Share News

Supreme Court : ‘స్కిల్‌’ తీర్పు.. దీపావళి సెలవుల తర్వాతే!

ABN , First Publish Date - 2023-11-10T03:22:44+05:30 IST

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై దీపావళి సెలవుల తర్వాత తీర్పు ప్రకటిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఫైబర్‌నెట్‌ కేసులో

Supreme Court : ‘స్కిల్‌’ తీర్పు.. దీపావళి  సెలవుల తర్వాతే!

సుప్రీంకోర్టు వెల్లడి.. సెలవులు 13-19 వరకు

ఫైబర్‌నెట్‌ కేసు విచారణ 30కి వాయిదా

అప్పటిదాకా బాబును అరెస్టు చేయొద్దు: లూథ్రా

గత హామీ కొనసాగుతుందన్న సీఐడీ

న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై దీపావళి సెలవుల తర్వాత తీర్పు ప్రకటిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదావేసింది. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు కోర్టుకు దీపావళి సెలవులు. 19వ తేదీన ఆదివారం కూడా సెలవు. 20వ తేదీన కోర్టు పునఃప్రారంభమవుతుంది. ఆ వారంలో స్కిల్‌ కేసు తీర్పు వెలువడే అవకాశముందని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. ఫైబర్‌నెట్‌ కేసులో ఏసీబీ కోర్టు, హైకోర్టు తనకు ముందస్తు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ అధినేత దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ).. గురువారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చంద్రబాబే వేసిన పిటిషన్‌పై తీర్పును తాము ఇదివరకే రిజర్వు చేశామని, దీపావళి సెలవుల తర్వాత దీనిని వెలువరించే అవకాశాలున్నాయని జస్టిస్‌ బోస్‌ తెలిపారు. ఫైబర్‌నెట్‌ కేసులో కూడా అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌కు సంబంధించిన సారూప్య అంశాలు ఉన్నందున.. స్కిల్‌ కేసులో తీర్పు ఇచ్చాకే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను చేపడతామని వెల్లడించారు.

తొలుత ఫైబర్‌ నెట్‌ కేసును ఈ నెల 23న విచారిస్తామని జస్టిస్‌ బోస్‌ తెలుపగా.. తనకా రోజు ఇతరత్రా పనులు ఉన్నందువల్ల 30కి వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ఇందుకు జస్టిస్‌ బోస్‌ అంగీకరించారు. ఫైబర్‌నెట్‌ పిటిషన్‌లో కూడా తాము తీర్పు రిజర్వు చేసిన స్కిల్‌ కేసులోని అంశాలు పునరావృతమవుతున్నాయని.. అందువల్ల ఈ కేసు విచారణను 30వ తేదీకిలిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఫైబర్‌నెట్‌ కేసులో విచారణ పూర్తయ్యేదాకా చంద్రబాబును అరెస్టు చేయబోమని సీఐడీ హామీ ఇచ్చిందని.. అది కొనసాగించాలని లూథ్రా కోరారు. ఆ ఏర్పాటు కొనసాగుతోందని రాష్ట్రప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ తెలిపారు. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు గత నెల 30న హైకోర్టు 4 వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని సీఐడీ తరఫు మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. గత నెల 17న తన తీర్పును రిజర్వు చేయడం.. దీనిని వెలువరించే వరకూ ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేయవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే.

Updated Date - 2023-11-10T03:24:42+05:30 IST