ఆదివాసీలు వైసీపీని బహిష్కరించాలి

ABN , First Publish Date - 2023-03-26T04:24:23+05:30 IST

‘‘వాల్మీకి, బోయల్ని ఎస్టీల్లో చేర్చాలనే అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 14 నుంచి గిరిజన ప్రాంతాల్లో ఉద్యమిస్తున్నాం.

ఆదివాసీలు వైసీపీని బహిష్కరించాలి

ఎస్టీ జాబితా మార్పుపై ఏప్రిల్‌ 14 నుంచి ఉద్యమిస్తాం: వంశీకృష్ణ

అమరావతి, పాడేరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘‘వాల్మీకి, బోయల్ని ఎస్టీల్లో చేర్చాలనే అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 14 నుంచి గిరిజన ప్రాంతాల్లో ఉద్యమిస్తున్నాం. రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీలు, ఎస్టీలందరూ వైసీపీని బహిష్కరించాలి’’ అని ఆదివాసీ మేధావుల వేదిక అధ్యక్షుడు అనుముల వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన శనివారం ఓ ప్రకటన చేశారు. ‘‘కొండ కోనల్లో జీవించే ఆదివాసీలు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. మైదాన ప్రాంతాల్లో నివసిస్తూ ఆర్థికంగా బలంగా ఉన్న బోయ, వాల్మీకులతో ఉద్యోగాల్లో పోటీ పడటం అసాధ్యం. రాజ్యాంగంతో సంబంధం లేకుండా జగన్‌ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. అసెంబ్లీలో ఉండీ వాటిని వ్యతిరేకించలేని ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలి. ఆదివాసీ విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నేతలు, ఉద్యమకారులు, మేధావులతో అరకులో సమావేశమవుతాం. ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తాం’’ అని వంశీకృష్ణ తెలిపారు.

అసెంబ్లీ తీర్మానంపై అల్లూరి జిల్లాలో నిరసనలు

వెనుకబడిన తరగతులకు చెందిన బోయవాల్మీకి, బెంతోరియా కులాలను ఎస్‌టీ జాబితాలో చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-26T04:24:53+05:30 IST