Cyclone Michoung : ముంచుకొస్తున్న తుఫాన్
ABN , First Publish Date - 2023-12-03T03:06:25+05:30 IST
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది.
తుఫానుతో 144 రైళ్ల రద్దు
జాబితాలో వందేభారత్, దురంతో సహా పలు
ప్రధాన రైళ్లు.. చెన్నై మార్గంలో దాదాపు అన్నిటికీ బ్రేక్
దక్షిణ కోస్తాలో మొదలైన వర్షాలు, గాలులు
నేటి నుంచి మరింత పెరిగే అవకాశం
4,5,6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సీమ, కోస్తాలోని పలు జిల్లాలపై ప్రభావం
5న బందరు-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం
వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు
కోస్తా ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక
వర్షాలు, గాలులతో కోస్తాలో ఆస్తి నష్టానికి అవకాశం
తీరం దాటే సమయంలో వాహనాల రాకపోకలూ
నిలిపివేయాలని వాతావరణ శాఖ సూచన
విశాఖపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు గంటకు సగటున 16 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో పయనించింది. శనివారం ఉదయం 11.30 గంటలకు నెల్లూరుకు 540 కిలోమీటర్లు ఆగ్నేయంగా, బాపట్ల, మచిలీపట్నానికి 650 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా మారుతుంది. దీనికి మయన్మార్ దేశం సూచించిన ‘మిచౌంగ్’ అని పేరు పెట్టనున్నారు. తరువాత వాయువ్యంగా పయనించి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నాలుగో తేదీ ఉదయానికల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఉత్తరంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తాకు సమాంతరంగా పయనించి ఈ నెల ఐదో తేదీ ఉదయానికి ఒంగోలు-మచిలీపట్నం మధ్య చీరాల లేదా బాపట్లకు సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండానికి అనుకూలంగా తూర్పు, పడమర గాలులు వీస్తున్నాయి. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు ఉన్నాయి. వీటి ప్రభావంతో తీవ్ర వాయుగుండం బలపడి ఆదివారం నాటికి తుఫాన్‌గా మారి దక్షిణ కోస్తాలో తీరం దాటిన తరువాత కోస్తా మీదుగా పయనించనున్నది. ఈ క్రమంలో ఐదో తేదీ రాత్రి వరకు తుఫాన్‌గా కొనసాగుతుంది. తరువాత తీవ్ర వాయుగుండంగా స్వల్పంగా బలహీనపడి ఉత్తర కోస్తా మీదుగా ఒడిశాలో ప్రవేశిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆదివారం రాత్రి నుంచి ఆరో తేదీ వరకు కోస్తాపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఈ జిల్లాలపై ప్రభావం..!
తీవ్ర వాయుగుండం ప్రభావంతో శనివారం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. బాపట్ల, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, కడప, నంద్యాల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. నాలుగో తేదీన కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయి. ఇంకా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఐదో తేదీన కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, కడప, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. ఆరో తేదీన ఉత్తరకోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గాలుల ఉధృతి
దక్షిణ కోస్తాలో శనివారం గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆదివారం కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తుఫాన్ కోస్తా తీరం దగ్గరకు రానున్న నేపథ్యంలో నాలుగు, ఐదు తేదీల్లో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
తీవ్ర నష్టానికి అవకాశం
తుఫాన్ తీరం దాటే సమయంలో, అంతకుముందు, ఆతర్వాత కోస్తాపై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదో తేదీన తుఫాన్ తీరం దాటే సమయంలో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. ఇంకా తుఫాన్ కోస్తా మీదుగా పయనించే సమయంలో భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నదులు, వాగులకు ఆకస్మిక వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉంది. దాంతో రోడ్లపై రాకపోకలు, నగరాలు, పట్టణాల్లో అండర్‌పాసులు మూసివేయాలని వాతావరణ శాఖ సూచించింది. గాలుల ఉధృతికి పూరిళ్లు, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, రేకుల ఇళ్లు పైకప్పులు ఎగిరిపోవడం, కూలిపోవడం, చెట్లు కూలిపోవడం వంటివి జరుగుతాయని హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేయాలని సూచించింది. ఇంకా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమ్యూనికేషన్ టవర్లు దెబ్బతింటాయని పేర్కొంది. గాలులు, భారీవర్షాలకు వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లుతుందని, వరి కోతలు నిలిపివేయాలని, పొలాల్లో ఉన్న పంటను ఒడ్డుకు చేర్చుకునేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
అధికారులూ అప్రమత్తం: సీఎస్
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం విజయవాడ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడాలని చెప్పారు. కోతకోసి పనలపై ఉన్న పంటను కాపాడుకునేలా రైతులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులను జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణకు అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్‌అండ్‌బీ, విద్యుత్, టెలికం తదితర శాఖలను ఆదేశించారు. కాగా, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని విద్యుత్తు సరఫరా సంస్థలకు, నెట్‌వర్క్ విభాగాన్ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అప్రమత్తం చేశారు. శనివారం ఆయన విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు ఫృద్వీతేజ్, పద్మాజనార్ధనరెడ్డి, సంతో్‌షరావుతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. విద్యుత్తు సంస్థల ఆస్తులకు భారీగా నష్టం వస్తుందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలను సీరియ్‌సగా తీసుకోవాలన్నారు.
144 రైళ్లను రద్దు చేసిన రైల్వే
విజయవాడ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మిచౌంగ్ తుఫాన్ కారణంగా రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు భారీగా రద్దయ్యాయి. విజయవాడ మీదుగా గ్రాండ్ మెయిన్ ట్రంక్ లైన్ మీద రాకపోకలు సాగించే రైళ్లను భారీ సంఖ్యలో రైల్వే శాఖ రద్దు చేసింది. శనివారం రాత్రి 7 గంటల సమయానికి మొత్తం 144 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందులో విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌లను కూడా రద్దు చేశారు. అవిజయవాడ నుంచి న్యూఢిల్లీ వెళ్లే దురంతో సూపర్‌ఫాస్ట్ కూడా రద్దయ్యింది. విజయవాడ-చెన్నై వెళ్లే పినాకిని రద్దయ్యింది. విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్, విజయవాడ-గూడూరు, నర్సాపూర్-కొట్టాయం, కాకినాడ టౌన్-తిరుపతితోపాటు సికింద్రాబాద్-విజయవాడ, లింగంపల్లి-విజయవాడ మధ్యన నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ - విశాఖ, విజయవాడ-బెంగళూరు మధ్యన నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి.