ఆగని.. వలంటీర్ల ఆగడాలు
ABN , First Publish Date - 2023-09-04T03:38:43+05:30 IST
రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల అకృత్యాలకు అంతులేకుండా పోతోంది. ఇప్పటికే పలువురు వలంటీర్ల చేతిలో మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారు.
బాపట్ల జిల్లాలో వివాహితపై అత్యాచారయత్నం
అడ్డుకున్న స్థానికులపై మారణాయుధాలతో దాడికి యత్నం
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
గుంటూరులో రూ.లక్షన్నర హిజ్రాల సొమ్ముతో మరో వలంటీరు పరారీ
చెరుకుపల్లి, గుంటూరు, సెప్టెంబరు 3: రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల అకృత్యాలకు అంతులేకుండా పోతోంది. ఇప్పటికే పలువురు వలంటీర్ల చేతిలో మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని బాప్టిస్టుపాలెంలో ఓ వివాహితపై వలంటీరు అత్యాచారయత్నం చేశాడు. బాధితుల కథనం మేరకు.. బాప్టిస్టుపాలెంలో ఆదివారం సీహెచ్ నవీన అనే వివాహిత ఇంటి అరుగుపై కూర్చున్న సమయంలో అదే గ్రామానికి చెందిన వలంటీర్ గాలిమోటు లోకకుమార్ వచ్చాడు. ‘నీతో పని ఉంది ఇంట్లోకిరా’ అంటూ లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో లోకకుమార్ బలంగా తన్నటంతో ఆమె కాలికి దెబ్బతగిలి కిందపడిపోయింది. చుట్టుపక్కలవారు వచ్చి వలంటీర్‌ను చుట్టుముట్టడంతో.. నన్నే అడ్డుకుంటారా.. మీఅంతు చూస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా.. కొద్దిసేపటికి వలంటీర్ లోకకుమార్ తన బంధువులు, మరికొంతమంది స్నేహితులను వెంటబెట్టుకుని మారణాయుధాలతో వచ్చి, బాధితురాలికి సపర్యలు చేస్తున్నవారిపై దాడికి యత్నించారు. దీంతో వారు తప్పించుకుని చెరుకుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఉదంతంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, వలంటీర్ గత ఏడాది కూడా తనపై ఒకసారి దౌర్జన్యం చేశాడని బాధితురాలు వాపోయింది. గ్రామంలో వలంటీర్ అరాచకాలకు తాళలేక చాలామంది మౌనం వహిస్తున్నారని, అదే గ్రామానికి చెందిన పంచాయతీ వార్డు సభ్యురాలు మరియమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. వడ్డీలకు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడమే కాకుండా, డబ్బులడిగితే ఎదురు కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
ఇప్పటికే వలంటీర్‌పై పలువురు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవటంతో మరింత రెచ్చిపోతున్నాడని స్థానికులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని ఏఎ్‌సఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇక, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓ వలంటీర్ రూ. 2 వేల నోట్లు మారుస్తానంటూ నమ్మించి కొందరు హిజ్రాల నుంచి రూ. లక్షన్నర తీసుకొని ఉడాయించాడు. కొంతకాలంగా సదరు వలంటీర్ హిజ్రాలతో సన్నిహితంగా ఉంటూ వారితో పరిచయం పెంచుకున్నాడు. రూ. 2వేల నోట్లు ఉంటే తనకివ్వాలని, బ్యాంకులో తనకు తెలిసిన వారు ఉన్నారని, ఎంతైనా మారుస్తానని హిజ్రాలతో నమ్మబలికాడు. వలంటీర్ మాటలు నమ్మిన హిజ్రాలు రూ.3 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు ఇచ్చారు. ఆ నోట్లను మార్చి వారికి రూ.3 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ నెలాఖరుతో రూ.2వేల నోట్లు మార్పిడి చేసుకునే గడువు ముగియటంతో మరోసారి రూ.లక్షన్నర విలువైన రూ.2వేల నోట్లు వలంటీర్‌కు అందించారు. దీంతో రూ.లక్షన్నర పెద్ద నోట్లతో సదరు వలంటీర్ హైదరాబాద్ ఉడాయించాడు. విషయం తెలుసుకుని కొందరు హిజ్రాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. అతడిపై స్థానిక పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదిచ్చినట్లు హిజ్రాలు తెలిపారు. వలంటీర్ వ్యవహారం బయటకు పొక్కితే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందేమోనని కొందరు అధికార పార్టీ నాయకులు కావాలనే ఈ ఉదంతాన్ని కప్పిపెడుతున్నట్లు స్థానికులు చెప్పుకొంటున్నారు. పరారైన వలంటీను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధిత హిజ్రాలు కోరుతున్నారు.