6న ఎల్1 పాయింట్‌కు ‘ఆదిత్య’
ABN , Publish Date - Dec 24 , 2023 | 03:14 AM
సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగం చివరి ఘట్టానికి చేరువైంది. వచ్చే నెల 26న ఇది గమ్యస్థానానికి చేరుకోనున్నట్టు ఇస్రో చైర్మన్
సూళ్లూరుపేట, డిసెంబరు 23: సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగం చివరి ఘట్టానికి చేరువైంది. వచ్చే నెల 26న ఇది గమ్యస్థానానికి చేరుకోనున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆదిత్య-ఎల్1 జనవరి 26న ఎల్1 (లగ్రాంజ్ పాయింట్-1) పాయింట్‌లోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యోమనౌక ఎల్1 పాయింట్‌కు చేరుకొన్న తర్వాత మరోసారి ఇంజన్‌ను మండిస్తామని, ఆ తర్వాత ఇది ఎల్1 కేంద్రంలో స్థిరపడుతుందని చెప్పారు. ఆ తర్వాత అక్కడే కక్ష్యలో తిరుగుతూ... ఐదేళ్లపాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుందని వెల్లడించారు. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని అన్నారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం కోసం భారత్ తరపున ఇస్రో చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఇది. భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1కు చేరిన తర్వాత దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలుపెడుతుంది.