Share News

విద్యార్థుల జేబుకు చిల్లు

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:52 AM

విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు అందాల్సిన సొమ్ము రూ.మూడున్నర వేల కోట్ల మేర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎగ్గొట్టారు.

విద్యార్థుల జేబుకు చిల్లు

విద్యా దీవెన సొమ్ము రూ. 3,500 కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

రెండేళ్లలో లబ్ధిదారుల సంఖ్యలో3 లక్షలు కోత

దగాపడిన విద్యార్థి లోకం ‘సైకో’ను ఇంటికి పంపాలి: టీడీపీ

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు అందాల్సిన సొమ్ము రూ.మూడున్నర వేల కోట్ల మేర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎగ్గొట్టారు. జగన్‌ మోసంతో ఆ మేరకు విద్యార్థుల జేబుకు చిల్లు పడింది. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వారు తమ జేబుల్లో నుంచి కట్టుకోవాల్సి వచ్చింది’’ అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం శనివారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన అని పేరు పెట్టింది. కళాశాలలకు డబ్బు చెల్లించే బదులు విద్యార్థుల తల్లుల ఖాతాలో వేయడం మొదలు పెట్టింది. వాళ్లు ఆ డబ్బును బ్యాంకులో నుంచి డ్రా చేసి తీసుకువెళ్లి కళాశాలలో చెల్లించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ డబ్బు విడుదల చేస్తామని చెప్పారు. కాని ఈ నాలుగేళ్లలో నాలుగు క్వార్టర్లపాటు ఈ డబ్బులు విడుదల చేయకుండా ఎగ్గొట్టారు. 20-21లో ఒక క్వార్టర్‌, 21- 22లో ఒక క్వార్టర్‌, 22-23లో రెండు క్వార్టర్ల డబ్బులు ఎగ్గొట్టారు. ఒకో విడతకు రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.28 వందల కోట్లు ఎగ్గొట్టారు. ఇది ఎప్పుడు ఇస్తారో చెప్పరు. ఫీజు మొత్తం చెల్లించకపోతే కళాశాలలు ఊరుకోవు. ప్రభుత్వం ఎగ్గొట్టిన డబ్బును విద్యార్థుల కుటుంబాలు తమ జేబుల్లో నుంచి కళాశాలలకు చెల్లించాల్సి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. రద్దు చేయడానికి ముందు 19-20 సంవత్సరానికి సంబంధించి పీజీ విద్యార్థులకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. రూ.450 కోట్లు ఇంతవరకూ చెల్లించలేదు. విద్యా దీవెన బకాయిలకు ఇది అదనం’ అని పట్టాభి చెప్పారు. జగన్‌ ప్రభుత్వం విద్యా దీవెన పథకం కింద లబ్ది పొందే విద్యార్థుల సంఖ్యను కూడా భారీగా తగ్గించేసిందని ఆరోపించారు. జగన్‌ సొంత పత్రికలో వచ్చిన ప్రకటనలను ఆయన ప్రస్తావించారు. రెండేళ్లలో విద్యార్థుల సంఖ్య మూడు లక్షలు ఎలా తగ్గిందంటూ ప్రశ్నించారు. జగన్‌రెడ్డి విద్యార్థుల పాలిట కంస మామ మాదిరిగా తయారయ్యాడని ధ్వజమెత్తారు. దగాపడిన విద్యార్థి లోకం ఈసారి ఎన్నికల్లో సైకో జగన్‌ను ఇంటికి పంపాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Dec 31 , 2023 | 03:52 AM