Share News

అలిపిరి బాంబు దాడి ఘటన..

ABN , Publish Date - Dec 16 , 2023 | 02:52 AM

అలిపిరి దాడి కేసులో మరో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

అలిపిరి బాంబు దాడి ఘటన..

మరో ముగ్గురిపై కేసు కొట్టివేత

నిర్దోషులుగా ప్రకటించిన తిరుపతి జిల్లా కోర్టు

తిరుపతి (లీగల్‌), డిసెంబరు 15: అలిపిరి దాడి కేసులో మరో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మాజీ నక్సలైట్లు, మావోయిస్టు సానుభూతిపరులు రామమోహన్‌ రెడ్డి, నరసింహా రెడ్డి, చంద్రలపై తిరుపతి జిల్లా కోర్టు కేసు కొట్టివేసింది. 2003 అక్టోబరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వెళ్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. నక్సలైట్లు క్లెమోర్‌మైన్లు అమర్చి భారీ పేలుడుకు పాల్పడ్డారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం అప్పటి పీపుల్స్‌వార్‌ అగ్రనేతలు, సానుభూతిపరులు, ఈ దాడికి సహకరించిన మొత్తం 33మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. వీరిలో కడప జిల్లాకు చెందిన కొల్లం గంగిరెడ్డి, నాగార్జున, రామస్వామి రెడ్డితోపాటు మావోయిస్టు నేత సాగర్‌పై తొలి విడత విచారణ జరిగింది. కింది కోర్టు వీరిని దోషులుగా ప్రకటించింది. అయితే... తిరుపతి జిల్లా కోర్టు వీరిలో కొల్లం గంగిరెడ్డి, సాగర్‌లను నిర్దోషులుగా విడుదల చేసింది. రామస్వామి రెడ్డి, నాగార్జున హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలు ఇంకా పెండింగ్‌లో ఉంది. దామోదరం అనే మరో నిందితుడిపైనా కోర్టు కేసు కొట్టివేసింది.

ఇక... మాజీ నక్సలైట్‌ రామమోహన్‌ రెడ్డి, నరసింహా రెడ్డి, చంద్రలపై రెండో విడత విచారణ జరిగింది. ట్రయల్‌ కోర్టు వీరిని కూడా దోషులుగా నిర్ధారించి నాలుగేళ్ల శిక్ష విధించింది. ఈ తీర్పును వీరు జిల్లా కోర్టులో సవాలు చేశారు. కేసును విచారించిన తిరుపతి 4వ అదనపు జిల్లా న్యాయస్థానం ఇన్‌చార్జి న్యాయాధికారి జి.అన్వర్‌బాషా ఆ ముగ్గురిపై కేసు కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. నిందితుల తరఫున పౌర హక్కుల సంఘం నేత, న్యాయవాది క్రాంతి చైతన్య వాదించారు. అలిపిరి ఘటనలో మొత్తం 33 మంది నిందితులు ఉండగా... వీరిలో 15 మంది మరణించారు. వీరిలో అత్యధికులు నక్సలైట్లే కాగా, దాదాపు అందరూ ఎన్‌కౌంటర్లలోనే చనిపోయారు. ఆరుగురిపై కేసు కొట్టివేయగా... శిక్ష పడిన ఇద్దరు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. మరో పది మంది నిందితులను పోలీసులు ఇప్పటిదాకా అరెస్టు చేయలేకపోయారు.

Updated Date - Dec 16 , 2023 | 02:52 AM