కొవ్వుకు చెక్‌ పెట్టే ప్రొటీన్‌ గుట్టు రట్టు

ABN , First Publish Date - 2023-06-02T04:22:39+05:30 IST

మన శరీరంలో ఉండే మంచి కొవ్వు.. క్యాలరీలను కరిగించి ఉష్ణోగ్రతగా మార్చి ఊబకాయంతో పోరాడడంలో ప్రధానపాత్ర పోషించే కీలక ప్రొటీన్‌ ఆకృతిని శాస్త్రజ్ఞులు గుర్తించారు.

కొవ్వుకు చెక్‌ పెట్టే ప్రొటీన్‌ గుట్టు రట్టు

న్యూఢిల్లీ, జూన్‌ 1: మన శరీరంలో ఉండే మంచి కొవ్వు.. క్యాలరీలను కరిగించి ఉష్ణోగ్రతగా మార్చి ఊబకాయంతో పోరాడడంలో ప్రధానపాత్ర పోషించే కీలక ప్రొటీన్‌ ఆకృతిని శాస్త్రజ్ఞులు గుర్తించారు. సాధారణంగా మన శరీరంలో రెండు రకాల కొవ్వు ఉంటుంది. మంచికొవ్వు (బ్రౌన్‌ ఫ్యాట్‌), చెడ్డ కొవ్వు (వైట్‌ ఫ్యాట్‌). వీటిలో వైట్‌ ఫ్యాట్‌ శక్తిని క్యాలరీల రూపంలో భద్రపరుస్తూ ఉంటుంది. అయితే, ఇది ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక మంచి కొవ్వు... రక్తంలో ఉండే చక్కెరలను, కొవ్వు కణాలను విడగొట్టి ఉష్ణోగ్రతను జనింపజేయడం ద్వారా... శరీర సాధారణ ఉష్ణోగ్రత పడిపోకుండా చేస్తుంది. ఈ ప్రక్రియలో దానికి సహకరించేది ‘అన్‌కప్లింగ్‌ ప్రొటీన్‌ (యూసీపీ1)’ అనే ప్రొటీన్‌. శరీరంలోని అదనపు క్యాలరీలను వేగంగా కరిగించేలా ఈ యూసీపీ1 ప్రొటీన్‌ను కృత్రిమంగా ప్రేరేపించగలిగితే.. ఊబకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించవచ్చు. కానీ, సమస్య ఏంటంటే ఇన్నాళ్లుగా ఈ ప్రొటీన్‌ ఆకృతి గురించి పూర్తి వివరాలు తెలియవు. దాదాపు 40 ఏళ్లుగా దానిపై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా కేంబ్రిడ్జి, పెన్సిల్వేనియా, ఈస్ట్‌ ఆంగ్లియా, ఫ్రీ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు యూసీపీ1 ప్రొటీన్‌పై పరిశోధనలు చేసి... దాని వివరాలను, బ్రౌన్‌ ఫ్యాట్‌ కణాలపై అది ఎలా పనిచేస్తుంది? అనే వివరాలను తెలుసుకోగలిగారు.

Updated Date - 2023-06-02T04:22:39+05:30 IST