ఉద్యోగుల జేబుకు చిల్లు

ABN , First Publish Date - 2023-03-26T03:58:48+05:30 IST

దేశంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది.

ఉద్యోగుల జేబుకు చిల్లు

రీ సర్వే నిధులు సరిగా విడుదల చేయని సర్కారు

కొన్ని క్షేత్రస్థాయి ఖర్చులు ఉద్యోగులపైనే

అప్పులతో సర్వేయర్లు, వీఆర్వోలకు తిప్పలు

బిల్లులు చెల్లిస్తామన్న హామీలు గాలికి

దాదాపు రూ.20 కోట్ల బకాయిలు

అడిగితే నోటీసులు, హెచ్చరికలు

వీఆర్వోలకు టీఏ, డీఏలూ లేవు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేశంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. మరోవైపు ఉద్యోగుల జేబులను గుల్ల చేస్తోంది. వేయి కోట్ల రూపాయల వ్యయంతో భూముల సమగ్ర సర్వే ప్రాజెక్టునైతే ప్రారంభించింది కానీ అమలుకు నిధులు విడుదల చేయడం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులతోనే ఖర్చులు పెట్టిస్తోంది. ఉన్నతాధికారులతో మౌఖిక ఆదేశాలు ఇప్పిస్తుండటంతో కింది స్థాయి సిబ్బంది విలవిల్లాడి పోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెడుతున్నారు. ఈ బిల్లులకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ రాక, కొత్త అప్పులు తీసుకురాలేక నరకయాతన పడుతున్నారు. క్షేత్రస్థాయిలో చిరుద్యోగుల శ్రమతో కార్యక్రమాలు నడుస్తుంటే.. ఉన్నతాధికారులు కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటున్నారు. అన్ని పనులు వేగంగా జరిగిపోతున్నాయని సర్కారుకు నివేదిస్తున్నారు. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వేను 2020 డిసెంబరులో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వ్యయం 1000 కోట్లు. 32వేల మంది రె వెన్యూ, సర్వే సిబ్బంది ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు. ఒక్కో గ్రామంలో సగటున 15మంది పనిచేయాల్సి ఉంటుంది. డ్రోన్‌ సర్వే, ఆర్థోరె క్టిఫైడ్‌ ఇమేజ్‌ (ఓఆర్‌ఐ)ల ముద్రణ, గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్‌ల ఏర్పాటు, రికార్డుల తయారీ, ముద్రణ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. ఇందుకోసం భారీగా స్టేషనరీ, కంప్యూటర్లు, ప్రింటర్లు అవసరం. ఈ ప్రాజెక్టుకు అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరించాలి. నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖది. అయితే సర్వే మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు అమలుకు సర్కారు సరిగా నిధులు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు ఎప్పుడో ఆగిపోవాలి. కానీ అధికారులు క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు, వీఆర్వోలపై ఒత్తిడి తీసుకొచ్చి వారితో కొన్ని ఖర్చులు పెట్టిస్తున్నారు. ‘ముందు మీరు ఖర్చు పెట్టండి. తర్వాత రీయింబర్స్‌ చేయిస్తాం’ అంటూ మౌఖికంగా ఆదేశించి ఉద్యోగుల జేబుల్లో నుంచి డబ్బు తీయిస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్దం. కానీ ప్రభుత్వాన్ని పదే పదే నిధులు అడగలేక, పనులు ఆగిపోతే తమను అసమర్థులుగా పరిగణిస్తారని చిరుద్యోగులపై ఉన్నతాధికారులు ప్రతాపం చూపిస్తున్నారు.

బిల్లులడిగితే.. నోటీసులు

సర్వే బృందాలను గ్రామాలకు తరలించేందుకు వాహనాలు సమకూర్చడం.. వారికి వసతి, భోజనాలు ఏర్పాటు చేయడం.. సర్వేకు అవసరమైన స్టేషనరీ కొనుగోలు ఖర్చులు సర్వేయర్లు, వీఆర్వోలే భరిస్తున్నారు. రెండున్నరేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. తాము పెట్టిన ఖర్చులకు బిల్లులు చెల్లించాలంటూ సిబ్బంది లేఖలు ఇస్తున్నారు. వాటిని తొలుత ట్రెజరీకి పంపించాలి. ఆ తర్వాత సీఎ్‌ఫఎమ్‌ఎ్‌సలో ఆమోదించాలి. అప్పుడే వారికి సొమ్ములు వస్తాయి. అయితే బిల్లులను ట్రెజరీకి పంపించడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది. ఎన్నో అడ్డంకులు దాటుకొని సీఎ్‌ఫఎమ్‌ఎ్‌సకు వెళ్లాక.. అక్కడ డబ్బులు లేవని బిల్లులు వెనక్కి పంపిస్తున్నట్లు తెలిసింది. ఎవరైనా నోరు తెరిచి గట్టిగా మాట్లాడితే.. సకాలంలో సర్వే చేయలేకపోయారంటూ నోటీసులు ఇస్తున్నారు. బిల్లులు అడిగి అందరి దృష్టిలో పడిన సర్వేయర్లకు జేసీల ద్వారా షోకాజ్‌ నోటీసులు, మెమోలు ఇప్పించారు. సర్వేయర్లకు రావాల్సిన బకాయిలు 15 కోట్ల దాకా ఉంటాయని అంచనా.

వీఆర్వోలదీ అదే పరిస్థితి

వీఆర్వోల పరిస్థితీ భిన్నంగా లేదు. బిల్లులు రీయింబర్స్‌మెంట్‌ కోరితే తహశీల్దార్‌ ఆఫీసు నుంచి ఒత్తిళ్లు, పని సరిగ్గా జరగడం లేదంటూ హెచ్చరికలు వస్తున్నాయని వాపోతున్నారు. రిపోర్టుల ప్రింటింగ్‌, స్టేషనరీ ఖర్చులు తమపైనే వేస్తున్నారని, ఇప్పటికే చాలా అప్పులు చేశామని ఓ వీఆర్వో ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. రికార్డుల తయారీ, ప్యూరిఫికేషన్‌ పనుల కోసం కంప్యూటర్‌, ప్రింటర్‌ ఇవ్వాలని కోరుతున్నా రెవెన్యూ శాఖ స్పందించలేదు. 100కి.మీ.కు పైగా దూరంగా ఉన్న గ్రామాలకు డిప్యూటేషన్‌ వేస్తున్నారని వీఆర్వోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పేరిట రాత్రింబవళ్లు పనిచేస్తున్న తమకు టీఏ, డీఏలు ఇవ్వడం లేదని, డిప్యూటేషన్‌ పేరిట అదనపు భారం మోపుతున్నారని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వీఆర్వో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చే 15వేల జీతం నుంచే ఇవన్నీ భరించడం కష్టంగా ఉందని, పాత బకాయిలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటి వరకు 3 లక్షలు ఖర్చు పెట్టానని, అప్పులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీఆర్వోలకు దాదాపు 4.50 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం.

మా బిల్లులు వెంటనే చెల్లించండి

భూముల సర్వే పేరిట వీఆర్వోలు ఇప్పటి దాకా చేసిన ఖర్చును వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు నేతృత్వంలో ప్రతినిధులు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సాయిప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీఆర్వోలకు టీఏ, డీఏలు ఇవ్వాలని, రీ సర్వేలో పాల్గొంటున్న వారికి కంప్యూటర్‌, ఇతర సామగ్రి సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2023-03-26T03:58:48+05:30 IST