ఆగని హోరు
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:36 AM
జగన్ ప్రభుత్వం చేసిన మహా మోసానికి, మాయమాటల మహాద్రోహానికి బలైన రాజధాని రైతులు మొదలుపెట్టిన ‘అమరావతి పోరాటం’ నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.
అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు
ఏకైక రాజధాని నినాదంతో ఎలుగెత్తిన అన్నదాత
వైసీపీ 3 రాజధానుల కుయుక్తులపై నిత్యపోరు
అవమానాలు ఎదురైనా, వేధింపులు వెంబడించినా
దాడులు, దౌర్జన్యాలతో బెదిరించినా వెన్నుచూపని రైతన్న
ప్రతి మలుపులోనూ వారినే వరించిన న్యాయం
అమరావతి అజరామరం
జగన్ ప్రభుత్వం చేసిన మహా మోసానికి, మాయమాటల మహాద్రోహానికి బలైన రాజధాని రైతులు మొదలుపెట్టిన ‘అమరావతి పోరాటం’ నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. పాలకపార్టీ వంచనకు, విద్రోహానికి వ్యతిరేకంగా మట్టి మనుషులు చేపట్టిన ఉద్యమం అనతికాలంలోనే మహోద్యమంగా అవతరించి వైసీపీ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. ప్రజా రాజధానిగా వెలుగొందాల్సిన అమరావతిని చిదిమేయడానికి పన్నిన ప్రతి పన్నాగాన్నీ భగ్నం చేసింది. మూడు రాజధానుల కుట్రను ఎండగట్టి అటు న్యాయస్థానాల్లోను, ఇటు ప్రజాకోర్టులోను
ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టింది!!
గుంటూరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం కోసం, రాజధాని అమరావతి కోసం తాత ముత్తాతల కాలం నుంచి తమకు పట్టెడన్నం పెట్టిన వేలాది ఎకరాలను తృణప్రాయంగా త్యాగం చేసిన అన్నదాతలు.. జగన్ సర్కారు చేసిన వంచనపై ఎగరేసిన తిరుగుబాటుకు 4 ఏళ్లు నిండాయి. పాలకుల దుర్మార్గాలు, వైసీపీ నేతల దౌర్జన్యాలు, ప్రభుత్వాధికారుల వేధింపులు, పోలీసుల అణచివేతలు, లాఠీల కాఠిన్యాలు, గుండెలను పిండిచేసే మాటల తూటాలు, అవమానాలు, ఛీత్కారాలు, అక్రమ కేసులు.. ఇలా ముప్పేట ఎన్ని ఎదురైనా సడలని సహనంతో, మొక్కవోని దీక్షతో
సాగిన సగటు రైతుల సమరానికి నాలుగేళ్లు నిండాయి.
పోరాటానికి నాంది ఇదీ!
రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఎకరంలోపు భూమి ఉన్నవారు 20 వేల మంది, 5 ఎకరాలలోపు వారు 8,500 మంది ఉన్నారు. రాజధాని నిర్మాణంకోసం భూములిచ్చిన వారంతా తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతో రాజధాని నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వం వారిని ఊహించని విధంగా మోసం చేసింది. 2019 డిసెంబరు 17న సీఎం జగన్ శాసన సభలో చేసిన ‘మూడు రాజధానుల’ ప్రకటన రాజధాని వాసులను కుదిపేసింది. ఆ మర్నాడే అంటే 2019 డిసెంబరు 18న రాజధాని ఉద్యమం ఊపిరిపోసుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఉద్యమం క్రమంగా రాజధాని గ్రామాలకు విస్తరించింది. 19వ తేదీన రైతులు బంద్ నిర్వహించారు. రైతులకు మద్ధతుగా గుంటూరు, విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రైతుల ఉద్యమానికి అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, మధు తదితరులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్ధతు తెలిపారు.
చిన్నా పెద్ద ఒక్కటై
రాజధాని కోసం వేలాది ఎకరాలు తృణప్రాయంగా ఇచ్చిన రైతులు నమ్మించి నట్టేట ముంచిన వైసీపీ ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు. అనతి కాలంలోనే రాజధాని సమరం రాష్ట్ర ప్రజలందరి ఉద్యమంగా మారింది. రాజధాని రైతులు, మహిళలు, రైతుకూలీలు, దళిత బహుజన వర్గాలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ఉరకలెత్తించాయి. పోలీసుల నిర్బంధాలు, కవాతులు, లాఠీల కరాళ నృత్యాలు, దేహాలపై రక్తమోడుతున్న గాయాలు.. ఇవేవీ పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాయి. అందుకే ఈ మహా ఉద్యమం దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచిపోయింది. మూడు రాజధానుల ప్రకటన చేసింది మొదలు, ఆర్-5 జోన్ ఏర్పాటు, అందులో ఇళ్ల నిర్మాణం వరకు వైసీపీ ప్రభుత్వం అమరావతిపై చేయని కుట్ర లేదు. ప్రజా రాజధానిపై పగబట్టిన ప్రభుత్వం.. ఉద్యమ గళాలను అణిచేయడానికి చేయని ప్రయత్నమూ లేదు. మహిళలు స్నానం చేసే సమయంలో డ్రోన్ కెమేరాలు తిప్పడం, అడ్డుకున్న 40 మందిపై కేసులు పెట్టి 20 రోజులపాటు జైలుపాలు చేయడం మొదలు, ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం వరకు నాలుగేళ్ల ఉద్యమ క్రమంలో 2000 మందిపై 600కు పైగా కేసులు బనాయించారు. మరోవైపు అమరావతిపై బెంగతో గడిచిన నాలుగేళ్లలో 240 మంది రైతులు గుండెలు పగిలి చనిపోయారు. దీక్షా శిబిరాలు, దేవస్థానాలు, న్యాయస్థానాలే పోరాట వేదికలుగా నాలుగేళ్లపాటు సాగిన ఉద్యమంలో మరిచిపోలేని విజయాలను రైతులు సొంతం చేసుకున్నారు. పలు సందర్భాల్లో న్యాయస్థానాల్లో ఎదురైన అనూహ్య ఓటములను సైతం విజయ సోపానాలుగా మలుచుకున్న రైతు ఉద్యమం తాజాగా ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించి మరో విజయాన్ని నమోదు చేసింది.
చరిత్రాత్మక తీర్పుతో..
అమరావతి వ్యవహారంపై 2021, మార్చి 4న హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మూడు రాజధానుల చట్టాన్ని కొట్టివేస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లోగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లోగా రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. తీర్పు వచ్చిన 8 నెలల వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఆ తరువాత సుప్రీం కోర్టులో అప్పీలు వేయడంతో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
ఉద్యమ ఘట్టాలు..
సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2019, డిసెంబరు 17న సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులను ప్రకటించారు. అదే రోజున తుళ్లూరులో రైతులు రోడ్లమీదకి వచ్చి ఆందోళన తెలిపారు.
డిసెంబర్ 19న అమరావతిలో రైతులు బంద్ పాటించారు. ప్రభుత్వం వెంటనే 30 యాక్ట్, 144 సెక్షన్ అమలు చేసింది. వందల మంది పోలీసులు రాజధాని గ్రామాల్లో కవాతులు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
డిసెంబరు 31న తమను కారుణ్య మరణాలకు అనుమతించాలని రాజధాని రైతులు రాష్ట్రపతికి లేఖలు రాసి తమ ఆవేదనను తెలిపారు.
2020 జనవరి 3న అమరావతి మహిళా రైతులపై పోలీసులు దాడి చేశారు. దీనికి నిరసనగా రాజధాని గ్రామాలు బంద్ నిర్వహించాయి.
జనవరి 9న విపక్ష నేత చంద్రబాబు తలపెట్టిన బస్సుయాత్రను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే బైటాయించి నిరసన తెలిపారు.
జనవరి 10న దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకునేందుకు వెళుతున్న మహిళలపై పోలీసులు దాడి చేశారు. గుంటూరు ఎస్పీ విజయరావు సైతం లాఠీపట్టి కొట్టడం చర్చకు దారితీసింది. మహిళల జుట్టు పట్టుకు లాగడం, ఇనుప కంచెను మహిళలపై వేసి ఒళ్లు చీరుకుపోయేలా చేయడం వంటి పోలీసుల అనైతిక చర్యలపై హైకోర్టు జనవరి 13న సూమోటోగా కేసు నమోదు చేసింది.
జనవరి 20న అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. రైతులు, మహిళలు, రైతుకూలీలు, దళిత బహుజనులు ఎవరికి వారుగా చెట్లు, పొదలు, తుప్పల మాటున దాక్కొంటూ అసెంబ్లీని చేరుకున్నారు. ఈ క్రమంలో పురుష పోలీసులు మహిళా రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు.
2020, మార్చి 20న కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అలాంటి సమయంలోనూ ఇళ్లలోనే నిరసన దీక్షలు కొనసాగించారు.
2021, జూలై 4 నాటికి ఉద్యమం 200 రోజులకు చేరుకుంది. 200 నగరాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు కొవ్వొత్తుల ప్రదర్శన చేసి ఉద్యమానికి మద్దతు తెలిపారు.
అక్టోబరు 12 నాటికి ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. రాజధాని పోరులో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా తుళ్లూరులో ‘ఆత్మబలిదాన యాత్ర’ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉద్యమంలో అప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 92 మంది రైతులు, రైతుకూలీల చిత్రాలు ఉంచిన పాడెలను మోస్తూ పాదయాత్ర నిర్వహించారు. అప్పటి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని, బొత్సా సత్యనారాయణ, అప్పలరాజు వ్యాఖ్యల్ని నిరసిస్తూ మంత్రుల వేషధారులకు ఉరి బిగిస్తూ నిరసన ప్రకటించారు.
2021, జనవరి 20 నాటికి ఉద్యమం 400 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చేపట్టిన ‘రాజధాని సంకల్ప ర్యాలీ’ విజయవంతమైంది.
2021, ఏప్రిల్ 31 నాటికి అమరావతి ఉద్యమం 500 రోజుల మైలురాయిని చేరింది. పలు పార్టీలు, జేఏసీ నేతలు ప్రధాని మోదీకి లేఖలు రాశారు.
2021, ఆగస్టు 8 నాటికి ఉద్యమం 600 రోజుకు చేరింది. ఈ సమయానికి మరణించిన రైతులు, కూలీల సంఖ్య 170కి చేరింది.
నవంబరు 16న అమరావతి ఉద్యమం 700వ రోజుకు చేరుకుంది. ఈ సమయంలోనే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపింది. ఇది అమరావతి ఉద్యమ నైతిక విజయంగా ఉద్యమకారులు పేర్కొన్నారు.
మహోజ్వల ఘట్టంగా పాదయాత్ర
2021, నవంబరు 1 రాజధాని రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పాదయాత్ర ఉద్యమ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు రాజధానిపై వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేసిన అ సత్య ప్రచారాలన్నింటినీ ఈ పాదయాత్ర తిప్పికొట్టింది. నవంబరు 1న హైకోర్టు వద్ద మొదలైన పాదయాత్ర డిసెంబరు 17న తిరుమల శ్రీవారిని చేరే వరకు నిరంతరాయంగా సాగింది. అమరావతి సమస్య ఆ ప్రాంత వాసులదే కాదని, ఇది రాష్ట్ర సమస్య అని ప్రజలను చైతన్య పరచడంలో రైతులు విజయవంతమయ్యారు.
అమరావతి ప్రజాదీక్ష
2022, ఫిబ్రవరి 24 నాటికి ఉద్యమం 800వ రోజు సందర్భంగా రాజధాని రైతులు అమరావతి ప్రజాదీక్ష పేరుతో దీక్ష చేపట్టారు. 24 గంటల నిరసన దీక్షలో 800 మంది, 12 గంటల దీక్షలో 2000 వేల మంది పాల్గొని నిరాహార దీక్ష చేశారు. జూన్ 4 నాటికి అమరావతి ఉద్యమం మొదలై 900 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రైతులు న్యాయదేవతకు క్షీరాభిషేకం చేశారు.
మలివిడత పాదయాత్రపై..
అమరావతి ఉద్యమం వెయ్యి రోజుల మైలురాయిని చేరిన సందర్భంగా రాజధాని రైతులు ‘అమరావతి నుంచి అరసవల్లి’ వరకు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వరకు పాదయాత్రను కొనసాగించారు. అర్ధాంతరంగా ఆగిపోయిన పాదయాత్రను రైతు సంఘం ముఖ్యనేతలు 2023, ఏప్రిల్ 2న అరసవిల్లి దేవస్థానంలో ముగించారు. ఉద్యమం ఉద్యమం 1200 రోజును చేరిన సందర్భంగా ‘దగా పడ్డ రైతు.. దోపిడీకి గురవుతున్న ఆంధ్రాపౌరులు’ అనే అంశంపై మందడం శిబిరంలో సదస్సు నిర్వహించారు. బీజేపీ నేత సత్యకుమార్ ‘200 మంది రైతులను బలితీసుకున్న జగన్‌పై హత్యానేరం మోపాలంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సభ నుంచి తిరిగి వెళుతున్న క్రమంలో నందిగం సురేశ్ వర్గం ఆయనపై దాడి చేసి కారును ధ్వంసం చేసింది.