గూగుల్‌లో సెర్చ్ చేసి యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-03-19T02:19:40+05:30 IST
ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఓ విద్యార్థిని పీజీ సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయింది. ఈ పరిస్థితుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది.

ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న వైనం
ఆరోగ్యం బాగోలేక మానసిక ఒత్తిడితో
ఎమ్మెస్సీ విద్యార్థిని అఘాయిత్యం
నర్సీపట్నం, మార్చి 18: ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఓ విద్యార్థిని పీజీ సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయింది. ఈ పరిస్థితుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని.. గూగుల్‌లో ‘హౌ టు హ్యాంగింగ్’ అని సెర్చ్ చేసి.. అందులో చూపించినట్టే చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ గోవిందరావు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పెదబొడ్డేపల్లి థెరిసా కాలనీలో ఉంటున్న మంత్రి సత్యనారాయణ, భవానీల ఏకైక కుమార్తె మౌనిక కాకినాడ జేఎన్‌టీయూలో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం సహకరించక సెమిస్టర్ పరీక్షలు కూడా రాయలేకపోయింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నట్టు చనిపోయే ముందు మౌనిక తన డైరీలో రాసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 2019కి ముందు మంత్రి సత్యనారాయణ కుటుంబం చోడవరంలో నివాసం ఉండేది. అక్కడ కళాశాలలో జరిగిన చిన్న ఉదంతంతో మౌనిక మానసిక ఆరోగ్యం దెబ్బతింది. తల్లిదండ్రులు విశాఖపట్నంలో నెల రోజులు వైద్యం చేయించారు. తర్వాత చోడవరం నుంచి పెదబొడ్డేపల్లి థెరిసా కాలనీకి వచ్చారు. తల్లి భవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.