Shock to YCP : వై..ఛీ..పో!

ABN , First Publish Date - 2023-03-18T03:07:26+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్రులు అధికార పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. ‘వై.. ఛీ...పీ... వెళ్లిపో’ అని తేల్చి చెప్పారు. అధికారాన్ని అడ్డగోలుగా వాడినా, భారీగా ప్రలోభాలకు గురి చేసినా... ఆశించిన ఫలితం రాకపోవడంతో వైసీపీ నేతలు బేల మొహం వేశారు. ‘పరిపాలనా ..

Shock to YCP : వై..ఛీ..పో!

ఉత్తరాంధ్రలో అధికార పార్టీకి ఛీత్కారం

పట్టభద్ర స్థానంలో బలమైన తీర్పు

తెలుగుదేశానికే జైకొట్టిన విద్యావంతులు.. ‘రాజధాని’ పేరుతో వైసీపీ వ్యూహం

ఈ ఎన్నిక రెఫరెండంగా ప్రచారం.. ఓడితే రాజధాని గల్లంతని బెదిరింపు

ప్రలోభాలు, అధికార దుర్వినియోగం.. అయినా గెలుపు గల్లంతుతో షాక్‌

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్ర పట్టభద్రులు అధికార పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. ‘వై.. ఛీ...పీ... వెళ్లిపో’ అని తేల్చి చెప్పారు. అధికారాన్ని అడ్డగోలుగా వాడినా, భారీగా ప్రలోభాలకు గురి చేసినా... ఆశించిన ఫలితం రాకపోవడంతో వైసీపీ నేతలు బేల మొహం వేశారు. ‘పరిపాలనా రాజధానిగా విశాఖ’ నిర్ణయానికి ఈ ఎన్నికనే రెఫరెండంగా భావిస్తామని బీరాలు పలికినవారు మౌనముద్ర దాల్చారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,00,926 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎనిమిది రౌండ్లలో... మొదటి నుంచి చివరి దాకా టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకే ఆధిక్యం లభించింది. ఒక్కటంటే ఒక్కరౌండ్‌లోనూ వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు 82,956 (43.88ు) ఓట్లు సాధించారు. వైసీపీకి 55,641 (29.43ు) ఓట్లు వచ్చాయి. అంటే... తొలి ప్రాధాన్య ఓట్లలో టీడీపీ 27,315 ఓట్ల మెజారిటీ సాధించింది. రెండో ప్రాధాన్య 11,551 ఓట్లు రావడం, టీడీపీ గెలుపు ఖరారు కావడమే మిగిలింది!

‘రాజధాని’ చుట్టూ

ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఇచ్చిన తీర్పు వైసీపీ నేతలకు మింగుడు పడటంలేదు. ప్రభుత్వంపై విద్యావంతుల్లో ఇంత వ్యతిరేకత ఉందా... అని తలలు పట్టుకుంటున్నారు. నిజానికి... ఈ ఫలితం చుట్టూ ప్రభుత్వ పెద్దలు భారీ వ్యూహమే పన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకుంటున్నారన్న తమ ప్రచారానికి... ఈ ఫలితంతో ముడిపెట్టాలనుకున్నారు. ‘‘విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలన్న మా నిర్ణయానికి ఈ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తాం’ అని కొందరు వైసీపీ నేతలు ప్రకటించారు. అంతేకాదు... ‘‘గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించకపోతే విశాఖలో రాజధాని ఏర్పాటుకు అడ్డంకులు ఎదురవుతాయి’’ అంటూ బెదిరింపులకు దిగారు. విశాఖలో రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పుకొనేందుకు అడ్డగోలుగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పార్టీ ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడే తిష్ఠ వేశారు. ‘‘ఖర్చుకు వెనకాడవద్దు. ఎంతైనా పెట్టండి. సీటు మాత్రం గెలవాలి’’ అంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ‘చెడ్డపేరు వస్తుందనో, జనం ఏమైనా అనుకుంటారనో వెనుకంజ వేయవద్దు. గెలవడమే ముఖ్యం. ఇందుకు ఏమైనా చేయండి’ అని ఒక నాయకుడు పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపించారు. క్షేత్రస్థాయిలో బెదిరింపులు, ప్రలోభాలకు తెరలేపారు. కొన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులతోపాటు ఎంపిక చేసిన వర్గాలకు వెండి బిస్కెట్లు పంపిణీ చేశారు. ఓటుకు వెయ్యి నుంచి 5వేల వరకూ పంచిపెట్టారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని భావించినచోట వారి ఓట్లు గల్లంతు చేశారు. బోగస్‌ ఓటర్లను చేర్చారు. ఏయూ వీసీ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థితోపాటు వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇన్ని దారుణాలకు పాల్పడినా... వైసీపీకి గెలుపు దక్కలేదు. పట్టభద్రులు ఇచ్చిన తీర్పుతో అధికార పార్టీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావం ఉండదు. మరింత జాగ్రత్తగా పనిచేసేలా ఈ ఫలితం ఉపయోగపడుతుంది’’ అనే ప్రచారం మొదలుపెట్టారు.

వచ్చినప్పటి నుంచీ వేధింపులే

అధికారంలోకి వచ్చినప్పటి నుంచే విశాఖపట్నంపై వైసీపీ కన్నేసింది. ‘ఉత్తరాంధ్రను ఉద్ధరించే’ పేరుతో విలువైన భూముల్లో పాగా వేయడం మొదలుపెట్టారు. ఎన్నో విలువైన ఆస్తులు చేతులు మారాయి. ప్రశాంత విశాఖలో సీఎం సొంత జిల్లా మనుషుల పంచాయితీలు పెరిగిపోయాయి. రాజకీయాలు, వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌, క్రీడా సంఘాలు... ఇలా అన్నిచోట్లా ఓ సామాజిక వర్గం ఆధిపత్యం పెరిగిపోయింది. రాజధాని ఏర్పాటువుతుందని చెబుతున్న ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నీ ఓ సామాజిక వర్గం చేజిక్కించుకుంది. ‘‘వైసీపీ ప్రేమ ఉత్తరాంధ్రపైన కాదు! ఇక్కడి ఆస్తులపైనే’’ అని జనానికి ఎప్పుడో అర్థమైంది. దాని ఫలితమే... పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-03-18T03:07:26+05:30 IST