తున్నా సీఎం జగన్‌ స్పందించకపోవడం సరికాదని అన్నారు. న్యాయం జరిగేవరకూ పోరాటం వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రిటైర్డుమెంట్‌ అనంతరం రూ.5లక్షలతో పాటు వేతనంతో సగం పెన్షన్‌ ఇవ్వాలని, వేతనాలను పెంచి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం లేకపోవడంతో పాటు వయోపరిమితి 50ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను పెంచాలని, గ్యాస్‌ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌, సీఐటీయూ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- (ఆంధ్రజ్యోతి, విలేకరులు)

Updated Date - Dec 29 , 2023 | 12:25 AM