రోడ్డెక్కిన క్రషర్ యజమానులు
ABN , First Publish Date - 2023-06-07T03:34:55+05:30 IST
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని క్వారీలు, క్రషర్ నిర్వాహకులు రోడ్డెక్కారు. విశ్వసముద్ర సంస్థ ధోరణిని నిరసిస్తూ నరసాపురం వద్ద రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు.
● విశ్వసముద్ర సంస్థ తీరుపై నిరసన..
నరసాపురం వద్ద రహదారిపై ధర్నా
పొందూరు, జూన్ 6: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని క్వారీలు, క్రషర్ నిర్వాహకులు రోడ్డెక్కారు. విశ్వసముద్ర సంస్థ ధోరణిని నిరసిస్తూ నరసాపురం వద్ద రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు. మైనింగ్ సీనరేజీ చార్జీల వసూళ్ల బాధ్యతను విశ్వసముద్ర సంస్థకు వైసీపీ ప్రభుత్వం అప్పగించింది. దీంతో జిల్లాలో నల్లరాయి, గ్రానైట్, మట్టి, కంకర క్వారీలకు సంబంధించి ఈ సంస్థ సిబ్బంది చార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి ఒక యూనిట్‌కు (3 క్యూబిక్ మీటర్లు) రూ.633 చెల్లించేవారు. ఈ సంస్థకు అప్పగించిన తరువాత యూనిట్‌కు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా నల్లరాయి పిక్క లోడ్ ధర సుమారు రూ.1,500కు పెరిగింది. ఆ భారం వినియోగదారులపై పడుతోంది. విశ్వసముద్ర సంస్థ సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను అడ్డుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, డ్రైవర్లపై దాడి చేస్తున్నారని క్రషర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. మంగళవారం నరసాపురం వద్ద రాయి తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను ఆ సంస్థ సెక్యూరిటీ అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారంతా నరసాపురం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దాదాపు 2గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పొందూరు ఏఎస్‌ఐ రామచంద్రరావు సిబ్బందితో చేరుకొని.. ఇరువర్గాలతో చర్చించారు. సమస్య తాత్కాలికంగా పరిష్కరించి ట్రాక్టర్లను విడిచిప్టెడంతో యాజమానులు శాంతించారు.